Amaravati ORR : అమరావతి చుట్టూ భూములున్నవారు అదృష్టవంతులే.. ఈ ప్రాజెక్టుతో ధరలకు రెక్కలు!-nhai plan for construction of capital amaravati outer ring road ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Amaravati Orr : అమరావతి చుట్టూ భూములున్నవారు అదృష్టవంతులే.. ఈ ప్రాజెక్టుతో ధరలకు రెక్కలు!

Amaravati ORR : అమరావతి చుట్టూ భూములున్నవారు అదృష్టవంతులే.. ఈ ప్రాజెక్టుతో ధరలకు రెక్కలు!

Amaravati ORR : అమరావతి ప్రాంతంలో భూములున్న వారికి ఇది శుభవార్త. అవును.. అమరావతి చుట్టూ అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందనుంది. ఫలితంగా భూముల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

రింగ్ రోడ్డు ప్రతిపాదిత ప్రాంతం (@APCRUpdates)

అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు.. ఫైనల్ ఎలైన్‌మెంట్‌, డీపీఆర్‌, భూసేకరణపై ఫోకస్ పెట్టారు. ఇదే సంవత్సరంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. 2018 లోనే ఈ ప్రాజెక్టు కోసం అడుగులు పడినా.. 2019లో ప్రభుత్వం మారడంతో.. ఆగిపోయింది.

2024లో చంద్రబాబు సీఎం అయ్యాక.. మళ్లీ ఈ ప్రాజెక్టుకు ఊపిరి పోశారు. కేంద్రం నుంచి అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు ఆమోదం లభించేలా చేశారు. దీంతో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు రంగంలోకి దిగారు. భూసేకరణ కోసం అధికారులను నామినేట్‌ చేయాలని కోరుతూ.. ఇటీవల ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు లేఖలు రాశారు.

ఈ ప్రాజెక్టును రెండు భాగాలుగా విభజించి అభివృద్ధి చేయనున్నారు. తూర్పు భాగం 78 కి.మీ వరకు ఉంటుంది. పశ్చిమ భాగం 111 కి.మీ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్ట్ మొత్తం పొడవు 189 కి.మీ ఉండనుంది. ఆరు లేన్లుగా ఓఆర్ఆర్‌ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో 150 మీటర్ల ఆర్‌వోడబ్ల్యూ, మూడు సొరంగాలు, తొమ్మిది ఇంటర్‌ఛేంజీలు, కృష్ణా నదిపై 2 వంతెనలు ఉండనున్నాయని తెలుస్తోంది. ఇది అన్ని ప్రధాన ఎక్స్‌ప్రెస్‌వేలు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, మచిలీపట్నం ఓడరేవుకు లింక్ కానుంది.

2018 అంచనా ప్రకారం ఈ ప్రాజెక్టుకు రూ. 17,761 కోట్లు, భూసేకరణకు రూ. 4,198 కోట్లు అవసరం అవుతుందని అంచనా వేశారు. కానీ ఇప్పుడు వ్యయం పెరిగే అవకాశం ఉంది. మొత్తం దాదాపు రూ.25వేల కోట్లు ఖర్చు అవుతుందని ఎన్‌హెచ్ఏఐ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ సహా.. మొత్తం ఖర్చు భరించేందుకు కేంద్రం ఓకే చెప్పింది. దీంతో ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యేందుకు అవకాశం ఉంది.

అమరావతి ప్రాంతంలోని 22 మండలాలు, 87 గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ నిర్మాణం కానుందని తెలుస్తోంది. దీంతో ఆయా గ్రామాల్లో భూములకు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. విజయవాడ చుట్టుపక్కల ఉన్న మైలవరం, గన్నవరం, నూజివీడు, గుడివాడ, మంగళగిరి, తాడికొండ, పొన్నూరు, పెడన, మచిలీపట్నం, దెందూలూరు నియోజకవర్గాల్లోని భూముల ధరలు పెరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.