Paster Praveen Pagadala : పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి, ఆ 12 నిమిషాలు కీలకం- పోలీసుల చేతికి కీలక ఆధారాలు
Paster Praveen Pagadala : పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి బుల్లెట్ పై వస్తున్న ఆయన సోమవారం రాత్రి కొంతమూరు వద్ద అనుమానాస్పద రీతిలో మరణించారు.
Paster Praveen Pagadala : పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతి కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయ్యింది. ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించారా? మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మీడియాకు పలు కీలక విషయాలు వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ప్రవీణ్ బైక్ పై ప్రయాణిస్తున్న రెండు సీసీ ఫుటేజీలు లభించాయని చెప్పారు.
హైదరాబాద్ నుంచి బుల్లెట్ పై రాజమండ్రికి వస్తున్న సమయంలో సోమవారం అర్ధరాత్రి 11 గంటల 42 నిమిషాలకు ఒక కారుతో పాటు ఐదు వాహనాలు ప్రవీణ్ బుల్లెట్ ని దాటుకొని వెళ్లినట్లు సీసీ ఫుటేజీలో గుర్తించామన్నారు. రెడ్ కలర్ కారు, ప్రవీణ్ బైక్ ఒకేసారి వెళ్లాయని, ఆ కారు కోసం విచారణ చేస్తున్నామన్నారు.
హైదరాబాద్ కు చెందిన క్రీస్తు సందేశకుడు, పాస్టర్ పగడాల ప్రవీణ్‌కుమార్(45) తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారులోని కొంతమూరు వద్ద రోడ్డు పక్కన పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. అయితే రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ మృతి చెందలేదని, ఆయనది హత్యేనని పాస్టర్లు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు
ఈ కేసు విచారణకు కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ నేతృత్వంలో ఇద్దరు సీఐలు, ఎస్సైలతో ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశామని ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈ కేసులో ఎవరి వద్ద అయినా బలమైన ఆధారాలు ఉంటే పోలీసులకు అందించవచ్చని కోరారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఆయన ప్రయాణాన్ని అన్ని కోణాల్లో విచారణ చేస్తామని తెలిపారు. ఈ కేసులో ఎలాంటి ప్రాథమిక నిర్ధారణకు రాలేకపోతున్నామని, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాతే వివరాలు తెలుస్తాయని ఎస్పీ అన్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియోలో కొందరు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టారని, వారింతా చట్టపరిధిలో ఉన్నట్టు గుర్తుంచుకోవాలని ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరించారు.
"కొంతమూరులో రోడ్డు పక్కన మృతదేహం పడి ఉందని మంగళవారం ఉదయం పోలీసులకు స్థానికుల నుంచి సమాచారం అందింది. వెంటనే ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహం పక్కనే ఒక మొబైల్ గుర్తించారు. చివరి ఫోన్ కాల్ రామ్మోహన్ ఆర్‌జేవైకి వెళ్లింది. పోలీసులు ఆయనకు ఫోన్ చేశారు. రామ్మోహన్, అతని భార్య ఘటనాస్థలికి చేరుకుని మృతదేహం పాస్టర్ ప్రవీణ్‌దిగా గుర్తించారు. ప్రవీణ్ హైదరాబాద్‌లో ఉంటారని, మత బోధకుడిగా సేవలందిస్తారని చెప్పారు. దీంతో హైదరాబాద్‌లోని ఆయన కుటుంబసభ్యులకు సమాచారం అందించాం. ప్రవీణ్ బావమరిది అనుమానాస్పద మృతిగా ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశాం" -ఎస్పీ నరసింహ కిషోర్
12 నిమిషాలు కీలకం
ఈ ఘటన జరిగిన ప్రదేశంలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో కొన్ని కీలక ఆధారాలు సేకరించామని ఎస్పీ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌తో విచారణ జరిపించాలని నిర్ణయించామన్నారు. వైద్య బృందంతో పోస్టుమార్టం చేయించామన్నారు. కొవ్వూరు టోల్ గేట్ సమీపంలో కొంతమూరు వద్ద పాస్టర్ ప్రవీణ్ బైక్ పై వెళ్తున్న సీసీటీవీ ఫుటేజీ సేకరించామన్నారు. సోమవారం రాత్రి 11.43 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగినట్టు అంచనా వేస్తున్నామన్నారు. అర్ధరాత్రి 11.31 నుంచి 11.42 వరకు 12 నిమిషాలు కీలకమన్నారు. రాత్రి 11.42 గంటలకు ఒక కారుతో పాటు ఐదు వాహనాలు పాస్టర్ ప్రవీణ్ బుల్లెట్‌ను దాటుకుని వెళ్లాయని గుర్తించామన్నారు.
సంబంధిత కథనం