Pawan Kalyan : ఎన్టీఆర్ ట్రస్ట్ కు రూ.50 లక్షల విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్, మరో వందేళ్ల పాటు సేవలు కొనసాగాలని ఆకాంక్ష-pawan kalyan donates 50 lakh rupees to ntr trust wishes for its continued service ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Kalyan : ఎన్టీఆర్ ట్రస్ట్ కు రూ.50 లక్షల విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్, మరో వందేళ్ల పాటు సేవలు కొనసాగాలని ఆకాంక్ష

Pawan Kalyan : ఎన్టీఆర్ ట్రస్ట్ కు రూ.50 లక్షల విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్, మరో వందేళ్ల పాటు సేవలు కొనసాగాలని ఆకాంక్ష

Bandaru Satyaprasad HT Telugu
Updated Feb 15, 2025 11:14 PM IST

Pawan Kalyan : విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల కోసం నిర్వహించిన మ్యూజికల్ నైట్ కు మంచి ఆదరణ లభించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్... తలసేమియా బాధితుల చికిత్స కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ కు రూ.50 లక్షల విరాళం ప్రకటించారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ కు రూ.50 లక్షల విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్
ఎన్టీఆర్ ట్రస్ట్ కు రూ.50 లక్షల విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan : విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 'యుఫోరియా మ్యూజికల్ నైట్' అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, సినీ నటుడు బాలకృష్ణ పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది.

మరో వందేళ్ల పాటు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ...ఎలాంటి ప్రచార హంగామా లేకుండా సేవ చేసుకుంటూ వెళ్లడం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌కు ఉన్న ప్రత్యేకత అన్నారు. మరో వందేళ్ల పాటు ఈ ట్రస్ట్ కొనసాగాలని పవన్ ఆకాంక్షించారు. నారా భువనేశ్వరి అంటే తనకు ఎంతో అపారమైన గౌరవం అన్నారు. ఎన్ని కష్టాలు, ఒడుదొడుకుల్లో ఎదురైనా బలమైన సంకల్పంతో నిలబడడం ఆమె దగ్గర చూశానన్నారు.

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ నేతృత్వంలో తలసేమియా బాధితుల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. బాలకృష్ణ తనను బాలయ్య అని పిలువు అంటారు కానీ, తనకు సార్ అనే పిలవాలనిపిస్తుందన్నారు. తాను అనుకున్నది బలంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి బాలకృష్ణ అన్నారు.

ఎన్టీఆర్ అమరజీవి

సినిమాల్లోనే కాదు, సేవాల్లోనూ బాలకృష్ణ ముందుంటారని పవన్ కల్యాణ్ అన్నారు. వీటని గుర్తించి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బాలకృష్ణకు పద్మభూషణ్‌తో సత్కరించిందన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ లో విదేశాల నుంచి వైద్యులు వచ్చి, చికిత్స చేసి వెళ్లిపోతారని, దీనిపై ఎలాంటి ప్రచార హంగామా ఉండదన్నారు. ఎన్టీఆర్‌ అమరజీవి అన్నారు.

ఆయన మన మధ్య లేకపోయినా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మన అందరి గుండెల్లో ఉన్నారన్నారు. ఒక మంచి పని కోసం 28ఏళ్లుగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ కొనసాగించడం మామూలు విషయం కాదన్నారు. తలసేమియా బాధితుల కోసం మ్యూజికల్ ఈవెంట్‌ను ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయం అన్నారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ కు రూ.50 లక్షలు

ఎన్టీఆర్ ట్రస్ట్‌ కోసం తమ వంతు సాయం చేస్తామని పవన్ అన్నారు. తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌కు రూ.50 లక్షలు విరాళం అందిస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ ఈవెంట్‌కు టికెట్‌ కొనమని మా వాళ్లకు చెబితే, విషయం తెలుసుకున్న భువనేశ్వరి....మీరు టికెట్‌ కొనక్కర్లేదు. కార్యక్రమానికి రండి అన్నారన్నారు. అందరూ టికెట్‌ కొని కార్యక్రమానికి వస్తే తాను ఉత్తిగా రావడం తప్పుగా అనిపించిందన్నారు. అందుకే తన వంతుగా తలసేమియా బాధితుల చికిత్స కోసం త్వరలోనే ఎన్టీఆర్‌ ట్రస్ట్‌కు రూ.50 లక్షలు విరాళం అందిస్తానని ప్రకటించారు.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం