AP Fee Reimbursement: ఇక కాలేజీ ఖాతాలకే నేరుగా ఫీ రియింబర్స్‌‌మెంట్‌.. మాట నిలబెట్టుకున్న లోకేష్‌-now fee reimbursement will be made directly to college accounts government has made facial attendance mandatory ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Fee Reimbursement: ఇక కాలేజీ ఖాతాలకే నేరుగా ఫీ రియింబర్స్‌‌మెంట్‌.. మాట నిలబెట్టుకున్న లోకేష్‌

AP Fee Reimbursement: ఇక కాలేజీ ఖాతాలకే నేరుగా ఫీ రియింబర్స్‌‌మెంట్‌.. మాట నిలబెట్టుకున్న లోకేష్‌

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 21, 2024 10:10 AM IST

AP Fee Reimbursement: ఏపీలో ఉన్నత విద్యను అందిస్తున్న కాలేజీల కష్టాలు తీరనున్నాయి. ఐదేళ్లుగా విద్యార్థుల ఫీజు రియింబర్స్‌మెంట్‌లో ఎదురవుతున్న ఇక్కట్లకు ప్రభుత్వం ముగింపు పలికింది. ఇకపై కాలేజీ ఖాతాలకే నేరుగా విద్యార్ధుల ఫీజు రియింబర్స్‌మెంట్‌ జమ కానుంది. ఫేషియల్ అటెండెన్స్ తప్పనిసరి చేశారు.

కాలేజీ ఖాతాలకు ఫీజు రియంబర్స్‌మెంట్‌ చెల్లింపులు
కాలేజీ ఖాతాలకు ఫీజు రియంబర్స్‌మెంట్‌ చెల్లింపులు

AP Fee Reimbursement: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల కష్టాలు తీరనున్నాయి. గత ఐదేళ్లుగా ఫీజు రియింబర్స్‌మెంట్ విధానంలో వైసీపీ అవలంబించిన విధానాలతో కాలేజీలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యాయి. ఫీజు రియింబర్స్‌మెంట్‌లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో కాలేజీలకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ చేసే విధానానికి వైసీపీ స్వస్తి పలికింది.

జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో గతంలో ఉన్న పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌ షిప్‌‌ రియింబర్స్‌మెంట్‌ పథకాలకు పేరు మార్చి నిబంధనలను మార్చేశారు. గతంలో కన్వీనర్‌ కోటాలో చదువుకునే విద్యార్ధులకు ఫీజులను ప్రభుత్వమే నేరుగా కాలేజీలకు చెల్లించేది.

పీజీ కోర్సుల్లో ఫీరియింబర్స్‌మెంట్‌ను కేవలం యూనివర్శిటీ క్యాంపస్‌ కాలేజీలకు పరిమితం చేసిన వైసీపీ ప్రభుత్వం ప్రైవేట్‌, ఎయిడెడ్‌ కాలేజీల్లో పీజీ కోర్సులు చదివే విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసింది. జీవో నంబర్ 77 పేరుతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కేవలం యూనివర్శిటీ క్యాంపస్ కాలేజీల్లో చదువుకుంటేనే ఫీజు రియింబర్స్‌మెంట్‌ వర్తిస్తుందని నిబంధనలు మార్చారు. దీంతో పెద్ద ఎత్తున అడ్మిషన్లు తగ్గిపోయాయి.

ఇక ఇంజనీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్ని చదువుకునే విద్యార్థుకుల కూడా ఫీజు రియింబర్స్‌మెంట్‌ కాలేజీలకు కాకుండా విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ చేయడం ప్రారంభించారు. దీంతో సకాలంలో కాలేజీలకు ఫీజులు చెల్లించకపోవడంతో వాటి నిర్వహణ కష్టమైంది. 2019 మే నాటికి దాదాపు రూ.3500కోట్ల బకాయిలు ఉండిపోయాయి. 2024 మార్చిలో జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల చేసినా అవి విద్యార్థుల ఖాతాలకు చేరలేదు. దీంతో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడానికి యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. 1,2, 3 ఇయర్ చదువుతున్న విద్యార్థులను పరీక్షలకు అనుమతించడానికి కాలేజీలు నిరాకరించడంతో ఎవరికి వారు ఫీజులు చెల్లించాల్సి వచ్చింది.

మాట నిలబెట్టుకున్న లోకేష్…

2023లో అడ్మిషన్లు పొందిన విద్యార్ధులకు కేవలం ఒక టర్మ్ మాత్రమే ప్రభుత్వం ఫీజు చెల్లించింది. మొత్తం ఫీజులో నాలుగో వంతు మాత్రమే కాలేజీలకు జమ చేయడంతో విద్యార్థులు మిగిలిన ఫీజు మొత్తం చెల్లించి ఫైనల్ పరీక్షలకు హాజరు కావాల్సి వచ్చింది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల కష్టాలపై హిందుస్తాన్ టైమ్స్‌ పలు మార్లు కథనాలు ప్రచురించింది. దీనిపై పెద్ద ఎత్తున విద్యార్థుల నుంచి విజ్ఞప్తులు రావడంతో మంత్రి నారా లోకేష్ స్పందించారు. కాలేజీల ఫీజు బకాయిల్ని దశల వారీగా చెల్లిస్తామని, విద్యార్థుల బకాయిలు ప్రభుత్వం విడుదల చేస్తుందని హామీ ఇచ్చారు.

2024-25 విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ కింద చెల్లించాల్సిన ఫీజులను నేరుగా కాలేజీల ఖాతాలకు జమ చేసేలా ఉత్తర్వులు జారీ చేవార. సాంఘిక సంక్షేమ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఇచ్చే పీజులు కాలేజీల ఖాతాల్లో జమ చేస్తారు. ఇకపై విద్యార్థుల హాజరు ఆధారంగా ఫీజులు విడుదల అవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.

ఎస్సీ విద్యార్థులకు చెల్లించే ఫీజులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చెల్లిస్తున్నాయి. విద్యార్థుల ఖాతాలకు ఫీజులను జమ చేయనున్నారు. మరోవైపు ఫీజు రియింబర్స్‌మెంట్‌ దుర్వినియోగం కాకుండా విద్యార్ధులకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ తప్పనిసరి చేశారు. ఎస్సీ విద్యార్థు లకు సంబంధించి చెల్లింపుల్లో కేంద్రం వాటా 60 శాతం ఉన్నందున. ఆ మొత్తానికి రాష్ట్రవాటా మిగతా 40 శాతం కలిపి విద్యార్థుల ఖాతాల్లోకే జమ చేయనున్నారు. విద్యార్థులకు అటెండెన్స్ విషయంలో ముఖ ఆధారిత గుర్తింపును కాలేజీలు తప్పనిసరిగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Whats_app_banner