YCP Over Confidence: తెలియలేదు కానీ “తమరి” కళ్లకు గంతలు బాగానే కట్టారే..!-officials and party leaders who blindfolded the chief minister and caused the defeat in the mlc election ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Officials And Party Leaders Who Blindfolded The Chief Minister And Caused The Defeat In The Mlc Election

YCP Over Confidence: తెలియలేదు కానీ “తమరి” కళ్లకు గంతలు బాగానే కట్టారే..!

HT Telugu Desk HT Telugu
Mar 17, 2023 07:22 PM IST

YCP Over Confidence: వారు వీరనే తేడా లేదు, ముఖ్యమంత్రి కళ్లకు అంతా గంతలు కట్టి నాలుగేళ్లు కాలం గడిపేశారు. రోజువారీ నివేదికల్లో అంతా బాగుందనే చెప్పేశారు.ఎన్నికలకు ఏడాది ముందు వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు తిరగబడే వరకు వరకు రావడానికి కారకులు ఎవరనే చర్చ ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్మోహన్ రెడ్డి

YCP Over Confidence: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవడానికి కారకులు ఎవరనే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది. అక్కడా ఇక్కడ అనే తేడా లేకుండా గెలిచిన స్థానాల గురించి పట్టించుకోకుండా వైసీపసీ వెనుకంజలో ఉన్న రెండు, మూడు స్థానాల చుట్టే చర్చ నడుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు మొదలుకుని సామాన్య జనం వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై ఎవరికి తోచినట్లు వారు విశ్లేషిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు సరిగ్గా ఏడాదిలో రాబోతున్నాయి. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వైఎస్సార్సీపీకి తిరుగులేని మెజార్టీని కట్టబెట్టారు. 175 స్థానాలకు 151 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం పోలైన ఓట్లలో దాదాపు 49.95శాతం ఓట్లతో వైసీపీ అధికాారాన్ని దక్కించుకుంది. ప్రతిపక్ష టీడీపీ వైసీపీతో పోలిస్తే దాదాపు 10.5శాతం ఓట్లు వెనుకబడిపోయింది. తిరుగులేని ఆధిక్యాన్ని దక్కించుకున్న వైఎస్సార్సీపీ , సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు ప్రతికూల ఫలితాలను మూటగట్టుకుంది.

ఎమ్మెల్సీ ఎన్నికలకు సాధారణ ఎన్నికలకు పోలిక ఏముందనుకోవడానికి వీల్లేని విధంగా పట్టభద్రుల నియోజక వర్గాల్లో జరిగిన ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు ఎదురయ్యాయి. ఉపాధ్యాయులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం పెద్ద విశేషం కాకపోవచ్చు. సాధారణ ఎన్నికల్లో ఓటింగ్‌లో పాల్గొనే ఓటర్లలో భాగమై ఉండే పట్టభద్రులు ఇచ్చిన తీర్పును ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు వైసీపీకి ఎదురైంది.

ముఖ్యమంత్రిని మభ్యపెట్టేశారా….?

ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ప్రతి స్థానంలో గెలిచి తీరాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ బాధ్యుల్ని ఆదేశించారు. ఎన్నిక జరిగే ప్రతి స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పార్టీ నాయకులు, ఎన్నికలు జరిగే ప్రాంతాల మంత్రలు, ఎమ్మెల్యేలు పట్టభద్రుల ఎన్నికలకు కూడా సాధారణ ఎన్నిలకు మాదిరే “అన్ని విషయాల్లో” ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా కష్టపడ్డారు. వారి కష్టానికి తగిన ఫలితం మాత్రం దక్కలేదు.

పట్టభద్రుల నియోజక వర్గాల ఫలితాలు అయా ప్రాంతాల ప్రజల మనోభావాలకు ఎంతవరకు అద్దం పడతాయో కాని అధికార పార్టీలో సరిదిద్దుకోవాల్సిన చాలా అంశాలను మాత్రం గుర్తు చేస్తున్నాయని ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. చాలా విషయాల్లో ముఖ్యమంత్రిని పూర్తిగా మభ్యపెడుతున్నారని , గతంలో ఏ ముఖ‌్యమంత్రి దగ్గర ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు.

మరోవైపు ముఖ్యమంత్రి కార్యాలయంలో గతంలో లేని వ్యవహారశైలిని కొంతమంది అధికారులు కొత్తగా అలవాటు చేశారని చెబుతున్నారు. ముఖ‌్యమంత్రులతో సంభాషించేటపుడు “సర్‌” “సిఎం గారు” అనే పదాలను మాత్రమే వాడేవారని, ఇప్పుడు కొత్తగా కొంతమంది తమరు అని మాత్రమే ముఖ‌్యమంత్రిని సంబోధించేలా అలవాటు చేశారని వివరిస్తున్నారు. నిజానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకంటే వయసులో పెద్దవారిని స్థాయితో సంబంధం లేకుండా “అన్న”అని మాత్రమే సంబోధిస్తారు.

