BJP Struggles In AP : ఏపీలో బీజేపీకి కాపు కాసేదెవరు..?-party leaders are expressing concern over the developments of andhra pradesh bjp ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Party Leaders Are Expressing Concern Over The Developments Of Andhra Pradesh Bjp

BJP Struggles In AP : ఏపీలో బీజేపీకి కాపు కాసేదెవరు..?

HT Telugu Desk HT Telugu
Feb 17, 2023 08:21 AM IST

BJP Struggles In AP ఏపీలో పాగా వేయడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయనేది చర్చనీయాంశంగా మారింది. కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా నేపథ్యంలో అసలు ఏపీ బీజేపీ పరిస్థితి ఎప్పటికి గాడిన పడుతుందనే చర్చ కూడా మొదలైంది. రాష్ట్రంలో ప్రధానమైన సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకుని రాజకీయాల్లో ఎదగాలనుకున్న బీజేపీ ఆలోచనలు ఎంతమేరకు ఫలిస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఏపీలో బీజేపీ పరిస్థితి ఏమిటి...?
ఏపీలో బీజేపీ పరిస్థితి ఏమిటి...? (HT_PRINT)

BJP Struggles In AP ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితి ఏమిటి…? కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా తర్వాత మరోసారి ఈ ప్రశ్న తలెత్తింది. 2024 నాటికి ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలనుకున్న బీజేపీ అందుకు సమీపం దూరంలో కూడా నిలువలేకపోతోంది. గ్రూపు గొడవలు, అంతర్గత విభేదాలతో ఆ పార్టీ సతమతమవుతోంది. అధ్యక్షులు మారినా పార్టీ పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు.

ట్రెండింగ్ వార్తలు

ఏపీ బీజేపీలో ఒకటికి నాలుగు గ్రూపులు తయారు కావడమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ గ్రూపు ఒకటైతే, టీడీపీ అనుకూల వర్గం, వైసీపీ అనుకూల వర్గాలుగా పార్టీ నేతలు చీలిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి కమ్మ సామాజిక వర్గం, వైఎస్సార్సీపీకి రెడ్డి సామాజిక వర్గం నుంచి మద్దతు ఉంటంతో, కాపుల మద్దతుతో ఎదగాలని బీజేపీ ప్లాన్ చేసింది. అదే సమయంలో జనసేన పవన్ కళ్యాణ్‌ను దగ్గర తీసుకోవడం ద్వారా లాభ పడాలని భావించింది. అయితే ఈ ప్రణాళికలు ఏవి బీజేపీ అదృష్టాన్ని మెరుగుపరచలేదు.

2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు రాష్ట్రంలోని 173 స్థానాల్లో పోటీ చేస్తే ఆ పార్టీకి ఒక్క చోట కూడా డిపాజిట్ దక్కలేదు. మొత్తం పోలైన ఓట్లలో ఒక్క శాతం కంటే తక్కువే బీజేపీకి వచ్చాయి. కేవలం 0.84శాతం ఓట్లు మాత్రమే బీజేపీకి దక్కాయి. అధికారంలోకి రావడం కంటే ముందు ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలనుకున్న కోరిక కూడా నెరవేరలేదు.

గత కొంత కాలంగా ఏపీలో బీజేపీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఇతర పార్టీల నుంచి బీజేపీలో నాయకులు వలస వెళ్లినా పార్టీని బలోపేతం చేయడంపై ఎవరు పెద్దగా పనిచేసిన దాఖలాలు మాత్రం కనిపించలేదు. దీనికి తోడు బీజేపీలో అంతర్గత విభేదాలు తారాస‌్థాయికి చేరడం వచ్చే ఎన్నికల్లో బీజేపీ పరిస్థితికి అద్దం పడుతోంది.

కన్నా రాజీనామాతో బీజేపీ-జనసేన పొత్తు అంశం కూడా తెరపైకి వచ్చింది. జనసేనతో పొత్తు ఉన్నా రెండు పార్టీలు కలిసి పనిచేసిన సందర్భం లేదు. మరోవైపు జనసేన టీడీపీకి దగ్గరైతే బీజేపీ పరిస్థితి ఏమిటనే చర్చ కూడా ఉంది. టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లో జత కలవకూడదనే ఉద్దేశంలో ఉన్న బీజేపీ అదే సమయంలో సొంతంగా ఎదిగే ప్రయత్నాలు కూడా పెద్దగా చేయట్లేదు. కేంద్ర పార్టీ ఆదేశించిన సమయంలో మినహా మిగిలిన సమయంలో నాయకులు పెద్దగా ఎవరికి ఇబ్బంది కలగని విధంగా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంపై ఎవరు ఆసక్తి చూపడం లేదు.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న జివిఎల్ వంటి నాయకులు మాత్రమే సొంత ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయడంపై ఆ పార్టీ నేతలు ఒక్క తాటిపైకి వచ్చిన దాఖలాలు మాత్రం లేవు.

బీజేపీ ప్రస్తుత పరిస్థితి చూసి మొదట్నుంచి ఆ పార్టీలో ఉన్న నాయకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఆవిర్బవించిన 40ఏళ్లలో ప్రాంతీయ పార్టీలను నమ్ముకోవడం వల్ల ఏపీలో బీజేపీ ఎదగలేకపోయిందని, బీజేపీ సిద్ధాంత పరమైన పునాదుల్ని బలోపేతం చేసే రాజకీయ వాతావరణం ఏపీలో అనువుగా లేకపోవడం ఓ కారణమైతే, ప్రాంతీయ పార్టీల ఛాయలో ఉండిపోవడం నష్టం కలిగించిందని చెబుతున్నారు.

గతంలో టీడీపీతో దోస్తీ బీజేపీకి బాగా చేటు చేసిందని దాని నుంచి గుణపాఠాలు నేర్చుకుని ముందుకు సాగాల్సింది పోయి అందుకు భిన్నంగా సాగుతున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టీడీపీతో స్నేహం వల్ల బీజేపీకి ఒకప్పుడు జరిగిన నష్టమే ఇప్పుడు కూడా ఇతర పార్టీల వల్ల కలుగుతోందని, తమ పార్టీ నాయకుల ఇతర పార్టీల నాయకుల ప్రాపకం కోసం పాకులాడటం వదిలేస్తే పార్టీకి మంచి రోజులొస్తాయని బీజేపీకి చెందిన కీలక నాయకుడొకరు చెబుతున్నారు.

IPL_Entry_Point

టాపిక్