CBN Consultants: జగన్‌ బాటలోనే చంద్రబాబు, కన్సల్టెంట్ల మోజులో ఏపీ సర్కారు, పార్టీలోనే భిన్నాభిప్రాయాలు-no change in consultant policy current government follows predecessors footsteps ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn Consultants: జగన్‌ బాటలోనే చంద్రబాబు, కన్సల్టెంట్ల మోజులో ఏపీ సర్కారు, పార్టీలోనే భిన్నాభిప్రాయాలు

CBN Consultants: జగన్‌ బాటలోనే చంద్రబాబు, కన్సల్టెంట్ల మోజులో ఏపీ సర్కారు, పార్టీలోనే భిన్నాభిప్రాయాలు

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 31, 2024 06:00 AM IST

CBN Consultants: ఏపీలో రాజకీయ పార్టీల్లోనే కాదు ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా కన్సల్టెంట్ల మోజును వీడటం లేదు. పార్టీని గెలిపించిన కన్సల్టెంట్లను ప్రభుత్వ కార్యకలాపాల్లోకి కూడా చొప్పించడానికి ప్రభుత్వాలు సంకోచించడం లేదు. సాంకేతికత మోజుతో ఏపీలో అవసరానికి మించి కన్సల్టెన్సీల జోరు సాగుతోంది.

ఏపీ ప్రభుత్వంలో కన్సల్టెంట్ల సేవల్ని వినియోగించుకోవాలని సర్కారు నిర్ణయం
ఏపీ ప్రభుత్వంలో కన్సల్టెంట్ల సేవల్ని వినియోగించుకోవాలని సర్కారు నిర్ణయం

Chandrababu Consultants: ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎన్నికలకు ముందు పార్టీల గెలుపు కోసం పని చేసిన కన్సల్టెంట్లు ప్రభుత్వంలోకి కూడా ప్రవేశించడం రివాజుగా మారింది. జగన్ హయంలో ఐపాక్‌ మాదిరే టీడీపీ కూటమి జట్టు విజయం సాధించడంలో కీలకంగా పనిచేసిన సంస్థలు ప్రభుత్వ కార్యకలాపాల్లోకి రాబోతున్నాయి. ఇందుకు అనుగుణంగా వేగంగా అడుగులు పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

yearly horoscope entry point

ఏపీ రాజకీయాల్లో పార్టీల గెలుపొటములు గత పదేళ్లుగా పొలిటికల్ కన్సల్టెన్సీల కేంద్రంగానే సాగుతున్నాయి. 2019లో జగన్‌ భారీ విజయం సాధించడం వెనుక ఐపాక్‌ కీలకంగా పనిచేస్తే ఈసారి టీడీపీ కూటమి విజయం వెనుక షో టైమ్‌ స్ట్రాటజీ పని చేసింది. హడావుడి లేకుండా తమ పని తాము చేసుకుంటూ పోయిన షో టైమ్‌ టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించింది.

కొన్నేళ్ల క్రితం టీడీపీకి వ్యూహ రచన చేసే విషయంలో సునీల్ కనుగోలు బృందానికి, షో టైమ్‌ బృందానికి మధ్య పోటీ ఏర్పడిందనే వార్తలు కూడా వచ్చాయి. కర్ణాటక ఎన్నికలకు ముందే టీడీపీ తరపున ఎవరు పనిచేయాలనే విషయంలో ప్రధాన కన్సల్టెన్సీల మధ్య పోటీ ఏర్పడటంతో చివరకు సునీల్ కనుగోలు ఏపీ వ్యవహారాల నుంచి తప్పుకున్నారనే ప్రచారం జరిగింది.

ప్రభుత్వ వ్యతిరేకతపైనే దృష్టి…

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో షో టైమ్‌ సక్సెస్ సాధించడం వెనుక ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారం చేయడంపైనే ప్రధానంగా ఫోకస్ చేసింది. అధికార పార్టీ ప్రచారం మొత్తం ముఖ్యమంత్రి కేంద్రంగానే సాగితే టీడీపీ తరపున ప్రభుత్వ వైఫల్యాలకు విస్తృతంగా ప్రచారం కల్పించారు. గత ఐదేళ్లలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, సమస్యలపైనే టీడీపీ ప్రచారం కేంద్రీకరించింది. అదే సమయంలో ఐపాక్‌ నిర్వహించిన ప్రచారాలు మొత్తం జగన్‌ చుట్టూ కేంద్రీకృతం కావడం తమకు కలిసొచ్చిందని షో టైమ్ భావిస్తోంది. ఎన్నికల ఫలితాలు సైతం తమ అంచనాలకు తగ్గట్టుగానే వచ్చాయి.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ కేవలం 23సీట్లకు పరిమితం అయ్యింది. 175 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీకి 23 సీట్లు మాత్రమే లభించాయి. సరిగ్గా ఐదేళ్లలో ఆ పార్టీ 135 సీట్లను కైవసం చేసుకుంది. చంద్రబాబు తరపున పొలిటికల్ స్ట్రాటజీ బృందానికి రాబిన్ శర్మ నేతృత్వం వహించారు. గతంలో ప్రశాంత్ కిషోర్‌ బృందంలో ఒకరైన రాబిన్‌ టీడీపీకి నాలుగేళ్లకు పైగా పనిచేస్తున్నారు. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి రాబిన్ టీమ్‌ సేవల్ని అందించింది. ఎన్నికల్లో గెలుపుకు కారణమైన బృందంలో ప్రభుత్వ బాధ్యతల్లో కూడా వాడుకోవాలని టీడీపీ భావిస్తోంది.

