ఎన్‌ఐఏ కస్టడీలో సిరాజ్‌, సమీర్… బాంబు పేలుళ్ళ కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం-nia intensifies bomb plot investigation siraj and sameer moved to vizianagaram from vizag jail ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఎన్‌ఐఏ కస్టడీలో సిరాజ్‌, సమీర్… బాంబు పేలుళ్ళ కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం

ఎన్‌ఐఏ కస్టడీలో సిరాజ్‌, సమీర్… బాంబు పేలుళ్ళ కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం

Sarath Chandra.B HT Telugu

బాంబు పేలుళ్ళకు కుట్ర పన్నిన విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్‌, హైదరాబాద్‌కు చెందిన సమీర్‌లను ఎన్‌ఐఏ శుక్రవారం ఉదయం విశాఖలో కస్టడీలోకి తీసుకుంది. విశాఖ నుంచి విజయనగరం తరలించారు. ఈ కేసులో మరింత మందికి ప్రమేయం ఉండొచ్చని ఎన్‌ఐఏ అనుమానిస్తోంది.

ఎన్‌ఐఏ అదుపులో సిరాజ్, సమీర్, 7రోజుల కస్టడీకి అనుమతించిన కోర్టు

విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. బాంబు పేలుళ్ల కోసం సిరాజ్‌, సమీర్‌లు పేలుడు పదార్ధాలను సమీకరించారనే సమాచారంతో గత శనివారం వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రిమాండ్‌లో ఉన్న నిందితుల విశాఖ సెంట్రల్ జైలు నుంచి విజయనగరం తరలించారు.

బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన విజయనగరం యువకుడి వ్యవహారంలో ఎన్‌ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. విశాఖ సెంట్రల్‌ జైలు నుంచి నిందితుల్ని విజయనగరం పోలీస్ ట్రైనింగ్‌ సెంటర్‌కు తరలించి విచారిస్తున్నారు. నిందితులకు ఉగ్రవాదులతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో బాంబు పేలుళ్లకు కుట్రలు పన్నారనే అనుమానంతో అరెస్ట్‌ అయిన నిందితులను ప్రశ్నించేందుకు పోలీస్‌ కస్టడీకి కోర్టు అనుమతించింది. నిందితుల నుంచి పూర్తి సమాచారం సేకరిస్తే బాంబు పేలుళ్ల కుట్రపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

విజయనగరంకు చెందిన సిరాజ్ ఉద్యోగ ప్రయత్నాలు, పోలీస్‌ ట్రైనింగ్‌, గ్రూప్‌ 2 కోచింగ్‌ పేరుతో దాదాపు ఏడేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో అతనికి సోషల్‌ మీడియా వేదికల ద్వారా ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పడినట్టు అనుమానిస్తున్నారు. దేశంలో బాంబు పేలుళ్లు, అలజడి సృష్టించేందుకు నిధులు కూడా అందుకున్నట్టు భావిస్తున్నారు. నిందితుడు బ్యాంకు ఖాతాల్లో రూ.42లక్షల నగదు ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీస్తున్నారు. నిందితుడి తండ్రికి చెందిన బ్యాంక్‌ లాకర్‌ను పోలీసులు ఫ్రీజ్ చేశారు.

గత సోమవారం లాకర్లనుని తెరిచేందుకు ప్రయత్నించినా పోలీసుల ఆంక్షలతో బ్యాంకు అధికారులు అందుకు అనుమతించలేదు. సిరాజ్‌ ఉర్ రెహ్మాన్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సమీర్ ఎన్ఐఏ ప్రశ్నించనుంది. నిందితులు సిరాజ్‌, సమీర్‌లపై ఆర్నెల్లకు పైగా దర్యాప్తు సంస్థలు నిఘా ఉంచాయి. అనుమానాస్పద కదలికల నేపథ్యంలో సిరాజ్‌ను పోలీసులు వెంటాడుతున్నారు.

పేలుడు పదార్ధాలను సమీకరించి వాటితో బాంబులు తయారు చేసినట్టు గుర్తించిన వెంటనే తెలంగాణ ఇంటెలిజెన్స్‌, ఏపీ పోలీసుల్ని కేంద్ర నిఘా సంస్థలు అప్రమత్తం చేశారు. పక్కా సమాచారంతో గత శనివారం వారిని అదుపులోకి తీసుకున్నారు.

సిరాజ్ ఏడేళ్లకు పైగా హైదరాబాద్‌లో ఉండటంతో అతని మాదిరి మరికొందరు కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్‌తో పాటు దేశ, విదేశాల్లో ఉగ్రవాద అనుకూల స్వభావమున్న యువకులతో సంబంధాలు ఉన్నాయని అంచనాకు వచ్చారు. సిరాజ్‌ స్థాపించిన సంస్థలో సభ్యత్వం కలిగి ఉన్న వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

వరంగల్‌కు చెందిన ఫర్హాన్ మొయినుద్దీన్, యూపీకి చెందిన బాదర్‌లతో వీరు సంప్రదింపులు జరిపినట్టు గుర్తించారు. గత ఏడాది నవంబరు 22న అంధేరిలో జరిగిన మత కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారానికి అధాన్ ఖురేషి, దిల్హాన్, మొహిసిన్ షేక్, జసీర్ అలియాస్ అమన్, ఫహాద్, అమిర్ అన్సారీ తదితరులతో కలిసి సిరాజ్‌, సమీర‌ హాజరయ్యారు. ఇందులో దేనిపై చర్చించారో తెలియాల్సి ఉంది.

నవంబరు 23న సిరాజ్ ఎవరిని కలిశారో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒమన్‌, సౌదీల నుంచి నిందితులకు ఆర్థిక సాయం లభిస్తున్నట్టు భావిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సిరాజ్, సమీర్‌లతో పాటు మరి కొందరు ఈ ముఠా సభ్యులు కుట్ర పన్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం