AP Police: ప్రమాణ స్వీకార ఏర్పాట్లలో అధికార యంత్రాంగం వైఫల్యం, నరకం చూసిన నగరం, గంటల తరబడి ఎదురు చూపులు
AP Police: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార ఏర్పాట్లలో అధికారులు, పోలీస్ యంత్రాంగం వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. రూట్ మ్యాప్‌లు, ఎంట్రీ-ఎగ్జిట్‌లను నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యారు.
AP Police: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాట్లు చేయడం, ట్రాఫిక్ నిర్వహణలో అధికార యంత్రాంగం వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. గంటల తరబడి రోడ్లపై ట్రాఫిక్ నిలిపివేసి నరకం చూపించారు. ప్రమాణ స్వీకార వేదిక వద్ద ఏర్పాటు చేసిన గ్యాలరీల్లోకి వెళ్లేందుకు పాస్‌లు జారీ చేసినా ఉపయోగపడలేదు. అధికారులు, ప్రజా ప్రతినిధులు కనీసం ప్రాంగణం వద్దకు కూడా చేరుకోలేకపోయారు.
డీజీపీ స్వయంగా ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని సభా ప్రాంగణానికి చేరుకోలేకపోయారంటే పోలీసుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బుధవారం తెల్లవారు జాము నుంచి సాయంత్రం వరకు చెన్నై-కోల్‌కత్త జాతీయ రహదారిపై రద్దీ కొనసాగింది. భారీ వాహనాలు, బస్సుల్ని దారి మళ్లించి కేవలం ప్రమాణ స్వీకారానికి వచ్చే వారిని మాత్రమే అనుమతించినా వాటిని నియంత్రించలేకపోయారు.
ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకోడానికి జాతీయ రహదారిపై ఓ వైపు పూర్తిగా స్టెరైల్ ఎంట్రీగా నిర్ణయించారు. పాస్‌లు ఉన్న వాహనాలను కూడా అందులోకి అనుమతించలేదు. వివిఐపిలు, కేంద్రమంత్రులు, ఎస్కార్ట్ ఉన్న వాహనాలు వచ్చే సమయంలో తప్ప మిగిలిన సమయంలో ట్రాఫిక్ నియంత్రించకపోవడంతో 20 కిలోమీటర్ల ప్రయాణానికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది.
ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి బయల్దేరిన ఏపీ గవర్నర్ కాన్వాయ్ సైతం గూడవల్లి సమీపంలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. దాదాపు గంటకు పైగా గవర్నర్ ట్రాఫిక్‌లోనే వేచి చూడాల్సి వచ్చింది. చివరి నిమిషంలో గవర్నర్ కాన్వాయ్ సభా ప్రాంగణానికి చేరుకోవాల్సి వచ్చింది.
వేదిక వద్దకు నేరుగా చేరుకునేందుక స్టెరైల్ రూట్ ఏర్పాటు చేసినా వీఐపీ లకు ఇబ్బందులు తప్పలేదు. ఎంట్రీ, ఎగ్జిట్ విషయంలో విజయవాడ పోలీసులు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో పాస్‌లు ఉన్న వారు కూడా గందరగోళానికి గురయ్యారు.
ట్రాఫిక్ జామ్ లో చిక్కుకు పోవడంతో జనసేన నాయకుడు నాగబాబు, అకిరా నందన్, ఇతర కుటుంబ సభ్యులు సకాలంలో ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకోలేకపోయారు. దాాదాపు ఐదు బస్సుల్లో బయల్దేరిన పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు ట్రాఫిక్‌లోనే చిక్కుకుపోయారు. గూడవల్లి సమీపంలో కాలినడకన బయల్దేరేందుకు నాగబాబు, పవన్ తనయుడు బస్సు దిగడంతో పోలీసులు అతికష్టమ్మీద వారిని మరో వాహనంలో పంపారు.
పోలీస్ ఎస్కార్ట్ ఉన్నా వారి వాహనాలను సకాలంలో సభా ప్రాంగణానికి చేర్చలేకపోయారు. ఇక ఏపీ డీజీపీ సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి సభా ప్రాంగణానికి బయల్దేరిన డీజీపీ వాహనాలు నిలిచిపోవడంతో కిందకు దిగి ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రయత్నించారు. ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు శ్రమించారు. డీజీపీ సభా ప్రాంగణానికి చేరక ముందే ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది.
పోలీసుల ప్రణాళిక లోపంతో పాస్‌లు ఉన్న ముఖ్య నాయకులు కూడా వేదిక వద్దకు చేర లేకపోయారు. సీనియర్ టీడీపీ నాయకులు ద్విచక్ర వాహనాలపై వేదిక వద్దకు చేరుకునేందుకు ప్రయత్నించారు. బందోబస్తు విధుల్లో ఉన్న సిబ్బందిలో చాలామంది వివిఐపి మూమెంట్ ఉన్న సమయంలో మాత్రమే స్పందించారు. మిగిలిన సమయంలో ట్రాఫిక్ నిర్వహణను వదిలేశారు. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత పోలీసులు పూర్తిగా మాయమైపోవడంతో తిరుగు ప్రయాణంలో కూడా నరకం చూశారు. ట్రాఫిక్ మళ్ళింపులపై దృష్టి పెట్టిన పోలీసులు, పార్కింగ్, వాహనాల నియంత్రణ వంటి అంశాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.
సంబంధిత కథనం