AP Building Plan Rules: ఏపీలో భవన నిర్మాణ అనుమతులు మరింత సరళం చేస్తూ ఉత్తర్వులు, రియల్‌ ఎస్టేట్‌కు ఊతం-orders further simplifying building permits in ap a boost to real estate ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Building Plan Rules: ఏపీలో భవన నిర్మాణ అనుమతులు మరింత సరళం చేస్తూ ఉత్తర్వులు, రియల్‌ ఎస్టేట్‌కు ఊతం

AP Building Plan Rules: ఏపీలో భవన నిర్మాణ అనుమతులు మరింత సరళం చేస్తూ ఉత్తర్వులు, రియల్‌ ఎస్టేట్‌కు ఊతం

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 10, 2025 01:17 PM IST

AP Building Plan Rules: ఏపీలో భవన నిర్మాణ రంగానికి ఊతం ఇచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణ‍యం తీసుకుంది. నిర్మాణ రంగం సమస్యల్ని పరిష్కరించే క్రమంలో నిబంధనల్ని సడలించింది. అనుమతులు, లే ఔట్లకు అనుమతుల్ని సులభతరం చేస్తూ ఉత్తర్వులు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో భవన నిర్మాణ అనుమతులు సరళతరం
ఏపీలో భవన నిర్మాణ అనుమతులు సరళతరం

AP Building Plan Rules: ఏపీలో భ‌వ‌న నిర్మాణాలు,లే ఔట్ల అనుమ‌తుల‌ జారీలో నిబంధన లు సుల‌భ‌త‌రం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ బిల్డింగ్ రూల్స్ -2017, ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ - 2017 లో సవరణలు చేస్తూ వేరు వేరుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

yearly horoscope entry point

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా భవన, లే అవుట్ల అనుమతుల్లో మార్పులు తీసుకొచ్చినట్టు మంత్రి నారాయణ చెప్పారు. రాష్ట్రంలో రియ‌ల్ ఎస్టేట్ రంగం పెరిగేలా కీల‌క సంస్క‌ర‌ణ‌లతో ఉత్తర్వులు జారీ చేశామని, సంక్రాంతి కానుక‌గా బిల్డ‌ర్లు, డెవ‌ల‌ప‌ర్లు, ప్ర‌జ‌ల‌కు అనుకూలంగా ఉండేలా నిబంధ‌న‌లు మార్పులు జీవోలు జారీ చేసినట్టు చెప్పారు.

లే అవుట్లలో వేసే రోడ్లకు గ‌తంలో ఉన్న‌12 మీటర్లకు బ‌దులు 9 మీట‌ర్ల‌కు కుదిస్తూ స‌వ‌ర‌ణ‌ చేశారు. 500 చ‌.మీ.పైబ‌డిన స్థ‌లాల్లో చేపట్టే నిర్మాణాల్లో సెల్లారుకు అనుమ‌తి ఇస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. టీడీఆర్ బాండ్ల జారీ క‌మిటీలో రెవెన్యూ, స‌బ్ రిజిస్ట్రార్ ల ప్రమేయాన్ని తొల‌గిస్తున్నట్టు ప్రకటించారు.

రాష్ట్ర రహదారులు, జాతీయ ర‌హ‌దారులను ఆనుకుని ఉన్న స్థ‌లాలు డెవ‌ల‌ప్ చేసేందుకు 12 మీటర్ల మేరకు స‌ర్వీస్ రోడ్డు విడిచిపెట్టాలనే నిబంధ‌న తొల‌గిస్తున్నట్టు ప్రకటించారు. బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాల సెట్ బ్యాక్ నిబంధ‌న‌ల్లో మార్పులు చేశారు. వీటితో పాటు మరిన్ని నిబంధనలు సరళతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ల ప్రతినిధులతో చర్చించి తుది నిబంధనలు జారీ చేసినట్టు మంత్రి నారాయణ వివరించారు. తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని గత ఐదేళ్లలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతిందని దానిని తిరిగి గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. భవన నిర్మాణాలు, లే అవుట్లు అనుమతులను సులభతరం చేస్తూ జీవో లు జారీ చేసినట్టు వివరించారు.

రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, భవన నిర్మాణాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానం అమల్లోకి తెస్తున్నట్టు తెలిపారు. మార్చి నాటికి సింగల్ విండో విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు. ప్రతి ఏటా రెండు సార్లు రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ల ప్రతినిధులతో సమావేశం అవుతానని మంత్రి నారాయణ చెప్పారు. నిర్మాణ రంగానికి ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Whats_app_banner