ఏపీలో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఛాన్స్‌..! ప్రభుత్వ యోచన-only those with more than two children have a chance to contest in local body elections in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీలో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఛాన్స్‌..! ప్రభుత్వ యోచన

ఏపీలో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఛాన్స్‌..! ప్రభుత్వ యోచన

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 16, 2025 08:37 AM IST

Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కంటే తక్కువ సంతానం ఉన్న వారికి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఇవ్వకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు. జనాభా పెరుగుదలను ప్రోత్సహించే క్రమంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు ఏపీ సర్కారు కసరత్తు చేస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికే ఛాన్స్‌
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికే ఛాన్స్‌

Chandrababu: జనాభా తగ్గుదలతో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఏపీ సీఎం కొత్త ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు. సంక్రాంతి సందర్భంగా నారా వారి పల్లెలో ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ఇద్దరు పిల్లల కంటే తక్కువ సంతానం ఉన్న వారిని ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా చేయాలని భావిస్తున్నారు. 2026లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో దీనిని అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికే పోటీకి అవకాశం కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు.

దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోవడం, ఉత్పాదక శక్తి ఉండే యువతరం జనాభా తగ్గిపోవడంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. జనాభా నియంత్రణ చర్యల్లో భాగంగా కొన్ని దశాబ్దాలుగా కఠినమైన జనాభా నియంత్రణ చర్యలు దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోవడానికి కారణం అయ్యాయి. ఈ నేపథ్యంలో పెద్ద కుటుంబాలను ప్రోత్సహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలను ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే తక్కువ సంతానం ఉన్న వారిని అనర్హులుగా చేయాలని భావిస్తున్నారు.

ఇందుకే ఆ ఆలోచన

ఏపీలో జనాభా తగ్గిపోవడం కారణంగా కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోవడంపై కొన్నేళ్లుగా ఆందోళన వ్యక్తం అవుతోంది. జనాభా నియంత్రణకు కృషి చేసినందుకు ప్రతిఫలంగా రాష్ట్ర విభజన తర్వాత జనాభా ప్రతిపాదికన భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. దక్షిణాదిన అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలు ఆదాయం కోల్పోవడంపై ఆందోళన వ్యక్తం చేసినా కేంద్రం పట్టించుకోలేదు. దీనికి తోడు జనాభా సంఖ్య తగ్గుతుండటం, చిన్న కుటుంబాల సంఖ్య పెరగడంతో యువతరం సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది.

ఈ నేపథ్యంలో జనాభా పెరుగుదలపై కీలక నిర్ణయాలు తీసుకోవాలని ఏపీ సర్కారు భావిస్తోంది. ఇద్దరి కంటే తక్కువ పిల్లలు ఉన్న వారికి పంచాయితీ పోటీ అవకాశం లేకపోవచ్చు. జనాభా పెరుగుదల సంక్షోభం నేపథ్యంలో ఈ తరహా నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.

“ఒకప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఉంటే పంచాయితీల్లో పోటీ చేయడానికి వీల్లేదని, లోకల్ బాడీస్‌‌లో తక్కువ మంది పిల్లలు ఉంటే ఎన్నికల్లో కంటెస్ట్‌ చేయడానికి వీలు ఉండేది కాదని చంద్రబాబు చెప్పారు. ఇకపై ఇద్దరు పిల్లలు కంటే ఎక్కువ మంది ఉంటేనే సర్పంచ్‌, మేయర్‌ పదవులు, మునిసిపల్ కౌన్సిలర్‌ అవుతారని చెప్పారు. దీనిపై కసరత్తు చేస్తున్నాం’’ అని చెప్పారు. సంక్రాంతి సందర్భంగా నారా వారి పల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు.

అదనంగా బియ్యం

జనాభా ప్రోత్సహించేందుకు బియ్యం పంపిణీలో కూడా మార్పులు చేయాలని భావిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం ఒక్కొక్కరికి రేషన్ కార్డు మీద 5కేజీలు బియ్యం ఇచ్చే వారమని, 25కేజీలు సీలింగ్ ఉండేదని, ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి అదనంగా బియ్యం ఇచ్చే పాలసీ రూపొందిస్తున్నట్టు చెప్పారు.

ఉత్తర భారతానికి ఎక్కువ మంది జనాభా అడ్వాంటేజ్‌ కొన్నాళ్లు మాత్రమే ఉంటుందని చంద్రబాబు అంచనా వేశారు. డబుల్ ఇన్‌ కమ్‌ నో కిడ్స్‌ అంటున్నారని, ప్రపంచంలో అన్ని దేశాలు ఇదే సమస్య ఎదుర్కొంటున్నాయని, సంపద సృష్టించి, ఆదాయాన్ని పెంచే క్రమంలో ఈ ప్రమాదాన్ని విస్మరించారని చెప్పారు. 

దక్షిణ కొరియా 0.7 శాతం జనాభా మాత్రమే ఉందని, చాలా దేశాల్లో జనాభా కొరత ఉందని వాళ్లకు మనుషులు అవసరం ఉందన్నారు. ఇక్కడి నుంచి జనాభాను పంపే పరిస్థితి వస్తుందన్నారుర. ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.

Whats_app_banner