రాయలసీమ వ్యవహారిక భాషలో కనీసం “మీరు” అని కూడా ఎక్కువగా వినియోగించరని, ఎవరినైనా పలకరించడానికి “నువ్వు ” అనే పదమే ఎక్కువ వినియోగంలో ఉంటుందని గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రికి అలవాటు లేని అతివినయ పదాలను ఆయన మనసులోకి చొప్పించి వాస్తవిక ధోరణి నుంచి దూరం చేశారని చెబుతున్నారు. ముఖ్యమంత్రికి క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తెలియకుండా జాగ్రత్త పడటంలో రోజువారీ నివేదికలు ఇచ్చే ముఖ్యమైన వ్యక్తుల పాత్ర గణనీయంగా ఉందని చెబుతున్నారు.

క్షేత్ర స్థాయి పరిస్థితులకు, ముఖ్యమంత్రికి అందే నివేదికలకు పొంతన లేకపోవడం వల్లే చాలా విషయాల్లో దిద్దబాటు చర్యలకు అవకాశం లేని పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు. మూడు పట్టభద్రుల నియోజక వర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలను ఖచ్చితంగా ప్రజాభిప్రాయానికి పెద్ద శాంపిల్‌గా తీసుకోవాల్సిందేనని వివరిస్తున్నారు.

కొరవడిన ప్రచారం….

మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ఓట్లు పడకపోవడానికి పార్టీ క్యాడర్‌లో ఉన్న స్తభ్దత కూడా కారణమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కింది స్థాయి పార్టీ కార్యకర్తలు, నాయకుల్ని పట్టించుకునే పరిస్థితులు లేకపోవడం, చిన్న చిన్న పనులు కూడా చేసుకునే పరిస్థితులు లేకపోవడం వల్ల చాలామంది ఎన్నికలపై ఆసక్తి చూపించలేకపోయారని చెబుతున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పోలిస్తే వైఎస్సార్సీపీ ప్రచారంలో కూడా బాగా వెనుకబడిపోయినట్లు చెబుతున్నారు. టీడీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ ఎన్నికలపై డిజిటల్ కాంపెయిన్ చేస్తే వైసీపీ మాత్రం వాటిని తిప్పి కొట్టడంలో కూడా విఫలమైందని చెబుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను టీడీపీ శ్రేణులు బలంగా ఎండగడితే, వాటిని తిప్పి కొట్టాల్సిన వైసీపీ సోషల్ మీడియా ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసుకోడానికి, ప్రభుత్వ పథకాలకు ట్రెండ్లు చేయడానికి పరిమితమయ్యారని గుర్తు చేస్తున్నారు.

విపక్షాల ఓట్లు కలిసొచ్చాయా….?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు జనసేన మద్దతివ్వడం కలిసొచ్చిందనే వాదన కూడా ఉంది. ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేయకపోవడం, కమ్యూనిస్టు పార్టీలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండటం వంటి అంశాలు కూడా టీడీపీ కలిసొచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదనే పవన్ కళ్యాణ్‌ నినాదం పట్టభద్రుల నియోజక వర్గాల్లో పనికొచ్చిందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

మంద బలంలో పనికొచ్చే సరుకెంత….

వైఎస్సార్సీపీలో వ్యూహకర్తలకు కొదవేం లేదు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్‌ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చింది తామేనని చెప్పుకునే వారికిి తక్కువ లేదు. రాష్ట్రంలో పరిస్థితులు కలిసి రావడం, 2009 నుంచి జగన్మోహన్ రెడ్డి కష్టాన్ని చూసి అధికారంలోకి వచ్చామనే వారి కంటే తమ వ్యూహాలు, విశ్లేషణలతో ఫలితాలను మార్చమని చెప్పుకునే వారు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఎక్కువైపోయారనే విమర్శలున్నాయి.

ముఖ్యమంత్రి కూడా వాటిని ఆస్వాదించడం వల్ల భజన బృందాల సంఖ్య పెరిగిపోయిందని తాడేపల్లి వర్గాలు గుసగుసలాడుకుంటాయి. ముఖ్యమంత్రి ముందు ఆలిండియా సర్వీస్ అధికారులు సైతం చేతులు కట్టుకుని అంతా బాగుంది, ఎప్పటికి మనమే తరహా మాటలతో కుర్చీ కిందకు నీళ్లు వచ్చాయనే విమర్శ ఉంది. ముఖ్యమంత్రి కళ్లు తెరిచి వాళ్లను గుర్తిస్తారో లేదో కాలమే సమాధానం చెప్పాలి.

IPL_Entry_Point