Anantapur Crime : అనంతపురంలో విషాదం - 5 నెలల చిన్నారిని చంపేసి తల్లిదండ్రులు సూసైడ్..!
అనంతపురం జిల్లాలో విషాదం జరిగింది. చిన్నారితో సహా తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పుల బాధ భరించలేక సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్ననార్పల పోలీసులు విచారణ జరుపుతున్నారు.
అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఐదు నెలల చిన్నారితో సహా తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల భారమే ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైందని భావిస్తున్నారు. దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించారు.
ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని పాత పోలీసు స్టేషన్ మెయిన్ సంత బజార్ వద్ద ఉన్న పెద్దమ్మ స్వామి గుడివద్ద గురువారం వెలుగు చూసింది. అక్కడ కృష్ణకిషోర్ (45), శిరీష (35) నివాసిస్తున్నారు. వీరికి ఐదు నెలల కుమార్తె ఉన్నారు. నార్పల గూగూడు రోడ్డులో కృష్ణ కిశోర్ మెడికల్ స్టోర్‌ను నిర్వహిస్తున్నారు. షాప్ నిర్వహణ కోసం అప్పులు చేసినట్లు తెలిసింది. షాపు నుంచి వచ్చే ఆదాయం అంతంతమాత్రమే. దీంతో ఆదాయం లేకపోవడంతో అప్పులు తీరే దారి లేకపోయింది. దీంతో భార్యాభర్తలు మదనపడుతూ ఉన్నారు. ఆత్మహత్య శరణ్యమని భావించి నాలుగు రోజుల క్రితం భార్యాభర్తలిద్దరూ తమ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
గత నాలుగు రోజుల నుంచి కృష్ణ కిశోర్ ఇంటి తలుపులు మూసి ఉండడం, మృతదేహాల కుళ్లిపోయి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటి తలుపులు బద్దలు కొట్టి చూస్తే భార్యాభర్తలిద్దరూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపించారు. ఐదు నెలల కుమార్తె ఊయ్యాలలో విగత జీవిగా పడి ఉంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
వేలాడుతున్న మృతదేహాలను పోలీసులు దింపారు. పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కౌలుట్లయ్య, ఎస్ఐ సాగర్ తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు.
పదో తరగతి విద్యార్థినిపై దాడి:
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణ పల్లిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని అదే ప్రాంతానికి చెందిన మాదర్ అనే వ్యక్తి కొన్నిరోజులుగా ప్రేమించాలని వేధిస్తూ ఉన్నాడు. గురువారం సాయంత్రం బాలిక ఇంటికి వెళ్లి కర్రతో తల మీద దాడి చేయగా విద్యార్థినికి గాయాలయ్యాయి. విద్యార్థిని తల్లిదండ్రులు మాట్లాడుతూ పదో తరగతి చదువుతున్న తమ కూమార్తెను ఇదే ప్రాంతానికి చెందిన మదర్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా వేధిస్తున్నాడని అన్నారు.
తాము ఎన్నిసార్లు చెప్పినా తమ మాట వినడం లేదని, హఠాత్తుగా గురువారం కత్తి, కర్ర తీసుకువచ్చి తమ ఇంటి మీద దాడికి వచ్చాడని తెలిపారు. తమ కుమార్తె మీద దాడి చేయబోవుగా అడ్డుకున్న తన (తల్లి) పైన కూడా దాడి చేశాడని పేర్కొన్నారు. కర్రతో తమ కుమార్తె తలపై కొట్టడంతో గాయాలు అయ్యాయని, ఈ మదర్ నుండి తమ కుటుంబానికి, తమ కుమార్తెకు ప్రాణహాని ఉందని అన్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.