AP Free Gas Cylinder : ఫ్రీ గ్యాస్ సిలిండర్ పొందడంలో ఇబ్బందులు ఉన్నాయా.. అయితే ఈ పని చేయండి..
AP Free Gas Cylinder : ఏపీలో ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభం అయ్యింది. అక్టోబర్ 31 నుంచి బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే.. చాలామంది రాయితీ పొందే విధానం తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పథకానికి తాము అర్హులమా కాదా.. అనే అనుమానాలతో సతమతం అవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో దీపం 2 పథకం కింద ఉచిత సిలిండర్‌లు అందిస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. అయితే.. చాలామంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ పథకానికి అర్హులమో.. కాదోనని అయోమయంలో ఉన్నారు. అలాంటి వారికి అధికారులు క్లారిటీ ఇస్తున్నారు.
ఏపీలో మొత్తం రేషన్ కార్డుల కంటే.. అర్హుల సంఖ్య తక్కువగా ఉంది. ఆధార్, రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ఆధారంగా రాయితీ ఇస్తున్నారు. అయితే.. సరైన వివరాలు లేక అర్హుల సంఖ్య తగ్గిందని అధికారులు చెబుతున్నారు. 1.54 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లు ఉంటే.. ఉచిత సిలిండర్ పథకం కోసం దాదాపు 1.08 కోట్ల కనెక్షన్లు అర్హత పొందాయని అధికారులు వివరిస్తున్నారు.
ఇటు రేషన్ కార్డులు మాత్రం 1.48 కోట్లు ఉన్నాయి. అయితే.. చాలామందికి గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డులున్నా.. ఆధార్ వివరాలు ఇవ్వకపోవడంతో రాయితీ అర్హత పొందలేకపోయారని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వీరు ఆధార్ అనుసంధానం ప్రక్రియ పూర్తి చేసుకుంటే.. అర్హుల సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ కేవైసీతోనే సమస్య..
దీపం 2 పథకం కింద రాయితీ పొందేందుకు ఈ కేవైసీ తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈకేవైసీ కోసం లబ్ధిదారులు గ్యాస్ డీలర్ల వద్దకు వెళ్తున్నారు. గంటల తరబడి వేచి చూస్తున్నారు. సాంకేతిక కారణాలతో.. ప్రాసెస్ త్వరగా కావడం లేదు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని ప్రజలు కొరుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల ద్వారా కాకుండా గ్రామాల్లోనే ఈకేవైసీ చేసుకునేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అధికారుల సూచనలు ఇవే..
కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరుమీద గ్యాస్ కనెక్షన్ ఉందో.. ఆ వ్యక్తి పేరు రేషన్ కార్డులో ఉంటే సబ్సిడీ వస్తుంది. రాయితీ పొందాలంటే రేషన్ కార్డు, ఆధార్, గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి. భార్య పేరుతో రేషన్ కార్డు, భర్త పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉన్నా ఈ పథకానికి అర్హులే. రేషన్ కార్డులోని సభ్యుల పేర్లతో ఒకటి కంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉంటే.. సబ్సిడీ ఒక్క కనెక్షన్‌కే వస్తుందని.
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన దీపం కనెక్షన్లకు కూడా ప్రస్తుత పథకం వర్తిస్తుంది. సిలిండర్ అందాక 48 గంటల్లో ఇంధన సంస్థలే సబ్సిడీ డబ్బును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తాయి. ఈ పథకంలో సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబరు 1967 కు ఫోన్ చేయొచ్చు. గ్రామ, వార్డు సచివాలయాల్లో, ఎమ్మార్వో ఆఫీసుల్లో అధికారుల్ని సంప్రదించి.. అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు.