విజయనగరం ఉగ్ర కదలికలపై ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభం.. ఐసిస్‌ లింకుల్ని గుర్తించిన పోలీసులు-nia investigation into vijayanagaram terrorist movements ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  విజయనగరం ఉగ్ర కదలికలపై ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభం.. ఐసిస్‌ లింకుల్ని గుర్తించిన పోలీసులు

విజయనగరం ఉగ్ర కదలికలపై ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభం.. ఐసిస్‌ లింకుల్ని గుర్తించిన పోలీసులు

Sarath Chandra.B HT Telugu

బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన్న విజయనగరం యువకుడి వ్యవహారంపై ఎన్‌ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. తెలంగాణ, ఏపీ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఇద్దరు యువకుల్ని విజయనగరం పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. తాజాగా ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఐఏ ప్రారంభించింది.

బాంబు పేలుళ్లకు కుట్రలపై విజయనగరంలో దర్యాప్తు ప్రారంభించిన ఎన్‌ఐఏ (HT_PRINT)

తెలుగు రాష్ట్రాల్లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారనే అభియోగాలతో పోలీసులు అరెస్ట్‌ చేసిన యువకుల వ్యవహారంపై ఎన్‌ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. గ్రూప్‌ 2 కోచింగ్‌ కోసం హైదరాబాద్ వెళ్లి ఉగ్రవాదం వైపు మళ్లిన సిరాజ్‌ అనే యువకుడితో పాటు హైదరాబాద్‌కు చెందిన సమీర్‌లను విజయనగరం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్‌ ఫోన్ల నుంచి కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. తాజాగా విజయనగరం చేరుకున్న ఎన్‌ఐఏ దర్యాప్తు బృందాలు నిందితులను ప్రశ్నిస్తున్నాయి. నిందితుల నుంచి మరింత సమాచారం సేకరించేందుకు వారిని కస్టడీలోకి తీసుకునేందుకు న్యాయస్థానం అనుమతి కోరారు.

పోలీస్‌ ఉద్యోగం కోసం ప్రయత్నించి ఉగ్రవాదం వైపు మళ్లిన విజయనగరం యువకుడి విషయంలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పేలుడు పదార్ధాలను సేకరించి బాంబు పేలుళ్లకు కుట్ర పన్నాడనే అభియోగాలతో అరెస్టైన ఇద్దరు యువకుల కార్యకలాపాలపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

పేలుళ్లకు కుట్ర పన్నిన విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సమీర్‌లపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం, పేలుడు పదార్ధాల చట్టం, బీఎన్ఎస్‌లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఉగ్రవాదంపై ఆకర్షితుడై…

ఏడేళ్ల క్రితం ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన సిరాజ్‌ కొన్నాళ్లు ప్రైవేట్‌ ఉద్యోగం చేశాడు. తర్వాత తండ్రి, సోదరుడి బాటలో పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. ఆ తర్వాత గ్రూప్‌ 2 శిక్షణ కోసం హైదరాబాద్‌ చేరుకున్నాడు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ఉగ్రవాద ప్రచారాలకు ప్రభావితం అయ్యాడు.

హైదరాబాద్ వెళ్లిన సిరాజ్‌ వివిధ సోషల్‌ మీడియా యాప్‌లలో ఉగ్రవాద ప్రచారాలకు ప్రభావితం అయ్యాడు. ఈ క్రమంలో ఇదే భావజాలంతో ఉన్న కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన మరో నలుగురు పరిచయమయ్యారు. తమ వర్గానికి అన్యాయం జరుగుతోందని దీనికి బదులు తీర్చుకోవాలని భావించేవారు.

ఈ క్రమంలో ఇదే తరహా భావాలు ఉన్న వారితో జట్టు కట్టారు. ఇందుకోసం హైదరాబాద్, ముంబయి, దిల్లీ పట్టణాల్లో జరిగిన సమావేశాలకు వెళ్లారు. ఈ కార్యకలాపాల కోసం సిగ్నల్ యాప్‌లో ఒక గ్రూపును సిరాజ్ ఏర్పాటు చేసుకున్నారు.

