AP Assigned Lands: ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల లెక్కలు తేల్చేందుకు జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తూ రెవిన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రెవిన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జీవో 104 జారీ చేశారు. ఈ కమిటీలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఛైర్మన్‌గా ఉంటారు. సంబంధిత జిల్లాకు చెందిన మంత్రులు సభ్యులుగా, జిల్లా కలెక్టర్ కన్వీనర్‌గా ఉంటారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు ప్రత్యేక ఆహ్వానితులుగా, ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారు. ఆర్డీఓ, సబ్ కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు.
జిల్లా స్థాయి కమిటీ పేదలకు ప్రభుత్వ భూ కేటాయింపులను సమీక్షించడంతో పాటు అర్హులకు వ్యవసాయ భూమి కేటాయింపులతో పాటు ఎక్స్ సర్వీస్ మెన్‌కు భూ కేటాయింపులను కూడా సమీక్షిస్తుంది.
ఏపీలో అసైన్డ్ భూములను లబ్దిదారుల నుంచి అక్రమంగా బదలా యించుకున్నారని భారీగా ఫిర్యాదులు వచ్చాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భూముల లావాదేవీలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం విచారణ జరిపింది. ఈ క్రమంలో నిషేధిత-22A జాబితా నుంచి తొలగించిన భూములు, పట్టా భూములు, ఇనాం భూములు గానీ మొత్తం 13.59 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో 13.57 లక్షల ఎకరాల భూములను ప్రభుత్వం వెరిఫై చేయించింది.
అసైన్డ్ కొంత మంది ఉద్దేశపూర్వకంగా ఈ భూములను హస్తగతం చేసుకునేందుకు చాలా భూములను ప్రీ హోల్డ్ చేయడానికి ప్రయత్నించారనే ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. ఈ సమస్యలను అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పేద వానికి ఎటు వంటి అన్యాయం జరుగకుండా, భూములు అన్యాక్రాంతం కాకుండా, పారిశ్రామిక అవసరాలకు, నిరుపేదల ఇళ్ల స్థలాలకు ఈ భూములను వినియోగించే విధంగా చర్యలు చేపట్టనున్నారు. భూముల రీ-సర్వేలో కూడా చాలా అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి, వీటన్నింటిపై పూర్తి స్థాయిలో సమీక్షించి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
రాష్ట్రంలో ప్రైవేటు భూములేవీ కూడా 22ఏలో ఉండకూడదనేదే ప్రభుత్వ ఆశయమని, ఆ దిశగా జిల్లా కలెక్టర్లు పనిచేయాలని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. ప్రజలకు భూమి అనేది సెంటిమెంటుతో కూడుకున్న వ్యవహారమని, పేదలకైతే అది ఒక భరోసా, క్షేత్రస్థాయిలో ప్రజలు తమ భూములకు సంబంధించి వివాదాలు లేకుండా హాయిగా ఉండాలని చూడటమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల భూ వివాదాల పరిష్కారానికి జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.
ప్రైవేటు భూములు ఎట్టిపరిస్థితిలోనూ 22ఏ వివాదాల్లో ఉండకూడదన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు. చాలా మందికి తమ భూమి ఎందుకు 22ఏ వివాదంలో ఉందో కూడా తెలీదన్నారు. జిల్లా కలెక్టర్లు కూడా జిల్లాల్లో భూ వివాదాలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలన్నాన్నారు. రెవెన్యూ శాఖలో భూ వివాదాలకు సంబంధించి ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు, అర్జీలను అన్నిటిని పరిష్కరిస్తున్నామన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను కూడా పరిష్కరిస్తున్నామని తెలిపారు
సంబంధిత కథనం