ఏపీలో జూన్ 1 నుంచి ఇంటింటి రేషన్ పంపిణీ నిలిచిపోనుంది. వైసీపీ ప్రభుత్వ హయంలో మొబైల్ డెలివరీ యూనిట్‌లతో గ్రామాలు, వార్డుల్లో రేషన్ దుకాణాల వారీగా రేషన్ పంపిణీ చేసే విధానానికి స్వస్తి పలికారు. ఇటీవల క్యాబినెట్‌లో ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర వేశారు.
రేషన్ డోర్ డెలివరీ పేరుతో రేషన్ దుకాణాల పరిధిలోని కూడళ్లలో రేషన్ పంపిణీ జరిగేది. ప్రతి రేషన్ దుకాణం పరిధిలో నిర్దేశియ పాయింట్‌లో రేషన్ బళ్ల ద్వారా ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేసేవారు. గతంలో రేషన్ దుకాణాల్లో కార్డుదారులే వెళ్లి సరుకులు తెచ్చుకునే వారు.
వాహనాలతో రేషన్ పంపిణీతో బియ్యం పక్క దారి పడుతోందనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం వాటిని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరును వైసీపీ తప్పు పడుతోంది.
జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల్లోనే నిత్యావసర సరుకుల పంపిణీ జరుగనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నాదెండ్ల సూచించారు. 65 సంవత్సరాలు పైబడిన లబ్దిదారులకు, అంగవైకల్యం కల్గిన లబ్దిదారులకు ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తారని మంత్రి ప్రకటించారు.
రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసే ప్రక్రియలో ప్రజలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి ప్రకటించారు.
రేషన్ పంపిణీపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత సున్నితమైనందున, లబ్దిదారులకు అసౌకర్యం కలగకుండా నిత్యావసర సరుకుల పంపిణీ నిర్వహించాలని నిర్ణయించారు.
రేషన్ కార్డుల జారీలో ప్రస్తుతం సాంకేతిక సమస్యలు ఉన్న నేపథ్యంలో దరఖాస్తులు గడువు పెంచే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. కొత్తగా రేషన్ కార్డుల్లో పేర్లు చేర్చుకోవాలంటే పెళ్లి కార్డు తప్పనిసరి కాదు అని స్పష్టంగా తెలిపారు. ఆన్‌లైన్ పెళ్ళి ధృవీకరణ పత్రాన్ని తొలగించాలని ఆదేశించారు.
కొన్నిచోట్ల అధికారులు పెళ్లి కార్డు లేకపోతే దరఖాస్తులను తిరస్కరిస్తుండటంపై వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన మంత్రి ప్రజలకు అసౌకర్యం కలగకుండా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు.
భార్యా-భర్తల మధ్య విడాకులు తీసుకున్న వారికి సంబంధించి కూడా మంత్రి స్పష్టత ఇచ్చారు. విడిపోయిన దంపతులు ఏడేళ్లకు పైగా వేర్వేరుగా ఉంటే, వారు సింగిల్ మెంబర్ రేషన్ కార్డులకు అర్హులవుతారని ప్రకటించారు. రేషన్, ఇతర ప్రభుత్వ పథకాల్లో మద్దతు పొందడంలో వీరికి సౌలభ్యం కలుగుతుందని చెప్పారు.
ప్రస్తుతం రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను గుర్తించినట్టు మంత్రి తెలిపారు. వాటిని త్వరితగతిన పరిష్కరించే చర్యలు చేపట్టినట్టు వివరించారు. అవసరమైతే దరఖాస్తుల గడువును పొడిగించే అవకాశముంది అని పేర్కొన్నారు. అర్హులైన లబ్దిదారులకు రేషన్ కార్డులు అందించేందుకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.
సంబంధిత కథనం