DSC Free Coaching : డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్, ఉచిత శిక్షణతో పాటు ఫ్రీ స్టడీ మెటీరియల్- ఇలా దరఖాస్తు చేసుకోండి
DSC Free Coaching : డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్... ఉచితంగా శిక్షణ పొందేందుకు ఓ సదవకాశం లభించింది. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 2024-25 విద్యాసంవత్సరానికి పేద అభ్యర్థులకు డీఎస్సీ ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ప్రకటించింది.
DSC Free Coaching : డీఎస్సీ ఉచిత శిక్షణపై ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కీలక ప్రకటన చేసింది. పేద అభ్యర్థులుక ఉచితంగా డీఎస్సీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఎస్టీజీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పోటీ పడే అభ్యర్థులు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది. చిత్తూరు జిల్లా కుప్పంలో డీఎస్సీ ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఉచిత శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు కోచింగ్ తో పాటు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తామని తెలిపారు. ఇంటర్, డిగ్రీ, డీఈడీ, బీఈడీ, టెట్ అర్హత సాధించినవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తెలిపింది.
డీఎస్సీ ఉచిత శిక్షణ దరఖాస్తు విధానం
Step 1 : ముందుగా ఎన్టీఆర్ ట్రస్ట్ అధికారిక వెబ్ సైట్ https://ntrtrust.org/dsc_coaching_form/ లింక్ పై క్లిక్ చేయండి.
Step 2 : అభ్యర్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, అడ్రస్ , ఇతర వివరాలు నమోదు చేయాలి.
Step 3 : ఎస్టీజీ, స్కూల్ అసిస్టెంట్ శిక్షణ ఎంపిక చేసి సబ్మిట్ చేయాలి.
ఉచిత శిక్షణకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు ఎన్టీఆర్ ట్రస్ట్ విడుదల చేస్తుంది.
కర్నూలు జిల్లాలో ఉచిత శిక్షణ
కర్నూలు జిల్లాలో డీఎస్సీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న 100 షెడ్యూల్డు తెగలకు చెందిన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ తెలిపింది. ఉచిత శిక్షణ కోసం అభ్యర్థులు కుల, నివాస ధ్రువీకరణ పత్రాలతో పాటు 10వ తరగతి నుంచి విద్యార్హత సర్టిఫికెట్ల కాపీలు, బయోడేటాతో ఈ నెల 26న బిర్లాగేట్‌లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. డిగ్రీ, ఇంటర్, డీఎడ్ పరీక్షలో పొందిన మార్కులను బట్టి షెడ్యూల్డ్ అభ్యర్థులకు రాత పరీక్ష లేదా మెరిట్ ప్రాతిపదికన ఉచిత శిక్షణకు ఎంపిక చేస్తారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యం అందిస్తారు. ఉచిత శిక్షణపై పూర్తి సమాచారం కోసం సెల్: 94910 30041 నంబర్‌లో సంప్రదించవచ్చు.
డీఎస్సీ నోటిఫికేషన్
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. అందుకే టెట్ స్కోర్ పెంచుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తుంటారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు మరోసారి టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు జులై 2న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 3వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు టెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పేపర్ 1-ఎకు 1,82,609 మంది, సెకెండరీ గ్రేడ్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్-1బి కు 2,662 మంది అప్లై చేసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టులు పేపర్ 2-ఎ లాంగ్వేజెస్‌కు 64,036 మంది, మ్యాథ్స్ అండ్ సైన్స్‌కు 1,04,788 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఏపీ టెట్-2024 పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించనున్నారు. టెట్ పరీక్షలకు సెప్టెంబర్ 22 తర్వాత హాల్ టికెట్లు విడుదల చేయనున్నారు. టెట్ పరీక్షలను రెండు సెషన్లలో 18 రోజుల పాటు నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.
పరీక్ష ముగిసిన తర్వాత రోజు అంటే అక్టోబర్ 4 నుంచి వరుసగా ప్రైమరీ కీ లు విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అలాగే అక్టోబర్ 5 నుంచి అభ్యర్థులు టెట్ కీలపై అభ్యంతరాల తెలపవచ్చు. అక్టోబర్ 27న టెట్ ఫైనల్ కీ విడుదల చేస్తారు. నవంబర్ 2న తుది ఫలితాల విడుదల ఉంటుంది. టెట్ పరీక్షలో ఓసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ 40 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం