Palnadu Crime : భర్త పైశాచికం, వికలాంగురాలైన భార్యపై దాడి
Palnadu Crime : పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. మద్యానికి బానిసైన భర్త వికలాంగురాలైన భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కొన్నాళ్లు ఇంటికి దూరం ఉన్న అతడు ఇటీవల ఇంటికి వచ్చి భార్యపై దాడి చేశాడు.

Palnadu Crime : భార్యపై భర్త పైశాచికానికి దిగాడు. ఆమెపై దాడి చేసి పైశాచిక ఆనందాన్ని పొందాడు. పల్నాడు జిల్లా దాచేపల్లి గ్రామంలోని జగనన్న కాలనీలో ఈ ఘటన జరిగింది. వికలాంగురాలు షేక్ షమీమున్నీ నడికుడికి చెందిన సైదాతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. భర్త సైదా రోజూ విపరీతంగా మద్యం సేవించి భార్య, పిల్లలను చిత్ర హింసలకు గురిచేసేవాడు. భార్య వద్ద ఉన్న డబ్బు, బంగారం, వెండి బలవంతంగా లాక్కున్నాడు. భార్య, పిల్లలు వద్ద నుంచి తీసుకున్న బంగారం, వెండి ఆభరణాలను అమ్ముకుని ఆ డబ్బులతో మద్యం తాగేవాడు. ఉదయం నుంచి రాత్రి వరకు తాగుతునే ఉండేవాడు. గత నాలుగేళ్లుగా భార్య, పిల్లలను విడిచిపెట్టి బయటకు వెళ్లిపోయాడు. అయితే ఇటీవల తిరిగి ఇంటికి వచ్చిన భర్త సైదా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో విచక్షణ రహితంగా భార్యపై దాడికి దిగాడు. భార్యను కింద పడేసి తల పగులగొట్టి పారిపోయాడు. దీంతో రక్తం కారుతూ లబోదిబో అంటూ షేక్ షమీమున్నీ 100కు ఫోన్ చేసింది. దీంతో మహిళా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అర్ధరాత్రి గురజాల హాస్పిటల్ కు తరలించారు. తన భర్త వల్ల తనకు ప్రాణ హాని ఉందని, ఆమె ఫిర్యాదు చేసింది. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని, శిక్షించాలని పోలీసులను కోరింది.
బాలికలపై లైంగిక దాడి
ఇద్దరు బాలికలపై ఓ మృగాడు లైంగిక దాడి చేశాడు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులపై లైంగికదాడి జరిగింది. మాయ మాటలతో ఒకరి తరువాత మరొకరిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారులపై బెదిరింపులకు కూడా దిగాడు. దీంతో ఇద్దరు బాలికలపై పాల్పడిన లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో జరిగిన ఈ ఘటన వెలుగులోకి రావడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు అయింది. బొజ్జ నాగమల్కేశ్వరరావు స్థానికంగా కిరాణా షాపు నడుపుతున్నాడు. పాఠశాలలకు వేసవి సెలవులు రావడంతో ఇంటి వద్దే ఆడుకుంటున్న చిన్నారులపై ఈ మృగాడి కన్నుపడింది. ఇంటి వద్దే ఉన్న ఒక బాలికకు మాయ మాటలు చెప్పి దాడికి పాల్పడ్డాడు. మళ్లీ పది రోజులకు మరో బాలికపైన అదే విధంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే కీచకుడు బెదిరింపుల వల్ల ఆ ఇద్దరు బాలికలు ఇంట్లో చెప్పలేకపోయారు. ఆ బాలికల ప్రవర్తనలో తేడాలను గమనించిన తల్లిదండ్రులు ఏం జరిగిందని ఆరా తీశారు. చివరకు బాలికలు అసలు విషయం చెప్పారు. దీంతో వాస్తవాలు బయటకు వచ్చాయి. దీంతో బాలికలు కుటుంబ సభ్యులు నకరికల్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన సత్తెనపల్లి డీఎస్పీ గురునాథ్ బాబు విచారణ జరుపుతున్నామని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని చెప్పారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు