Kurnool Meeting : జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలులో భారీ బహిరంగ సభ…-non political jac meeting in kurnool to support judicial capital ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Non Political Jac Meeting In Kurnool To Support Judicial Capital

Kurnool Meeting : జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలులో భారీ బహిరంగ సభ…

HT Telugu Desk HT Telugu
Nov 29, 2022 10:53 AM IST

Kurnool Meeting రాజధాని వికేంద్రీకరణ వ్యవహారంలో సుప్రీం కోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. నాన్‌ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభకు లక్షలాదిమందిని సమీకరించాలని నిర్ణయించారు.

వైసీసీ సహకారంతో కర్నూలులో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు
వైసీసీ సహకారంతో కర్నూలులో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు

Kurnool Meeting ఆంధ్రప్రదేశ్‌ రాజధాని వికేంద్రీకరణ వ్యవహారంపై సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో కర్నూలులో భారీ బహిరంగ సభను నిర్వమించాలని నాన్‌ పొలిటికల్ జేఏసీ భావిస్తోంది. దాదాపు లక్షమందితో పబ్లిక్ మీటింగ్ నిర్వహించాలని జేఏసీ భావిస్తోంది. రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా ఇప్పటికే రాయలసీమలో పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయడంతో పాటు హైకోర్టును తరలించాలనే డిమాండ్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని నాన్‌ పొలిటికల్ జేఏసీ బావిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

మూడు రాజధానులకు మద్దతుగా రాయలసీమలో పలు ప్రాంతాల్లో ఆందోళన కార్యక్రమాలు, నిరసన ప్రదర్శనలు ఇప్పటికే నిర్వహించారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడు రాజధానులకు అనుకూలంగా ప్రజల్లో మద్దతు కూడగట్టేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించారు. నవంబర్‌లోనే కర్నూలులో నాన్‌ పొలిటికల్‌ జేఏసీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని భావించారు.

కొద్ది రోజుల క్రితం ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటించారు. దాదాపు 9 అసెంబ్లీ నియోజక వర్గాల్లో చంద్రబాబు పర్యటన జరిగింది. కర్నూలులో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన భారీ బహిరంగ సభ వాయిదా పడింది.

నవంబర్‌లో జరగాల్సిన బహిరంగ సభ వాయిదా పడటంతో దానిని డిసెంబర్‌ మొదటి వారంలో నిర్వహించాలని భావిస్తున్నారు. నాన్‌ పొలిటికల్ జేఏసీ తలపెట్టిన బహిరంగ సభకు వైఎస్సార్సీపీ మద్దతు పలుకుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలకు కర్నూలులో బహిరంగ సభ నిర్వహించే బాధ్యతలు అప్పగించారు. నాన్‌ పొలిటికల్ జేఏసీ పేరిట సభను నిర్వహించినా అది వైసీపీ కనుసన్నల్లో నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు.

కర్నూలు సభ నిర్వహణపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఇప్పటికే కర్నూలు మంత్రులు, ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. కర్నూలు సభను విజయవంతం చేసే బాధ్యతను పార్టీ నేతలకు అప్పగించారు. సభను వియవంతం చేయడం ద్వారా మూడు రాజధానులపై ప్రజల మద్దతును బలంగా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు సుప్రీం కోర్టులో ఊరట లభించడంతో ప్రభుత్వం నిర్ణయాలను ప్రజలకు వివరించేందుకు బహిరంగ సభను వాడుకోవాలని యోచిస్తోంది.

IPL_Entry_Point