Hanumakonda Accident: హనుమకొండ – సిద్దిపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం, పాస్టర్ దుర్మరణం
Hanumakonda Accident: హనుమకొండ – సిద్దిపేట జాతీయ రహదారిపై సోమవారం అర్ధ రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్కతుర్తి వైపు నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న ఓ కారును టిప్పర్ లారీ అతి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఓ చర్చి పాస్టర్ తీవ్రంగా గాయపడి కారులోనే ప్రాణాలు కోల్పోయారు.
Hanumakonda Accident: హన్మకొండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన కనకపూడి కరుణాకర్ కరీంనగర్ లోని ఓ చర్చిలో పాస్టర్ గా పని చేస్తున్నాడు. కాగా వ్యక్తిగత పని మీద సోమవారం హనుమకొండకు వచ్చిన ఆయన అర్ధరాత్రి ఒంటి గంట సుమారులో కరీంనగర్ కు బయలు దేరాడు.
ఎదురుగా ఢీకొట్టిన లారీ
హనుమకొండ నుంచి హుజురాబాద్ మీదుగా ఎన్ హెచ్ 563 విస్తరణ పనులు జరుగుతుండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. దీంతో కరుణాకర్ హుస్నాబాద్ మీదుగా కరీంనగర్ వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు.
ఈ మేరకు ఎల్కతుర్తి నుంచి టర్న్ తీసుకుని హుస్నాబాద్ వైపు వెళ్తుండగా.. భీమదేవరపల్లి మండలం ముల్కనూరు సమీపంలోని గోపాల్ పూర్ క్రాస్ వద్దకు అర్ధ రాత్రి 1.15 గంటల సుమారులో చేరుకున్నాడు. ఈ క్రమంలో సిద్దిపేట వైపు నుంచి హనుమకొండ వైపు వస్తున్న ఆర్ జే 20 జీడీ 0052 నెంబర్ గల ఓ టిప్పర్ లారీ ఎదురుగా దూసుకొచ్చి కారును వేగంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జవగా.. చర్చి పాస్టర్ కరుణాకర్ అందులోనే ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఇదిలాఉంటే రోడ్డుపై అటుగా వెళ్తున్న ప్రయాణికులు ప్రమాదానికి గురైన వాహనాలను గుర్తించి, వెంటనే స్థానిక పోలీసులతో పాటు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు.
దీంతో పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. కారులో ఇరుక్కుపోయిన కరుణాకర్ మృతదేహాన్ని అతి కష్టం మీద బయటకు తీశారు. అనంతరం పాస్టర్ కరుణాకర్ కుటుంబ సభ్యులకు సమాచారం చేర వేసి, మృత దేహాన్ని హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అతి వేగం.. నిద్ర మత్తు
ఎన్‌హెచ్ 563 జాతీయ రహదారి విస్తరణ పనులకు ఓ కంపెనీకి చెందిన లారీలు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్నాయని ఎల్కతుర్తి, ముల్కనూరు తదితర గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. 24 గంటల పాటు లారీ మట్టి, మొరం తరలిస్తున్నట్లు తెలుస్తుండగా, అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదానికి డ్రైవర్ నిద్ర మత్తే ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
నిద్ర మత్తుకు తోడు అతి వేగం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా లారీల అతి వేగం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు తగిన చర్యలు చేపట్టి, ప్రమాదాల నివారణకు చొరవ తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం