PawanKalyan: తిరుపతిలో కులఘర్షణలకు కుట్ర…పవన్ ఆరోపణ
PawanKalyan: ఆంధ్రప్రదేశ్‌లో కులాల మధ్య చిచ్చు పెట్టే కొత్త కుతంత్రాలు మొదలయ్యాయని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తిరుపతిలో బలిజలు-యాదవుల మధ్య ఘర్షణలు రెచ్చగొట్టడానికి అధికార పార్టీ కుట్రలు చేస్తోందని, వీటిపై అప్రమత్తంగా ఉండాలని బహిరంగ లేఖను విడుదల చేశారు.

PawanKalyan: కులాల మధ్య అంతరాలు తగ్గించి... అందరి మధ్య సఖ్యత పెంచేందుకు జనసేన పార్టీ తపిస్తోందని, ఆ దిశగా అడుగులు వేస్తోందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. అందుకు భిన్నంగా అధికార పక్షం లబ్ది పొందడానికి కుయుక్తులు పన్నుతోందని ఆరోపించారు.
కులాల మధ్య ఘర్షణలు రేకెత్తెంచడానికి జరుగుతున్న కుట్రలపై ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి సమాచారం తమకు అందుతోందని చెప్పారు. తాజాగా ఇలాంటి కుతంత్రాలు తిరుపతి నగరంలో మొదలయ్యాయని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. బలిజలు, యాదవుల మధ్య సఖ్యతను విచ్ఛిన్నం చేసేలా కొందరు అధికార పార్టీ వ్యక్తులు చేస్తున్న రెచ్చగొట్టే చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ప్రజలు రాజకీయ పార్టీలు చేస్తున్న ఉచ్చులో పడకుండా... ఆ విధమైన కుతంత్రాలకు పాల్పడుతున్నవారిని ఆదిలోనే నిలువరించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
కులాల మధ్య చిచ్చులు రేపి కొంతమంది తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని పవన్ ఆరోపించారు. అందులో భాగంగానే బలిజలకీ, యాదవులకీ మధ్య దూరం పెరిగేలా కుట్రలకు తెర తీశారని అన్నారు. ఆ కులాల్లోనూ వర్గాలు ఏర్పాటు చేసి ఐకమత్యాన్ని దెబ్బ తీసి తాము ఆధిపత్యం చలాయించాలని చూస్తున్నారన్నారు.
ఈ రోజు తిరుపతి కావచ్చు... రేపు మరొక ప్రాంతం కావచ్చని హెచ్చరించారు. ప్రజల మధ్య సఖ్యత లేకుండా.. భేద భావాలతో ఉండేలా చేయడమే కుట్రదారులు పన్నాగమని ఆరోపించారు.ఇలాంటి తరుణంలో అన్ని కులాల వారూ... ముఖ్యంగా యువతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటివారికి ప్రజాస్వామ్య పంథాలోనే సమాధానం ఇవ్వాలన్నారు. అందరూ ఒక తాటిపైకి వచ్చి ప్రజల మధ్య దూరం పెంచే కుట్రదారుల చర్యలను నిరసించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.