కీరవాణి స్టూడియోలో 'వీరమల్లు'- పవన్ చేతుల్లో ఆస్కార్ అవార్డు, స్వరవాణికి సన్మానం-pawan kalyan meets oscar winner mm keeravani in studio chit chat harihara veramalla song ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  కీరవాణి స్టూడియోలో 'వీరమల్లు'- పవన్ చేతుల్లో ఆస్కార్ అవార్డు, స్వరవాణికి సన్మానం

కీరవాణి స్టూడియోలో 'వీరమల్లు'- పవన్ చేతుల్లో ఆస్కార్ అవార్డు, స్వరవాణికి సన్మానం

సంగీత దర్శకులు కీరవాణి వీరమల్లు సినిమా ప్రాణం పోశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇవాళ కీరవాణి స్టూడియోను సందర్శించిన పవన్ కల్యాణ్...ఆయనను సన్మానించారు. హరిహర వీరమల్లులో కీరవాణి స్వరపరిచిన సాంగ్ రేపు విడుదల కానుందని చెప్పారు.

కీరవాణి స్టూడియోలో 'వీరమల్లు'- పవన్ చేతుల్లో ఆస్కార్ అవార్డు, స్వరవాణికి సన్మానం

మనలోని పౌరుషం, వీరత్వం ఎన్నటికీ చల్లబడిపోకూడదని ప్రతి ఒక్కరినీ తట్టిలేపే, సలసల మరిగే నీలోని రక్తమే’ అని పాటకు సంగీత, సాహిత్యాలతో ప్రాణం పోశారు కీరవాణి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తాను హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’లో ఈ పాట వినిపిస్తుందన్నారు. నేటి పరిస్థితులలో మనందరిలో వీరత్వం చేవజారిపోకూడదని చర్నాకోలతో చెప్పినట్లు అనిపించిందన్నారు.

సంగీత దర్శకుడు కీరవాణి స్టూడియోను పవన్ కల్యాణ్ సందర్శించారు. కాసేపు కీరవాణితో ముచ్చటించి ఆయనను సన్మానించారు.

రేపు వీరమల్లు సాంగ్ రిలీజ్

ఈ పాటను 21వ తేదీన విడుదల చేయనున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి కీరవాణి అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఆ చిత్ర కథలోని భావోద్వేగాలను అగ్ర స్థాయికి తీసుకువెళ్తాయన్నారు. ఈ సినిమా కోసం కీరవాణి ఎంత తపన పడి స్వరాలు అందించారో తాను స్వయంగా చూశానన్నారు.

వీరమల్లుకు ప్రాణం పోశారు

"కీరవాణి ‘వీరమల్లు’కి ప్రాణం పోశారు అంటే అతిశయోక్తి కాదు. ‘మొదటిసారి మీతో చేస్తున్నాను అంటే... అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టు ఉండాలి కదా’ అనడం కీరవాణిలో అంకిత భావాన్ని తెలియచేస్తోంది"- పవన్ కల్యాణ్

ఆస్కార్ గ్రహీతతో మాట్లాడడం

"మంగళవారం ఉదయం ఆస్కార్ గ్రహీత కీరవాణిని కలిసి మాట్లాడడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. సంగీత దర్శకులు చక్రవర్తి దగ్గర శిష్యరికం నుంచి సరస్వతి పుత్రులైన వేటూరి సుందర రామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి వరకూ తనకున్న అనుబంధాన్ని, సంగీత సాహిత్యాల గురించి చెబుతుంటే సమయం తెలియలేదు"- పవన్ కల్యాణ్

వయొలిన్ నేర్చుకున్న రోజులు

"కీరవాణి దగ్గర ఉన్న వయొలిన్లు చూసి వాటి గురించి మాట్లాడుకొంటున్నప్పుడు – నేను వయొలిన్ నేర్చుకోవడం, జంట స్వరాల వరకూ నేర్చుకొని వదిలేయడం గుర్తు చేసుకున్నాను. చిదంబరనాథన్ ఇచ్చిన వయొలిన్ ను ఎంత భద్రంగా దాచుకున్నారో చూపించారు కీరవాణి"- పవన్ కల్యాణ్

32 కథల సంకలనం

"తెలుగు కథలను ప్రేమించే కీరవాణి తనకు అమితంగా నచ్చిన 32 కథలను ఒక సంకలనంలా చేసుకొన్నారు. వాటిని నాకు బహూకరించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. అందులో కీరవాణి రాసిన రెండు కథలు కూడా ఉన్నాయి. ఆయన సరిగమలతో బాణీలు కూర్చే కూర్పరి మాత్రమే కాదు. చక్కటి తెలుగు పదాలతో గీతాలు అల్లగల నేర్పరి కూడా"- పవన్ కల్యాణ్

ఎంతో తపన

'తన పదాలతో గీత రచయితలకు మార్గం వేస్తారు. తెరపై కనిపించేది రెండున్నర గంటల సినిమాయే... కానీ కీరవాణి రోజుల తరబడి, నెలల తరబడి ఆ సినిమా కోసం తపనపడతారు. సృజనాత్మక స్వరాలతో మైమరపిస్తూ తెలుగు పాటను ఆస్కార్ వేదికపైకి తీసుకువెళ్లారు' అని పవన్ కల్యాణ్ అన్నారు.

ఆస్కార్ అవార్డును చూడాలని పవన్ కల్యాణ్ కోరగా…కిరవాణి అవార్డును తీసుకొచ్చారు. ఆస్కార్ అవార్డును చేతుల్లోకి తీసుకున్న పవన్ ఆసక్తిగా పరిశీలించారు. రెండోసారి మీ చేతుల మీదుగా ఆస్కార్ అందుకుంటున్న అని కీరవాణి… పవన్ తో అన్నారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం