NTR Bharosa Pensions: న్యూ ఇయర్ గిఫ్ట్..ఏపీలో ఒక రోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
NTR Bharosa Pensions: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒకరోజు ముందే పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. జనవరి 1 న్యూఇయర్ కావడంతో డిసెంబర్ 31న పెన్షన్ల పంపిణీకి అనుమతించాలనే ఉద్యోగుల విజ్ఞప్తిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
NTR Bharosa Pensions: ఏపీలో సామాజిక పెన్షన్లు అందుకుంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. నేతన సంవత్సర వేడుకల నేపథ్యంలో జనవరి 1న కాకుండా ముందు రోజే పెన్షన్ల పంపిణీకి అనుమతించాలని కొన్ని రోజులుగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఉద్యోగుల వినతిపై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 31న పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై స్పష్టత ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల ప్రతిపాదన మేరకు డిసెంబర్ 31న పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు అందాయి. రాష్ట్రంలో 63.75 లక్షల మందికి జనవరి నెలలో రూ.2,717.31 కోట్లను డిసెంబర్ 30వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.
ప్రభుత్వ నిర్ణయంతో డిసెంబర్ 31వ తేదీ తెల్లవారుజామునే ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేపడతారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గత జులై నుంచి ఏపీలో పెన్షన్ల పంపిణీ గ్రామ, వార్డుసచివాలయ సిబ్బందితోనే చేపడుతున్నారు.