Nuzvid : నూజివీడు ట్రిపుల్ ఐటీలో సుమారు 800 మంది విద్యార్థులకు అస్వస్థత, కలుషితాంధ్రప్రదేశ్ గా మార్చారని వైసీపీ విమర్శలు
Nuzvid IIIT Students : ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో గత మూడు రోజులుగా సుమారు 800 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, కడుపునొప్పి, వాంతులతో విద్యార్థులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏపీని కలుషితాంధ్రప్రదేశ్ గా మార్చిందని వైసీపీ విమర్శలు చేస్తుంది.
Nuzvid IIIT Students : ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో గత మూడు రోజులుగా సుమారు 800 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఒక్కరోజే 342 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో విద్యార్థులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నా ట్రిపుల్ ఐటీ యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని, తగిన జాగ్రత్తలు తీసుకోవడంలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనలపై కమిటీ వేశామని ట్రిపుల్ ఐటీ యాజమాన్యం చెబుతోంది. విద్యార్థులను స్థానికంగా పలు ఆస్పత్రిలో చేర్చి, చికిత్స అందిస్తున్నారు. ట్రిపుల్ ఐటీ మెస్‌లలో ఆహార నాణ్యత సరిగా లేకపోవడం వల్లే విద్యార్థులు అనారోగ్యం బారినపడుతున్నట్లు తెలుస్తోంది.
పలువురు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. మరికొందరు క్యాంపస్ లోనే వైద్యసాయం పొందుతున్నారు. ఇంజెక్షన్లు, మందులు తీసుకుని వసతి గృహాల్లో ఉంటున్నారు. మరికొంత మంది విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే నూజివీడు ట్రిపుల్ ఐటీ యాజమాన్యం మాత్రం 50 నుంచి 60 విద్యార్థులు మాత్రమే అనారోగ్యం బారిన పడ్డారని చెబుతోంది. ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే అధిక సంఖ్యలో విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు- మంత్రి లోకేశ్
నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటనపై మంత్రి లోకేశ్ స్పందించారు. గత 3 రోజులుగా విద్యార్థులు పెద్దఎత్తున అనారోగ్యానికి గురయ్యారని తెలిసి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణమే స్పందించి విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా మంత్రి లోకేశ్ అధికారులను అదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు. ఇటువంటివి పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
కలుషితాంధ్రప్రదేశ్ గా ఏపీ
ఇటీవల ఏపీలోని పలు పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలపై వైసీపీ విమర్శలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఏపీ కలుషితాంధ్రప్రదేశ్‌గా మారిందని ఆరోపించింది. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిన్న ఒక్కరోజే కలుషిత ఆహారంతో 342 మంది విద్యార్థులకి తీవ్ర అస్వస్థత గురయ్యారని తెలిపింది. కూటమి ప్రభుత్వం ట్రిపుల్ ఐటీ పర్యవేక్షణ గాలికి వదిలేసిందని మండిపడింది. గత 3 రోజుల వ్యవధిలో 800 మంది విద్యార్థులు అస్వస్థతతో ఆసుపత్రిపాలయ్యారని విమర్శించింది. పేద విద్యార్థుల ప్రాణాలు పోతున్నా.. కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శలు చేసింది.
సంబంధిత కథనం