Mahasena Rajesh : కులరక్కసి చేతిలో బలైపోయా, ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నా- మహాసేన రాజేష్
Mahasena Rajesh : మహాసేన రాజేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించారు. కులరక్కసి చేతిలో మరొక్కసారి బలైపోయానని ఆయన ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు.
Mahasena Rajesh : ఎన్నికల బరి నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్లు మహాసేన రాజేష్(Mahasena Rajesh) ప్రకటించారు. ఉమ్మడి జాబితాలో టీడీపీ పి.గన్నవరం టికెట్ ను సరిపెళ్ల రాజేష్(Mahasena Rajesh)కు కేటాయించింది. అయితే పి.గన్నవరం( P Gannavaram) ఎన్నికల బరి నుంచి తాను తప్పుకుంటున్నట్టు మహాసేన రాజేష్ సోషల్ మీడియాలో ప్రకటించారు.
"కులరక్కసి చేతిలో మరొక్కసారి బలైపోయాను. జగన్ గుర్తుపెట్టుకుంటాను. నాకోసం నా పార్టీని, చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ ఎవ్వరూ తిట్టొద్దు. నేనే స్వచ్చందంగా తప్పుకుంటాను"- మహాసేన రాజేష్
గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు
పి.గన్నవరం అభ్యర్థిగా మహాసేన రాజేష్‌ను ప్రకటించిన తర్వాత... స్థానికంగా టీడీపీ, జనసేన(TDP Janasena) నేతల నుంచి వ్యతిరేకత వచ్చింది. అంబాజీపేటలో జరిగిన సమన్వయ సమావేశంలో జనసేన కార్యకర్తలు మహాసేన రాజేష్ కు వ్యతిరేకంగా నిరసన చేశారు. టీడీపీ పార్లమెంటరీ ఇన్ ఛార్జ్ హరీష్ మాధుర్ కారును ధ్వంసం చేశారు. బ్రాహ్మణ సంఘ నాయకులు శుక్రవారం విశాఖలోని టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించి రాజేష్‌కు టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. సరిపెల్ల రాజేష్.. మహాసేన పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి కులానికి వ్యతిరేకంగా పోరాటుతున్నట్లు ప్రకటించారు. 2014లో వైసీపీలో చేరారు. అయితే రాజకీయాల్లోకి రాకముందు ఆయన కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసేవారు. ఈ వ్యాఖ్యలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టీడీపీ పి.గన్నవరం సీటు ప్రకటనతో...ప్రత్యర్థులు ఈ వీడియోలను వైరల్(Videos Viral) చేశారని మహాసేన రాజేష్ ఆరోపిస్తున్నారు. వివాదాస్పద రాజేష్ కు టికెట్ కేటాయించడంపై సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్, చంద్రబాబు, లోకేశ్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. తనపై వ్యతిరేకత పెరుగుతుండడంతో....ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
పాత వీడియోలు వైరల్
2014లో వైసీపీ చేరిన మహాసేన రాజేష్... అప్పట్లో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ (Pawan Kalyan)పై విమర్శలు చేశారు. అనంతరం కొంత కాలానికి వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఆయన... జనసేనకు మద్దతుగా వ్యవహరించారు. గత ఏడాది టీడీపీలో చేరిన ఆయన... అప్పటి నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీకి మద్దతుగా మాట్లాడుతున్నారు. దీంతో టీడీపీ తొలిజాబితాలో మహాసేన రాజేష్ కు టికెట్ ఖరారైంది. అయితే అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆయనపై వ్యతిరేకంగా క్యాంపెయిన్ మొదలు కావడం, పాత వీడియోలు వైరల్ అవుతుండడంతో... చివరికి ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు రాజేష్ ప్రకటించారు.
సంబంధిత కథనం