AP Weather Update: రాయలసీమపై కొనసాగుతున్న ఆవర్తనం, పలు జిల్లాల్లో వర్ష సూచన, ఉక్కపోతతో అల్లాడుతున్న కోస్తా జిల్లాలు
AP Weather Update: ఏపీలో భానుడి భగభగలు కొనసాగు తున్నాయి. పలు జిల్లాలు ఉక్కపోతలతో అల్లాడిపోతున్నాయి. వారం పది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు రాయలసీమ జిల్లాలో ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో మంగళవారం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
AP Weather Update: ఐఎండి సూచనల ప్రకారం రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతుందని ఈ ఆవర్తనం నుండి కొమోరిన్ ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
దీని ప్రభావంతో 20 ఆగష్టు మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అలాగే విశాఖపట్నం, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది.
బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, ఏలూరు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
బంగాళాఖాతంపై విస్తరించిన ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. సోమవారం ఉత్తర కోస్తా జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశముందని ఐఎండి పేర్కొంది.
ఉక్కపోతతో అల్లాడుతున్న జనం..
జులై వాతావరణం కాస్త చల్లబడినా ఆగస్టులో మాత్రం జనాలకు అధిక ఉష్ణోగ్రతలు అల్లాడించేస్తున్నాయి. ఎన్నడు లేని విధంగా ఉక్కపోత, భరించలేని ఎండలు ఉంటున్నాయి. వేసవి మాదిరిగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జూన్ చివరి నుంచి జులై వరకు విస్తారంగా వర్షాలు కురిస్తే ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది.
రుతుపవనాల సీజన్‌లో ఆగస్టు నెలలో కురిసే వర్షాలు పంటలకు అత్యంత కీలకంగా భావిస్తారు. ఈసారి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నా వర్షాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది.
ప్రస్తుతానికి ఏపీలో కొంత ఎక్కువే వర్షపాతం నమోదైనా దేశంలోని అనేక ప్రాంతాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి సీజన్‌లో బంగాళాఖాతంలో సగటున ప్రతి వారం ఒక అల్పపీడనం ఏర్పడాలి. సీజన్ మొత్తం ఆరేడు వాయుగుండాలు రావాలి. ఈసారి అలా జరగలేదు. ఆగస్టులో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నమోదయ్యాయి. ఇది ఖరీఫ్ సాగుపై ప్రభావం చూపింది.
రాష్ట్రంలో పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆగస్టులో మొదటి మూడు వారాల్లో రెండు, మూడు రోజుల తప్ప ఎక్కువ రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఐఎండి గణంకాుల సూచిస్తున్నాయి.
నైరుతి రుతుపవనాలు వచ్చిన తర్వాత జూన్ ఒకటి నుంచి గత శుక్రవారం వరకు రాష్ట్రంలోని 54 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నమోదు అయ్యాయి.242 మండలాల్లో మిగులు వర్షాలు, 328 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
మొత్తం 670 మండలాల్లో 345.9 మి.మీ.కుగాను 403.9 మి.మీ(సాధారణం కంటే 16.7 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. కడప జిల్లాలో 10, శ్రీకాకుళంలో 7, ఒంగోలులో 6, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నాలుగేసి మండలాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి.
ఆగస్టులో కొన్ని మండలాల్లో అసలు వర్షాలే కురవలేదు. ఐఎండీ నివేదిక ప్రకారం గతవారం రోజుల్లో అనకాపల్లి, బాపట్ల, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఎక్కువగా, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో కొంతమేర లోటు వర్షపాతం నమోదైంది. జూలైలో మాత్రమే మంచి వర్షాలు కురిశాయని, నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన జూన్‌లో కూడా వర్షాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఆగస్టులో కూడా తిరిగి అదే వాతావరణం కనిపిస్తోంది.