గతంలో పశ్చిమ బెంగాల్ వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు రోహింగ్యాలు వలసదారులు వచ్చారని.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా 2017-18 ప్రాంతాల్లో కోల్‌కతా నుంచి స్వర్ణకార వృత్తి నిమిత్తం చాలా అధికంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వచ్చారని చెప్పారు. రోహింగ్యాల మూలాలు మయన్మార్ లో ఉన్నాయన్న పవన్.. వారి వలసలతో స్థానిక యువత నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటోందని వివరించారు.
'తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్. తెలంగాణ ఏర్పాటులో ఉన్న మూడు ప్రధాన డిమాండ్లలో స్థానికులకే ఉద్యోగాలు అనేది కూడా కీలక నినాదం. అయితే రోహింగ్యాలు దేశం దాటి వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకుంటూ.. రేషన్, ఆధార్, ఓటరు కార్డులు పొందుతున్నారు. మన యువతకు చెందాల్సిన ఉద్యోగాలు, వ్యాపారాలు వారు చేసుకుంటున్నారు' అని పవన్ వ్యాఖ్యానించారు.
'రోహింగ్యాలకు స్థిర నివాసం ఏర్పరుచుకోవడంలో మన యంత్రాంగం నిర్లక్ష్యం ఉంది. వారికి ఎలా ఆధార్, ఓటరు, రేషన్ కార్డులు వస్తున్నాయి..? ఎవరు ఇస్తున్నారనేది తేలాలి. మన వ్యవస్థలోనే కొందరు వ్యక్తులు వారికి సహకరిస్తున్నారని అర్ధం అవుతుంది. రోహింగ్యాలు ఈ దేశ పౌరులుగా మారి, మన అవకాశాలను ఎలా కొల్లగొడుతున్నారనే దానిపై అందరిలోనూ చైతన్యం రావాలి' అని పవన్ అభిప్రాయపడ్డారు. 'రోహింగ్యాలు స్థానికులుగా మారడానికి సహరిస్తున్న యంత్రాంగంపై కన్నేసి ఉంచాలి. అంతర్గత భద్రతలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు బాధ్యత గల ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా స్పందిస్తూ.. లేఖ రాశా' అని ఉప ముఖ్యమంత్రి వివరించారు.
రోహింగ్యాలు మయన్మార్‌లో తీవ్రమైన హింస, వివక్ష, అణచివేతను ఎదుర్కొంటున్నారు. అక్కడ వారి గ్రామాలను తగలబెట్టారు. వేలాది మందిని చంపేశారు. మహిళలపై లైంగిక దాడులు జరిగాయి. మయన్మార్ ప్రభుత్వం రోహింగ్యాలను తమ దేశ పౌరులుగా గుర్తించదు. దీనివల్ల వారికి కనీస హక్కులు కూడా ఉండవు. దీంతో రోహింగ్యాలు.. భారత్‌లోని వివిధ రాష్ట్రాలకు వలస వస్తున్నారు.
చాలా మంది రోహింగ్యాలు మొదట బంగ్లాదేశ్‌కు శరణార్థులుగా వెళ్లారు. అక్కడ శిబిరాలు ఎక్కువగా ఉండటం, సరైన ఆహారం, నీరు, వైద్య సదుపాయాలు లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. స్థానిక ప్రజల నుండి కూడా కొంత వ్యతిరేకత ఉంది. ఈ కష్టమైన పరిస్థితులు వారిని భారతదేశం వైపు నడిపిస్తున్నాయి. భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో మెరుగైన జీవన పరిస్థితులు, ఉపాధి అవకాశాలు, భద్రత ఉంటుందని రోహింగ్యాలు భావిస్తారు.
కొందరు రోహింగ్యాలకు భారతదేశంలో బంధువులు ఉండటం కూడా.. వారు ఇక్కడికి రావడానికి ఒక కారణం అని పోలీస్ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో గణనీయమైన ముస్లిం జనాభా ఉండటం వల్ల.. వారు ఇక్కడ ఈజీగా ఆశ్రయం పొందవచ్చని భావిస్తున్నారు. మయన్మార్‌లోని భయానక పరిస్థితులు వారిని దేశం విడిచి వెళ్లేలా చేస్తున్నాయి. భారతదేశంలోని మెరుగైన అవకాశాలు వారిని ఇక్కడికి ఆకర్షిస్తున్నాయి.
సంబంధిత కథనం