Palnadu Accident : పల్నాడు జిల్లాలో తీవ్రవిషాదం, ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళలు మృతి-సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Palnadu Tractor Accident : పల్నాడు జిల్లాలో ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళలను మృతి చెందారు. బొల్లవరం మాదల మేజర్ కెనాల్ కట్టపై కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Palnadu Tractor Accident : పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం ముప్పాళ్ల మండలంలోని బొల్లవరం మాదల మేజర్ కాలువ కట్టపై కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ముప్పాళ్ల మండలంలోని చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన మహిళలు మిరప పంటకోతలకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ట్రాక్టర్ ప్రమాదంలో మధిర గంగమ్మ, మధిర సామ్రాజ్యం, చక్కెర మాధవి, తేనెపల్లి పద్మావతి అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ప్రమాదస్థలిని పరిశీలించారు. ట్రాక్టర్ ప్రమాదంపై మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మహిళా కూలీల మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలందించాలని అధికారులను ఆదేశించారు.
పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం
పల్నాడు జిల్లా ముప్పాళ్లలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బొల్లవరం నుంచి కూలీలతో చాగంటివారిపాలెం వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి గంగమ్మ, సామ్రాజ్యం, మాధవి, పద్మావతి అనే నలుగురు మహిళలు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకునే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.
"పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ళ మండలం చాగంటివారిపాలెంలో జరిగిన ఘోర ప్రమాదం దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రమాదంలో వ్యవసాయ కూలీల మృతి బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించాము. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది"- సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ
"పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం బొల్లవరం సమీపంలో మాదల మేజర్ కాలువ గట్టుపై ట్రాక్టర్ బోల్తా పడి నలుగు మహిళా కూలీలు మృతి చెందడం దిగ్భ్రాంతిని కలిగించింది. ముప్పాళ్ల మండలంలోని చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన మహిళాకూలీలు మిరపకోతలకు వెళ్లి తిరిగి గ్రామానికి వెళ్లుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. మరణించిన వారందరూ మహిళా కూలీలే కావడం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యశాఖాధికారులను ఆదేశించాను"-మంత్రి సత్యకుమార్