Mallika Garg: పల్నాడును దేశంలోనే వరస్ట్ జిల్లా చేశారు, ఖాకీ యూనిఫాం అంటే ఏమిటో చూపిస్తామన్న SP మల్లికా గార్గ్-palnadu has been made the worst district in the country sp mallika garg warning on counting riots ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mallika Garg: పల్నాడును దేశంలోనే వరస్ట్ జిల్లా చేశారు, ఖాకీ యూనిఫాం అంటే ఏమిటో చూపిస్తామన్న Sp మల్లికా గార్గ్

Mallika Garg: పల్నాడును దేశంలోనే వరస్ట్ జిల్లా చేశారు, ఖాకీ యూనిఫాం అంటే ఏమిటో చూపిస్తామన్న SP మల్లికా గార్గ్

Sarath chandra.B HT Telugu
Published May 31, 2024 09:00 AM IST

Mallika Garg: దేశం మొత్తం నవ్వుకునేలా పల్నాడు జిల్లా పరువుతీశారని, ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలతో పల్నాడు పరువు పోయిందని, కౌంటింగ్ సందర్భంగా మరోసారి ఆ పరిస్థితుల్ని పునరావృతం కానివ్వమని ఎస్పీ మల్లికా గార్గ్ అన్నారు.

పల్నాడు కేసుల్లో నిందితులకు జైళ్లు సరిపోవడం  లేదన్న మల్లికా గార్గ్
పల్నాడు కేసుల్లో నిందితులకు జైళ్లు సరిపోవడం లేదన్న మల్లికా గార్గ్

Mallika Garg: దేశం మొత్తం నవ్వుకునేలా పల్నాడు జిల్లా పరువుతీశారని, ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలతో పల్నాడు పరువు పోయిందని ఎస్పీ మల్లికా గార్గ్ అన్నారు. ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో పల్నాడు జిల్లా వినుకొండలో వందలాది మంది పోలీసులు, కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే పల్నాడు వరస్ట్ జిల్లా అనే ముద్ర పడిందని, దేశంలోనే ఆ పేరు వచ్చి ఉండొచ్చన్నారు. ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలు మళ్లీ జరగనివ్వనని స్పష్టం చేశారు. పోలీసులు ఉన్నా ఏ కారణాల వల్ల పల్నాడులో దారుణమైన ఘటనలు జరిగాయన్నారు.

పల్నాడు పేరు చెడగొ ట్టారని, పల్నాడు ప్రజలంటే కర్రలు, ఇనుపరాడ్లు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతారని దేశమంతటా ప్రచారమైందని ఇలాంటి ఘటనలకు కారణమైన వారిని వదిలి పెట్టమని హెచ్చరించారు. మాచర్ల, నరసరావుపేటల్లో జరిగిన గొడవలతో దేశమంతటా మార్మోగాయని మలికా గార్గ్ ఆవేదన వ్యక్తం చేశారు.

పల్నాడు జిల్లాలో జరిగిన ఘర్షణలతో ఇక్కడ ఏమి జరుగుతోందని దేశమంతటా గమనిస్తోందని, తన బ్యాచ్‌మేట్స్‌, కుటుంబ సభ్యులు, స్నేహితులు పల్నాడు ఫ్యాక్షన్ గురించే అడుగుతున్నారని రాష్ట్రంలో అత్యంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయన్నారు. బహుశా దేశంలోనే అత్యంత దారుణమైన పరిస్థితులు పల్నాడులో ఉండొచ్చన్నారు. పది రోజుల వ్యవధిలో 160 కేసులు నమోదు కావడాన్ని ఏ పోలీస్ అధికారి కోరుకోరన్నారు. పల్నాడు తర్వాత స్థానంలో ఉన్న జిల్లాలో 70 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఏ స్థాయిలో పల్నాడులో ఘర్షణలు జరిగాయో అర్థం చేసుకోవాలన్నారు.

ఘర్షణల కేసుల్లో ఇప్పటి వరకు 1300 మందిని అరెస్టు చేశామని, 400 మందిపై రౌడీషీట్లు తెరిచినట్టు ఎస్పీ ప్రకటించారు. పల్నాడు అల్లర్లలో నిందితుల్ని పెట్టేందుకు జైళ్లు సరిపోక రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పంపిస్తున్నట్లు చెప్పారు. గొడవల్లో జైళ్లకు వెళుతున్న వారంతా సామాన్యులేనని, నాయకులు మాత్రం డబ్బు, తెలివి తేటలతో బెయిల్ తెచ్చుకుని బయట తిరుగుతున్నారన్నారు.

గొడవల్లో బలవుతున్నది సామాన్య ప్రజలేనని, నాయకుల కోసం మీ జీవితాలు పాడు చేసుకోవద్దని సూచించారు. కౌంటింగ్ రోజు ఎవరైనా తోక జాడిస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని, యూనిఫాం పవర్ ఏమిటో చూస్తారని వార్నింగ్ ఇచ్చారు.

ఎస్పీ, ఐజీలపై చర్యలు తీసుకోవాలని పిన్నెల్లి పిటిషన్…

మాచర్ల ఎన్నికల పోలింగ్‌ ఘర్షణల నేపథ్యంలో జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ మల్లికా గార్గ్, గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠిలను మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో విధుల నుంచి తప్పించాలని పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు.

గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీ, ఎస్పీ మలికా గార్గ్, కారెంపూడి సిఐ నారాయణ స్వామిలను ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిన్నెల్లి హైకోర్టును కోరారు. పిన్నెల్లి సమర్పించిన వినతి పత్రాలపై శుక్రవారంలోగా నిర్ణయం తీసుకోవాలని ఏపీ హైకోర్టు డీజీపీ, ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ వెంకట జ్యోతిర్మయిలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

పోలీస్ అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు చేసినందున తగిన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ధర్మాసనం ఆదేశించింది. త్రిపాఠీ, గార్గ్, నారాయణ స్వామిలపై చర్యలు తీసుకోవాలని, వారు పని చేస్తున్న స్థానాల నుంచి మార్చాలని ఇచ్చిన వినతిపత్రంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోకపోవడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం లంచ్‌మోషన్‌లో విచారణలో పిన్నెల్లి వినతిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

Whats_app_banner

సంబంధిత కథనం