Murder Mystery : కేరళలో చోరీలు… ఏపీలో అమ్మకాలు…హత్యకు దారి తీసిన వాటాలు
Murder Mystery ఏడాదిన్నర క్రితం హత్యకు గురైన ఓ వ్యక్తి మృతదేహాన్ని కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌లో పోలీసులు వెలికి తీశారు. ఈ కేసు దర్యాప్తులో అదృశ్యమైన తమ్ముడిని వెదికే క్రమంలో మృతుడి సోదరుడు మరొకరిని హత్య చేయడం కలకలం రేపింది. కేరళలో చోరీ చేసిన బంగారాన్ని పంచుకునే విషయంలో విభేదాలు తలెత్తడంతో మొదటి హత్య జరిగినట్లు పల్నాడు పోలీసులు గుర్తించారు. పల్నాడు జిల్లాలో మొదలైన దర్యాప్తు చివరకు కృష్ణా జిల్లాలో కొలిక్కి వచ్చింది.
Murder Mystery పల్నాడులో నమోదైన జిల్లాలో ఒక అదృశ్యం కేసు అనేక మలుపులు తిరిగింది. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గొరిజవోలుకి చెందిన జంగం చంటి గత ఏడాది సెప్టెంబరు 16న కనిపించకుండా పోయాడు. అతని అన్న జంగం బాజి ఫిర్యాదుతో అదే ఏడాది అక్టోబరు 24న నాదెండ్ల పోలీస్ స్టేషన్‌లో అదృశ్యం కేసు నమోదు చేశారు. తమ్ముడి అచూకీ కోసం అన్న బాజి స్వయంగా గాలించడం మొదలుపెట్టాడు.
ట్రెండింగ్ వార్తలు
నరసరావుపేట మండలం కేసానుపల్లి వాసి రావిపాటి వెంకన్న, దాచేపల్లికి చెందిన నాగూర్ అలియాస్ బిల్లాతో కలిసి అదృశ్యమైన చంటి చోరీలకు పాల్పడుతుండేవాడు. దొంగలించిన బంగారాన్ని నరసరావుపేటలోని ఓ నగల దుకాణంలో విక్రయించేవారు. అందులో పనిచేసే జొన్నలగడ్డ నివాసి సిలివేరు రామాంజనేయులు ఈ ముఠాకు సాయం చేసేవాడు. తమ్ముడి అచూకీ వెదుకుతూ బాజి... ఈ ఏడాది ఏప్రిల్ 22న రామాంజనేయులను కిడ్నాప్ చేశాడు. తమ్ముడి అచూకీలో నిజం రాబట్టేందుకు అతడిని కొట్టి హింసించి నాదెండ్ల- యడ్లపాడు మధ్య వాగులో అతన్ని ముంచి చంపేశాడు.
రామాంజనేయులు హత్య కేసులో పోలీసులు బాజీపై కేసు నమోదు చేశారు. హత్య కేసులో నరసరావుపేట వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు హాజరై తిరిగి వెళుతున్న బాజిపై ఇటీవల హత్యాయత్నం జరిగింది. తీవ్ర గాయాలతో బయటపడిన బాజీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నరసరావు పేట పోలీసులు రావిపాటి వెంకన్న, బిల్లాతోపాటు మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.
బంగారం పంపకంలో తేడాలతో హత్య.....
కేరళలో గత ఏడాది సెప్టెంబరులో దొంగిలించిన బంగారు నగలను విక్రయించే బాధ్యతను వెంకన్న, బిల్లాలు.. జంగం చంటికి అప్పగించారు. తర్వాత డబ్బు విషయమై అడిగితే అతను స్పందించకపోవడంతో అతనిపై కోపం పెంచుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో చంటిని విజయవాడ లాడ్జిలో బంధించి, చిత్రహింసలు పెట్టి చంపేశారు. మృతదేహాన్ని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరు టోల్‌గేట్ సమీపంలో పూడ్చిపెట్టారు. ఈ ఘటనలో ఏప్రిల్ 22న రామాంజనేయులు హత్యకు గురవడంతో, బాజి తమను హతమారుస్తాడనే భయంతో అతన్ని చంపేందుకు ప్రయత్నించారు. దీంతో వ్యవహారం మొత్తం వెలుగు చూసింది.
నిందితులు తెలిపిన సమాచారంతో నరసరావుపేట డీఎస్పీ జి.విజయభాస్కరరావు, చిలకలూరిపేట గ్రామీణ సీఐ వై.అచ్చయ్య, ఎస్సైలు ఎ.భాస్కర్, వి.బాలకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు బృందం బొమ్ములూరు చేరుకుని మృతదేహం కోసం అన్వేషణ ప్రారంభించారు. ఓ చోట తవ్వగా కుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. మొలతాడు, తాయత్తు, మరికొన్ని ఆనవాళ్లను చూసి కుటుంబ సభ్యులు చంటిగా గుర్తించారు. వైద్యులు అక్కడే శవ పరీక్ష నిర్వహించి, డీఎన్‌ఏ నిర్ధారణ కోసం నమూనాలు సేకరించారు. ఈ హత్య కేసులో ఇప్పటికే రావిపాటి వెంకన్న, బిల్లాతోపాటు మరో ముగ్గురిని పల్నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.