Anantapur Crime : హీటెక్కిన రాప్తాడు రాజకీయం.. తోపుదుర్తి మహేష్ మరణంపై అనుమానం.. పరిటాల శ్రీరామ్ ఏమన్నారు?
Anantapur Crime : రాప్తాడు రాజకీయం మళ్లీ హీటెక్కింది. అందుకు కారణం ఓ యువకుడు మృతిచెందడం. అతని మరణంపై అనుమానాలు ఉన్నాయని టీడీపీ చెబుతోంది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడిపై టీడీపీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణలకు తోపుదుర్తి అనుచరులు కౌంటర్ ఇస్తున్నారు.
రాప్తాడు రాజకీయాలు మళ్లీ టాక్ ఆఫ్ ది ఏపీగా మారాయి. రైలు పట్టాలపై ఓ యువకుడు శవమై కనిపించడం.. దీనికి కారణం మాజీ ఎమ్మెల్యే సోదరుడని టీడీపీ ఆరోపించడంతో రాజకీయం హీటెక్కింది. మృతుడి తండ్రితో సహా.. టీడీపీ లీడర్ పరిటాల శ్రీరామ్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అతని సోదురుడిపై సంచలన ఆరోపణలు చేశారు.
ఏం జరిగింది..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం తోపుదుర్తి గ్రామంలో టి.మహేశ్వర రెడ్డి అనే యువకుడి కుటుంబం ఉంటోంది. మహేశ్వర రెడ్డి.. శనివారం రాత్రి పాలచెర్లకు చెందిన మురళి అనే యువకుడితో కలిసి.. సోములదొడ్డి గ్రామంలోని బస్టాప్ వద్దకు వెళ్లాడు. తనకు పని ఉందని, పూర్తి చేసుకుని మళ్లీ ఫోన్ చేస్తానని తన వెంట వచ్చిన యువకుడికి మహేశ్వర రెడ్డి చెప్పాడు. దీంతో అతడు అక్కడి నుంచి అనంతపురం వెళ్లాడు. కాసేపటి తర్వాత పని పూర్తయిందని, సోములదొడ్డికి రావాలని రాత్రి 10.30 గంటల సమయంలో మహేశ్వర రెడ్డి యువకుడికి మెసేజ్ పెట్టాడు.
ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్..
అనంతపురం నుంచి ఆ యువకుడు బైక్‌పై సోములదొడ్డికి వచ్చాడు. కానీ అక్కడ మహేశ్వర రెడ్డి లేడు. వెంటనే ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. అనుమానం వచ్చి ఆ యువకుడు మహేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులకు ఫోనే చేశాడు. కుటుంబ సభ్యులు, బంధువులు గాలించగా.. సోములదొడ్డి- నాగిరెడ్డి గ్రామాల మధ్య మహేశ్వర రెడ్డి రైలు పట్టాల పక్కన ఆదివారం ఉదయం శవమై కనిపించాడు. రైల్వే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
తోపుదుర్తి సోదరులపై ఆరోపణలు..
అయితే.. ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. 2019లో టీడీపీకి సహకరించామనే కారణంతో.. తన కుమారుడిపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి కోపం పెంచుకున్నారని.. మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. వైసీపీ హయాంలో అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. తమ భూమిని కూడా ఆన్‌లైన్ నుంచి తొలగించినట్లు వాపోయారు. ఇటీవల శ్రీరామ్‌ను తమ కుమారుడు కలిసి.. ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెట్టినప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి బెదిరింపులకు పాల్పడినట్లు మృతుడి తండ్రి ఆరోపించారు.
శ్రీరామ్ ఏమన్నారు..
తోపుదుర్తి మహేశ్వర రెడ్డి మరణం వెనుక అనుమానాలు ఉన్నాయని.. ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యానించారు. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీలో మృతదేహాన్ని పరిటాల శ్రీరామ్ పరిశీలించారు. మహేశ్వర రెడ్డి తల్లిదండ్రులను ఓదార్చారు. 2019 తర్వాత తోపుదుర్తి మహేష్ రెడ్డి తనను కలిశాడని.. అప్పటినుంచి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, ఆయన సోదరులు అతన్ని టార్గెట్ చేశారని ఆరోపించారు. పోలీసులు దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను శిక్షించాలని కోరారు. అటు మాజీఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అనుచరులు ఈ ఆరోపణలను ఖండించారు.