కల్వరిలో క్రైస్తవ బోధకుడిగా ఉన్న పాస్టర్ ప్రవీణ్ కొంతమూరు హైవేపై అనుమానస్పదంగా మృతి చెందారు. తనకి ప్రాణహాని ఉందని ప్రవీణ్ నెల కిందటే చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనది హత్య లేక.. అనుకోని ప్రమాదంలో మృతి చెందారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయన మృతదేహాన్ని పోలీసులు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అయితే.. ఆయనది హత్యేనని.. క్రైస్తవ ఆరాధకులు, ప్రవీణ్ బంధువులు ఆరోపిస్తున్నారు. గతంలో ఆయనను బెదిరిస్తూ ఉన్న వీడియోలను చూపిస్తున్నారు. ప్రవీణ్ పెదాలు కమిలిపోయి ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు క్రైస్తవులు, అతని బంధువులు చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుండి ప్రమాద స్థలం వరకు ప్రవీణ్ ప్రయాణానికి సంబంధించి మొత్తం సిసిటివి ఫుటేజ్‌ని పరిశీలించాలని.. క్రైస్తవ ఆరాధకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై నటుడు రాజా కూడా స్పందించారు. ప్రవీణ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఘటనపై గురించి తెలియగానే మహాసేన రాజేష్ కూడా ఆసుపత్రి దగ్గరకు వచ్చారు.
'ఇది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అని అంటున్నారు. ప్రవీణ్ చాలామంచి వ్యక్తి. ఆయన చాలామందికి సాయం చేశారు. ఇలా జరగడం బాధాకరం. ఈ ఘటన గురించి స్థానిక ఎమ్మెల్యే, సానా సతీష్, జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్తాను. ప్రభుత్వం తరఫున పారదర్శకంగా దర్యాప్తు చేసి నిజాలు బయటపెట్టాలని కోరుతున్నాను. లేకపోతే దీనికి మతపరమైన రంగు పులిమే అవకాశం ఉంది. ఇది చాలా సున్నితమైన అంశం. దీని గురించి మంత్రి లోకేష్ దృష్టికి కూడా తీసుకెళ్తా' అని మహాసేన రాజేష్ వ్యాఖ్యానించారు.
'పాస్టర్ ప్రవీణ్ చాలా డేరింగ్ వ్యక్తి. చాలా బాగా మాట్లాడేవారు. మంచి వ్యక్తి. అలాంటి వారు ప్రమాదంలో చనిపోయారని వినడం బాధగా ఉంది. ప్రవీణ్ కుటుంబానికి దేవుడు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. త్వరలోనే వారి కుటుంబ సభ్యులను కలుస్తాను' అని నటుడు రాజా చెప్పారు.