ఎన్నికలకు ముందు పార్టీలకు, గెలిచాక ప్రభుత్వాలకు…

వైసీపీ పనిచేసిన ఐపాక్‌ సంస్థ కూడా ఒకప్పుడు ప్రశాంత్‌ కిషోర్‌ సారథ్యంలో ఏర్పాటైనదే. ప్రస్తుతం దానికి సారథ్యం వహిస్తున్న రిషిరాజ్‌, రాబిన్ శర్మలు ఒకప్పుడు పీకే టీమ్‌లో కలిసి పనిచేశారు. ఒకప్పటి సహచరులైన రాబిన్‌, రిషిరాజ్ మధ్య ఐదేళ్లుగా హోరాహోరీ యుద్ధం సాగింది. బయటకు కనిపించకపోయినా తాము పనిచేస్తున్న పార్టీల గెలుపు కోసం తీవ్ర స్థాయిలో యుద్ధమే జరిగింది.

రాబిన్ శర్మ నేతృత్వంలోని షోటైమ్ కన్సల్టింగ్ (STC ) చంద్రబాబు నాయుడికి మార్గ నిర్దేశం చేయగా, రిషి రాజ్‌ నేతృత్వంలోని ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC) వైఎస్సార్సీపీ కోసం పని చేసింది.

ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత విజయవాడలో ఐపాక్‌ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సందర్శించారు. మరోసారి తాము అధికారంలోకి వస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు సహజంగానే టీడీపీ శ్రేణుల్లో కొంత అలజడి సృష్టించాయి. అప్పుడు కూడా టీడీపీ, షోటైమ్‌ మౌనంగానే ఉండిపోయాయి.

2019 కంటే ఎక్కువ ఆధిక్యతతో వైఎస్సార్సీపీ గెలుస్తుందని జగన్‌ ప్రకటించినా టీడీపీ శిబిరం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. 2019లో వైఎస్సార్సీపీ 151 అసెంబ్లీ స్థానాలతో పాటు 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. కౌంటింగ్ రోజు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందని జగన్ చెప్పారు. నిజంగా అలాంటి ఫలితాలే ఏపీలో వెలువడ్డాయి.

ఎవరీ రిషిరాజ్‌, రాబిన్ శర్మ?

ఐపాక్‌కు సారథ్యం వహిస్తున్న రిషిరాజ్‌, షో టైమ్ కన్సల్టింగ్‌ రాబిన్ శర్మలు మొదట సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ (CAG)లో కలిసి పనిచేశారు. ఈ సంస్థ 2014 లోక్‌సభ ఎన్నికలలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీని అధికారంలోకి తీసుకు రావడంలో సహాయపడింది.

2014 ఎన్నికలకు ముందే ప్రశాంత్‌ కిషోర్ మరికొందరు కలిసి CAG సంస్థను స్థాపించారు. 2015లో రాబిన్ శర్మ, రిషిలు ఇద్దరూ ప్రశాంత్‌ కిషోర్‌తో కలిసి I-PAC వ్యవస్థాపక సభ్యులుగా మారారు.

నితీష్ కుమార్ 2015లో నిర్వహించిన సైకిల్ ప్రచారానికి రాబిన్ బృందం పని చేసింది. ఆ తరువాత రాబిన్ తన సొంత పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ షోటైమ్ కన్సల్టింగ్ (STC)ని ప్రారంభించాడు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ సొంతంగానే వ్యూహ రచన చేసుకునేది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో TDP ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు తమ పార్టీ కోసం రాబిన్ శర్మ సంస్థను నియమించుకున్నారు.

ఇక ప్రభుత్వంలో కన్సల్టెన్సీ సేవలు..

ఏపీలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి ఫీడ్ బ్యాక్‌ కోసం కన్సల్టెన్సీ సేవల్ని వినియోగించుకోనున్నట్టు ప్రచారం జరుగుతోంది. భరతేంద్ర వర్మ నేతృత్వంలో ఈ కన్సల్టెన్సీకి సారథ్యం వహిస్తున్నట్టు ఏపీ సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాబిన్‌ బృందం ఇతర రాష్ట్రాల్లో బిజీగా ఉండటంతో కొత్తవారిని తెరపైకి తెచ్చారని చెబుతున్నా ఏం జరిగిందనే దానిలో స్పష్టత రావాల్సి ఉంది.

మరోవైపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కన్సల్టెంట్లు ప్రవేశిస్తే అనవసరమైన పెత్తనం పెరుగుతుందనే భావన టీడీపీ నేతల్లో ఉంది. వైసీపీ ఓటమికి పరోక్షంగా కన్సల్టెన్సీలే కారణం అయ్యాయని, తప్పుడు అంచనాలు, వాస్తవ పరిస్థితులను నివేదించకపోవడం, తప్పుడు నివేదికలు, అంచనాలతో ముఖ్యనేతల్ని మభ్య పెట్టి ఓటమి కారణమయ్యారనే వాదనలు కూడా ఉన్నాయి. వైసీపీ బాటలోనే టీడీపీ కూడా కన్సల్టెన్సీల మీద ఆధారపడితే అదే పరిస్థితి వస్తుందని టీడీపీ నేతలు గొణుక్కుంటున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం