Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదంలో ఏపీ వాసి మృతి, ధ్రువీకరించిన రైల్వే అధికారులు-odisha train accident srikakulam resident died railway officials confirm death ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Odisha Train Accident Srikakulam Resident Died Railway Officials Confirm Death

Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదంలో ఏపీ వాసి మృతి, ధ్రువీకరించిన రైల్వే అధికారులు

Bandaru Satyaprasad HT Telugu
Jun 04, 2023 11:11 AM IST

Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదంలో ఏపీకి చెందిన ఓ వ్యక్తి చనిపోయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఆయన కుటుంబంతో బాలాసోర్ అంటున్నారు. ఆయన స్వస్థలం శ్రీకాకుళం అని అధికారులు తెలిపారు.

ఒడిశా రైలు ప్రమాదం
ఒడిశా రైలు ప్రమాదం (Twitter )

Odisha Train Accident : ఒడిశా బాలేశ్వర్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మంది మృతి చెందినట్లు రైల్వే అధికారులు ధ్రువీకరించారు. కోరమాండల్, యశ్వంత్ పూర్ రైళ్లలో ప్రయాణించిన ఏపీకి చెందిన 141 ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయని మంత్రులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన సి.గురుమూర్తి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి చెందిన గురుమూర్తి... బాలాసోర్ జిల్లాలో ఉంటున్నారు. ఆయన మృతదేహాన్ని బాలాసోర్ లోని కుటుంబ సభ్యులకు అప్పగించారు. శనివారం గురుమూర్తి అంత్యక్రియలు పూర్తయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

విజయవాడ చేరుకున్న ఏడుగురు ప్రమాద బాధితులు

ప్రమాద బాధితులను వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. శనివారం రాత్రి ఏడుగురు ప్రమాద బాధితులు ప్రత్యేక రైలులో విజయవాడకు చేరుకున్నారు. వారి కోసం కుటుంబ సభ్యులు, స్థానిక నేతలు, అధికారులు విజయవాడ రైల్వే స్టేషన్ కు వచ్చారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడంతో పాటు ఆహారం అందజేశారు. అనంతరం ఈ ఘటన గురించి ఆరా తీశారు. దీంతో బాధితులు ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు, బంధువులను చూడగానే కన్నీటి పర్యంతమయ్యారు. దేవుడి దయతో బయటపడ్డామన్నారు. పెడనకు చెందిన లక్ష్మీ బిశ్వాస్‌, కుమార్తెలు అంకిత బిశ్వాస్‌, సుస్మిత బిశ్వాస్‌ తమ తండ్రి న్యూటన్‌ బిశ్వాస్‌ను పట్టుకుని కన్నీటి పర్యాంతం అయ్యారు. సెలవుల కోసం అమ్మమ్మ ఇంటికి వెళ్లిన వారు స్కూళ్లు తెరుస్తుండడంతో తిరుగుప్రయాణం అయ్యారు. వారు తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. రైలు ప్రమాద బాధితులను తమ స్వస్థలాలకు చేర్చేందుకు కలెక్టర్‌ ఢిల్లీరావు, పశ్చిమ తహసీల్దార్‌ మాధురికి బాధ్యతలు అప్పగించారు. దీంతో అధికారులు ఆయా కుటుంబాలు స్వస్థలాలకు చేరుకునేందుకు రవాణా సదుపాయాలు కల్పించారు.

141 మంది ఫోన్లు స్విచ్ఛాఫ్

కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో 482 మంది ఏపీకి చెందిన వారు ఉన్నట్టుగా గుర్తించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వీరిలో విశాఖపట్నంలో దిగాల్సినవారు 309 మంది, రాజమండ్రిలో దిగాల్సినవారు 31, ఏలూరులో దిగాల్సినవారు అయిదుగురు, విజయవాడలో దిగాల్సిన వారు 137 మంది ఉన్నారన్నారు. వీరందరి ఫోన్‌ నంబర్లకు ఫోన్లు చేసి వారిని ట్రేస్‌ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ 267 మంది సురక్షితంగా ఉన్నారని తెలిసిందన్నారు. 20 మందికి స్వల్పంగా గాయాలు అయ్యాయని తెలిసిందన్నారు. 82 మంది ప్రయాణాలను రద్దు చేసుకున్నట్టు వెల్లడైందన్నారు. 113 మంది ఫోన్లు ఎత్తకపోవడమో, లేదా స్విచాఫ్‌ అవ్వడంతో …వారి వివరాలు తెలియలేదని, మిగిలిన వారిని ట్రేస్ చేసేందుకు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

అలాగే హౌరా వెళ్తున్న యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఏపీ నుంచి 89 మంది రిజర్వేషన్లు చేసుకున్నారని మంత్రి బొత్స తెలిపారు. విశాఖపట్నంలో 33 మంది, రాజమండ్రిలో 3, ఏలూరు నుంచి ఒక్కరు, విజయవాడ నుంచి 41, బాపట్లలో 8 , నెల్లూరు నుంచి ముగ్గురు ఉన్నారన్నారు. ఇందులో 49 మంది సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఇద్దరికి స్వలంగా గాయాలు అయ్యాయన్నారు. 10 మంది ట్రైన్ ఎక్కలేదన్నారు. 28 మంది ఫోన్లు ఎత్తకపోవడం లేదా స్విచాఫ్‌ అవ్వడంతో వీరి వివరాలను సేకరించడంపై దృష్టిపెట్టామని మంత్రి తెలిపారు.

WhatsApp channel