Sri Malleswara Temple: పరమ పవిత్రం మల్లేశ్వరాలయం.. విజయవాడలో అర్జునుడు స్థాపించిన ఈ ఆలయం గురించి తెలుసా..
Sri Malleswara Temple: అర్జునుడు పాశుపతాస్త్రాన్ని పొందిన ఇంద్రకీలాద్రిపై శతాబ్దాల చరిత్ర కలిగిన మల్లేశ్వరాలయం కూడా కొలువై ఉంది. జీర్ణావస్థకు చేరిన ఈ ఆలయాన్ని కొద్ది కాలం క్రితం దేవాదాయశాఖ పునరుద్ధరించింది. కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి అమ్మవారితో పాటు మల్లేశ్వరుడి ఆలయం కూడా కొలువై ఉంది.
Sri Malleswara Temple: బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మతో పాటు మల్లేశ్వరాలయానికి కూడా చారిత్రక నేపథ్యం ఉంది. పురాతన శివాలయాల్లో ఒకటైన ఈ మల్లేశ్వరాలయంలో అర్జునుడే స్వయంగా లింగాన్ని ప్రతిష్టించారని భక్తుల విశ్వాసం. ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి ఆలయానికి ఉత్తరదిక్కున ఉండే మల్లేశ్వరాలయం జీర్ణావస్థకు చేరడంతో దానిని పునర్నిర్మించారు. తూర్పు ముఖంగా ఉండే మల్లేశ్వరాలయంలోకి ఉత్తరం వైపు నుంచి భక్తులు ప్రవేశిస్తారు. రౌద్ర రూపంలో ఉండే చండీశ్వరుడిని ఓం చండీశ్వరాయనమ: అంటూ భక్తులు ఆలయంలోకి ప్రవేశిస్తారు.
ఆలయం లోపల క్షేత్రపాలకుడైన కాలభైరవుడి విగ్రహం ఉంటుంది. ఆ పక్కగా నందీశ్వరుడి దర్శనం లభిస్తుంది. కృతయుగంలో బ్రహ్మదేవుడితో మల్లికా పుష్పాలతో లింగరూపం మల్లేశ్వరాలయంలో దర్శనం ఇస్తుంది. మల్లేశ్వర ఆలయంలో పేర్లు,గోత్ర నామాలతో అర్చనలు చేస్తారు. మల్లేశ్వరుడికి నిత్యం అభిషేకాలు, అర్చనలు జరుగుతుంటాయి.
జగన్మాత దుర్గమ్మకు అర్థ శరీరాన్ని పంచిన భోళాశంకరుడైన మల్లేశ్వరుడు భక్తులకు దర్శనం ఇస్తాడు. ఆలయ మండపం నుంచి చూస్తే ఓ వైపు ప్రకాశం బ్యారేజీ, మరోవైపు విజయవాడ నగరం నలుదిక్కులా కనిపిస్తాయి.
మల్లేశ్వరాలయానికి సంబంధించి ప్రస్తావన పద్మపురాణంలో కనిపిస్తుంది. అష్టదశ పురాణాల్లో ఒకటైన పద్మపురాణంలో దుర్గాదేవి మహిమను వివరించే పలు పురాణ కథలు ఉంటాయి. అగస్త్య మహర్షి రాసిన దుర్గాదేవి మహత్యంలో ఇంద్రకీలాద్రి వైభవాన్ని వివరించారు. ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయ వైభవంతో పాటు మల్లేశ్వరాలయం నిత్యం అర్చనలతో మార్మోగుతుండేది. కార్తీక మాసంలో భక్తులు పెద్ద సంఖ్యలో మల్లేశ్వర స్వామిని పూజించేందుకు ఇంద్రకీలాద్రికి తరలి వస్తుంటారు.
కాలక్రమంలో మల్లేశ్వర ఆలయం చుట్టూ పెద్ద ఎత్తున ఆక్రమణలు పెరగడంతో గత కొన్నేళ్లుగా వాటిని తొలగించి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దుర్గగుడి నుంచి మల్లేశ్వరాలయానికి వెళ్లే మార్గాన్ని సిద్ధం చేశారు. పాత ఆలయాన్ని తొలగించి కొత్తగా నిర్మించిన మల్లేశ్వరాలయంలో లింగ ప్రతిష్టాపన చేశారు. పునర్నిర్మాణం తర్వాత ప్రస్తుతం మల్లేశ్వరాలయం భక్తులను అనుమతిస్తున్నారు. కార్తీక మాసంలో శివుడికి అభిషేకాలు చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తుంటారు.