ఈ గ్రూప్‌లోని సభ్యులు అంతా సిగ్నల్‌ యాప్‌ ద్వారా మాట్లాడుకుంటూ దాడులకు వ్యూహరచన చేశారు. ఈ గ్రూప్‌లో ఉన్న ఇతర సభ్యులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎన్‌ఐఏ దర్యాప్తు ప్రారంభం…

సిగ్నల్‌ యాప్‌లో జట్టు కట్టిన వారికి మధ్య లింకు ఎలా కుదిరిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు బాంబు పేలుళ్ల కుట్ర సమాచారంతో ఎన్‌ఐఏ దర్యాప్తు బృందం విజయనగరం చేరుకుని టూటౌన్‌ పోలీసుల నుంచి సమాచారం సేకరించారు. ఏఎస్పీ, డిఎస్పీల నుంచి సమాచారం సేకరించారు. ఎన్‌ఐఏ అధికారులు రిమాండ్‌ రిపోర్ట్‌ పరిశీలించి నిందితులను కస్టీకి తీసుకోడానికి మంగళవారం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

మరోవైపు నిందితులకు ఆర్ధిక సాయం ఎక్కడి నుంచి వచ్చిందో నిర్ధారించుకునేందుకు నిందితుల బ్యాంకు ఖాతాలను తనిఖీ చేశారు. ఈ కేసును ఎన్ఐ ఏకు బదిలీ చేయనున్నారు.

కుటుంబానికి తలవంపులు…

సిరాజ్‌ నిర్వాకంతో కుటుంబం తలవంపుల పాలైంది. సిరాజ్ తండ్రి ఏఎస్సైగా, మరో కొడుకు కానిస్టేబుల్‌గా ఉన్నారు. సిరాజ్‌ను కూడా పోలీస్‌ ఉద్యోగంలోకి తీసుకురావాలని తండ్రి కలలు కన్నాడు. 2018-22 మధ్య హైదరాబాద్‌ శిక్షణ తీసుకున్నాడు. పోలీస్ పరీక్షల్లో ఎంపిక కాలేకపోయాడు. తర్వాత గ్రూప్‌ 2 శిక్షణ పొందాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తాడని కుమారుడి మీద డబ్బులు ఖర్చు చేసిన కుటుంబం ఉగ్రవాదులతో సంబంధాలు పెట్టుకోవడంతో షాక్‌కు గురయ్యారు.

ఇంజనీరింగ్ పూర్తయ్యాక సిరాజ్‌ కొత్తవలసలోని కంపెనీలో కొన్నాళ్లు పనిచేశాడు. హైదరాబాద్‌ వెళ్లిన తర్వాత బోయగూడకు చెందిన సమీర్‌, వరంగల్‌ జిల్లాకు చెందిన ఫర్హాన్ మొయినుద్దీన్, యూపీకి చెందిన వారితో స్నేహం ఏర్పడింది. వీరంతా కలిసి అల్‌‌ హింద్‌ ఇత్తేహదుల్ ముస్లమీన్ సంస్థను ఏర్పాటు చేసి పేలుళ్లకు ప్రణాళికలు రచించినట్టు అనుమానిస్తున్నారు.

సిరాజ్‌ 2024 నవంబరు 22న ముంబై వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అక్కడ 10 మందిని సిరాజ్ కలిసినట్టు నిఘా వర్గాలు గుర్తించారు. గత జనవరి 26న ఢిల్లీలో పలువురిని కలిసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో వారు అందుబాటులో లేక పోవడంతో విజయనగరం తిరిగి వచ్చేశాడు. సమీర్‌ సిగ్నల్‌ యాప్‌లో మాట్లాడిన వారిని పోలీసులు గుర్తిస్తున్నారు.

సౌదీలో ఉంటున్న బీహార్‌కు చెందిన అబు ముసాబ్ తో సంభాషించినట్టు గుర్తించారు. అబు ముసాబ్‌ ఐసిస్‌ కోసం పనిచేస్తున్నట్టు అనుమానిస్తున్నారు. అతను ఇచ్చిన సమాచారంతోనే తక్కువ ఖర్చుతో రసాయన పదార్థాలు ఉపయోగించి బాంబులు తయారు చేశాడు.

జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో వీటిని పేల్చేందుకు ప్రణాళిక రచించారు. ఈ క్రమంలో పేలుడు పదార్ధాలను సేకరిస్తున్నట్లు గుర్తించిన నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి. నిందితుల నుంచి ట్యాబ్, అల్యూమినియం పౌడర్‌, పొటా షియం నైట్రేట్, సల్ఫర్ పొడిలను స్వాధీనం చేసుకున్నారు.

ఎన్‌ఐఏ విచారణకు సిరాజ్‌ తండ్రి సోదరుడు..

సిరాజ్ వ్యవహారంపై ఏఎస్సైగా పనిచేస్తున్న తండ్రితో పాటు ఎస్‌పిఎఫ్‌లో పనిచేస్తున్న సోదరుడికి ఎన్‌ఐఏ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నాయి.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం