APSRTC Driver Suspend : ఎన్టీఆర్ పాటకు డ్యాన్స్.. ఆర్టీసీ డ్రైవర్ సస్పెండ్!-officials suspended driver for dancing in front of apsrtc bus ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Apsrtc Driver Suspend : ఎన్టీఆర్ పాటకు డ్యాన్స్.. ఆర్టీసీ డ్రైవర్ సస్పెండ్!

APSRTC Driver Suspend : ఎన్టీఆర్ పాటకు డ్యాన్స్.. ఆర్టీసీ డ్రైవర్ సస్పెండ్!

APSRTC Driver Suspend : ఆయనో బస్ డ్రైవర్. డ్యాన్స్ అంటే ఆసక్తి. ఆ ఆసక్తితో పిల్లల కోరిక మేరకు బస్సు ముందు దేవర పాటకు డ్యాన్స్ చేశారు. ఆ డ్యాన్సే అతని కొంప ముంచింది. విధుల్లో ఉన్నప్పుడు ఇలా డ్యాన్స్, రీల్స్ చేయడంపై అధికారులు సీరియస్ అయ్యారు. డ్రైవర్‌ను సస్పెండ్ చేశారు.

ఆర్టీసీ డ్రైవర్ డ్యాన్స్

ఆర్టీసీ బస్సు ముందు డ్యాన్స్ వేసిన డ్రైవర్‌పై అధికారులు వేటు వేశారు. అతన్ని విధుల నుంచి తొలగించారు. దీంతో డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సులో ఉన్న పిల్లలు అడిగితేనే తాను డ్యాన్స్ చేశానని చెబుతున్నాడు. అతను డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు.

ఆ రోజు ఏం జరిగిందంటే..

'ఉదయం 8 గంటల సమయంలో ప్యాసింజర్లను ఎక్కించుకొని రౌతలపూడి నుంచి వస్తున్నాం. మార్గ మధ్యలో రోడ్డుపై ఓ ట్రాక్టర్ ఆగిపోయింది. ముందుకు, వెనక్కి వెళ్లే అవకాశం లేదు. ట్రాక్టర్ తీయమని అడిగితే 5 నిమిషాలు పడుతుందని చెప్పారు. ఆ సమయంలో టైం అయిపోతుందని పిల్లలు గొడవపెట్టారు. అప్పుడే పిల్లలు సాంగ్స్ పెట్టారు. డ్రైవరన్నా.. ఓసారి ఈ సాంగ్‌కు డ్యాన్స్ చేయన్నా అని అడిగారు' అని డ్రైవర్ వివరించారు.

'పిల్లల ఆనందం కోసం అలా డ్యాన్స్ చేశారు. కావాలని చేయలేదు. ఈ డ్యాన్స్ చేసిన కారణంగా నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. ఐదారు సంవత్సరాల నుంచి ఆర్టీసీలో పని చేస్తున్నా. ప్రస్తుతం తుని డిపోలో చేస్తున్నా. డిపో మేనేజర్ నన్ను ఏమీ అనలేదు. కానీ.. వేరే అధికారి మాత్రం బాబు నీకు ఉద్యోగం లేదని చెప్పారు. మళ్లీ మాట్లాడదామని డిపో మేనేజర్ చెప్పారు' అని డ్రైవర్ వాపోయారు.

'చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. నా కుటుంబ సభ్యులు కూడా నన్ను ప్రోత్సహించారు. నారా లోకేష్ కూడా వీడియోపై స్పందించారు. నిజంగా లోకేష్ దగ్గరకు వెళ్తుందని ఊహించలేదు. ఆయన ఫోన్ చేస్తారేమో మాట్లాడదామని చూశా. నాకు ఏదో మార్గం చూపాలి. నాకు డ్రైవింగ్ తప్ప ఏం తెలియదు. 1999 నుంచి డ్రైవింగ్‌ ఫీల్డ్‌లోనే ఉన్నా' అని డ్రైవర్ చెప్పారు.

తుని ఆర్టీసీ బస్ డిపో డ్రైవర్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'డ్యాన్స్‌ సూపర్‌ బ్రదర్‌ కీప్‌ ఇట్‌ అప్‌. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా బస్సు ప్రయాణికులు వీక్షించిన గొప్ప సమయంగా ఆశిస్తున్నాను' అంటూ సరదాగా ట్వీట్ చేశారు. నెటిజన్లు ట్వీట్‌ను ప్రస్తావిస్తూ లోకేష్ స్పందించారు. లోకష్ స్పందించిన తర్వాత ఈ వీడియో మరింత వైరల్ అవుతోంది.