Paramedical Diploma: ప్రైవేట్ కాలేజీల్లో పారా డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్ విడుదల, ఆగస్టు 6 వరకు గడువు
Paramedical Diploma: ప్రైవేట్ కాలేజీల్లో పారా డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తులు దాఖలుకు చివరి తేదీ ఆగస్టు 6గా ప్రకటించారు.
Paramedical Diploma: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీ, హెల్త్‌కేర్ ఇన్స్టిట్యూషన్స్‌ల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు (ఏపీపీఎంబీ) విడుదల చేసింది. మెడికల్ కాలేజీలు కూడా తమ కాలేజీల్లో సీట్ల ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేశాయి.
రెండేళ్ల కాల వ్యవధి పారా మెడికల్ (అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్) డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు దాఖలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 6 నిర్ణయించారు. ఆగస్టు 19న కౌన్సిలింగ్, అభ్యర్థులను కాలేజీలకు కేటాయింపు చేస్తారు. సెప్టెంబర్ 18న తరగతులు ప్రారంభం అవుతాయి.
కాలేజీలు...సీట్లు
ప్రభుత్వ కోటా కింద 60 శాతం సీట్లు ఉంటాయి. మేనేజ్‌మెంట్ కోటా కింద 40 శాతం సీట్లు ఉంటాయి. రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీలు, హెల్త్‌కేర్ ఇన్స్టిట్యూషన్లు 16 పారామెడికల్ డిప్లొమా కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. అనంతపురంలో 18 కాలేజీల్లో 724 సీట్లు, చిత్తూరులో 19 కాలేజీల్లో 2,730 సీట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 26 కాలేజీల్లో 1,594 సీట్లు, గుంటూరు జిల్లాలో18 కాలేజీల్లో 1,960 సీట్లు, కడప జిల్లాలో 22 కాలేజీల్లో 1,060 సీట్లు, కర్నూలు జిల్లాలో 13 కాలేజీల్లో 976 సీట్లు, కృష్ణా జిల్లాలో 24 కాలేజీల్లో 3,139 సీట్లు, నెల్లూరు జిల్లాలో 14 కాలేజీల్లో 1,211 సీట్లు, ప్రకాశం జిల్లాలో 33 కాలేజీల్లో 2,553 సీట్లు, శ్రీకాకుళం జిల్లాలో 18 కాలేజీల్లో 1,216 సీట్లు, విశాఖపట్నం జిల్లాలో 13 కాలేజీల్లో 1,065 సీట్లు, విజయనగరం జిల్లాలో ఎనిమిది కాలేజీల్లో 372 సీట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 23 కాలేజీల్లో 1,589 సీట్లు ఉన్నాయి.
అర్హతలు...
దరఖాస్తు దాఖలు చేయడానికి బైపీసీతో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. ఒకవేళ బైపీసీ చేయకపోతే, ఎంపీసీ ఉత్తీర్ణత సాధించిన పారామెడికల్ డిప్లొమా కోర్సులకు అర్హులు. ఎటువంటి ప్రవేశపరీక్ష లేదు. కేవలం మెరిట్ ప్రాతిపదికనే సీట్లు కేటాయిస్తారు.
రిజర్వేషన్లు
ఎస్‌సీ-15 శాతం, ఎస్‌టీ 6 శాతం, బీసీ 29 శాతం సీట్లు కేటాయిస్తారు. దివ్యాంగు, ఎన్‌సీసీ, మాజీ సైనికోద్యుగుల, స్పోర్ట్స్ కోటా కింద సీట్లు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికన కేటాయిస్తారు.
ఫీజులు
అడ్మిషన్ సందర్భంలో అప్లికేషన్ ఫీజు రూ.200 చెల్లించాలి. అప్లికేషన్ ఫీజును బ్యాంక్ అకౌంట్ నెంబర్ 014211010000021కి, ఏపి స్టేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ సెక్రటరీ, విజయవాడ పేరు మీద క్యాస్ డిపాజిట్ చేయాలి. ప్రభుత్వ కోటా 60 శాతం సీట్లు పొందిన అభ్యర్థులు ట్యూషన్ ఫీజు ఏడాదికి రూ. 14,500 చెల్లించాల్సి ఉంటుంది. అదే మేనేజ్‌మెంట్ కోటా 40 శాతం సీట్లు పొందిన అభ్యర్థులు ట్యూషన్ ఫీజు ఏడాదికి రూ.45,000 చెల్లించాల్సి ఉంటుంది.
అప్లికేషన్‌కు జత చేయాల్సిన ధ్రువీకరణ పత్రాలు
అప్లికేషన్ ఫారమ్‌ను అధికార వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. దాన్ని పూర్తి చేసి ఆగస్టు 6 తేదీ సాయంత్రం 5 గంటల లోపు చేసుకుని పంపాలి. అప్లికేషన్‌కు ఎస్ఎస్‌సీ మార్కుల జాబితా, ఆధార్ కార్డు, ఇంటర్మీడియట్ మార్కుల జాబితా, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్లు, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ కుల ధ్రువీకరణ పత్రంతో పాటు ప్రొసెసింగ్ ఫీజు రూ.100 జత చేసి పంపాలి.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)