ఏపీ ప్రభుత్వం మరో కొత్త స్కీమ్ - అతి తక్కువ వడ్డీతో రూ. లక్ష వరకు రుణం..! ఇవిగో వివరాలు-ntr vidya sankalpam scheme will be implemented for the children of dwacra womens ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీ ప్రభుత్వం మరో కొత్త స్కీమ్ - అతి తక్కువ వడ్డీతో రూ. లక్ష వరకు రుణం..! ఇవిగో వివరాలు

ఏపీ ప్రభుత్వం మరో కొత్త స్కీమ్ - అతి తక్కువ వడ్డీతో రూ. లక్ష వరకు రుణం..! ఇవిగో వివరాలు

ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కొత్త స్కీమ్ కు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల పిల్లల చదువు భరోసా ఇవ్వనుంది. ఇందుకోసం ‘ఎన్టీఆర్ విద్యా సంకల్పం’ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

డ్వాక్రా మహిళలకు భరోసా - ఏపీ సర్కార్ మరో కొత్త స్కీమ్

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి పిల్లల చదువుకు భరోసానిచ్చేలా కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకానికి రూపకల్పన చేసింది. వారి విద్యా వికాసానికి తోడ్పడేందుకు 4 శాతం వడ్డీకే (35 పైసలు) రుణాలు అందించాలని నిర్ణయించింది.

గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్స్) పరిధిలోని స్త్రీ నిధి బ్యాంకు ద్వారా రూ.10 వేల నుంచి గరిష్ఠంగా రూ. లక్ష వరకు రుణం అందించనున్నారు. ప్రస్తుతం స్తీనిధి ద్వారా డ్వాక్రా సభ్యులకు 11 శాతం వడ్డీతో రుణాలిస్తున్నారు. ఈ కొత్త స్కీమ్ ను ‘ఎన్టీఆర్ విద్యా సంకల్పం’ పేరుతో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రతిపాదనలు సిద్ధం - ముఖ్య వివరాలు

ఈ పథకానికి ఎన్టీఆర్ విద్యా సంకల్పం నామకరణం చేస్తూ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి నివేదించారు. కేజీ నుంచి పీజీ వరకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రాథమికంగా పేర్కొన్న కొన్ని ముఖ్యమైన అంశాలను ఇక్కడ తెలుసుకోండి….

  • ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు, విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు వర్తింప చేయనున్నారు.
  • ముఖ్యమంత్రి చంద్రబాబు ' చేతులమీదుగా త్వరలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చేలా అధికారులు కసరత్తు పూర్తి చేశారు.
  • స్త్రీనిధి నుంచి రుణంగా తీసుకునే మొత్తాన్ని పిల్లల చదువుకే వినియోగించాలి.
  • వారి ఫీజు చెల్లింపులు, పుస్తకాలు,యూనిఫాం, ఇతర వాటి కొనుగోలుకు వెచ్చించవచ్చు.
  • సాంకేతిక విద్యలో అవసరాలకు ఖర్చు చేసేందుకు అవకాశం ఉంటుంది.
  • నివాస ప్రాంతం నుంచి దూరంగా ఉండేపాఠశాలలకు వెళ్లేందుకు సైకిళ్ల కొనుగోలుకు అనుమతిస్తారు. అయితే ఎందుకోసం వినియోగించామో సంబంధిత రసీదును స్త్రీనిధి అధికారులకు అందించాలి.
  • రుణ మొత్తాన్నివాయిదాల రూపంలో చెల్లించాలి. తీసుకున్న మొత్తానికి అనుగుణంగా కనిష్ఠంగా 24 నెలల నుంచి గరిష్ఠంగా 36 నెలల వరకు చెల్లించే వెసులుబాటు కల్పిస్తారు.
  • ఏడాదికిరూ.200 కోట్లు ఖర్చు చేసేలా ప్రణాళిక రూపొందించారు. త్వరలోనే ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.