AP New Liquor Shops : వైన్ షాపులకు ఆలస్యంగా సరుకు.. ఇంకా పూర్తిగా తెరుచుకోని కొత్త మద్యం దుకాణాలు
AP New Liquor Shops : ఏపీలో చాలా రోజుల తర్వాత ప్రైవేట్ మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి. కానీ.. అనుకున్న స్థాయిలో సరకు రాలేదు. దీంతో మందుబాబులు పెదవి విరుస్తున్నారు. అటు చాలాచోట్ల.. పాత ధరలకే పాత బ్రాండ్లు విక్రయిస్తున్నారు. మరికొన్ని చోట్ల అసలు కొత్త వైన్ షాపులు ప్రారంభం కాలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వైన్ షాపులు తెరుచుకున్నాయి. కానీ.. చాలా షాపులకు సరుకు సరిగా రాలేదు. దీంతో లిక్కర్ ప్రియులు పెదవి విరుస్తున్నారు. ఇంకా పాత బ్రాండ్లు, పాత ధరలకే విక్రయిస్తున్నారని అంటున్నారు. అటు కొన్ని చోట్ల ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయాలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక వైన్ షాపుల లైసెన్సులు దక్కించుకున్న వారు ఫస్ట్ రోజు బుధవారం అరకొరగానే ఏర్పాటు చేశారు. ఉదాహరణకు.. ఎన్టీఆర్ జిల్లాలో 113 ప్రైవేట్ మద్యం దుకాణాలకు పర్మిషన్ వచ్చింది. కానీ.. తొలి రోజు కేవలం 25 మాత్రమే తెరుచుకున్నాయి. సరైన ప్రాంతం, షాపు దొరక్కపోవడంతో.. చాలాచోట్ల వైన్ షాపులు ప్రారంభం కాలేదని అధికారులు చెబుతున్నారు.
ఇటు మంగళవారం రాత్రితో ప్రభుత్వ దుకాణాలు మూతపడ్డాయి. బుధవారం చాలా ప్రైవేటు షాపులు తెరుచుకోలేదు. దీంతో తెరిచిన షాపుల వద్దకు మందుబాబులు క్యూ కట్టారు. అయితే.. తెరుచుకున్న దుకాణాలకు కూడా సరిగా సరుకు రాలేదు. మళ్లీ పాతధరలు, పాత బ్రాండ్రే ఉండడంతో.. మందుబాబులు అసహనం వ్యక్తం చేశారు. 'కొండంత రాగం తీసి.. పిట్టంత పాట పాడారు' అని లిక్కర్ ప్రియులు సెటైర్లు వేస్తున్నారు.
మందుబాబులు అసహనం వ్యక్తం చేయడం.. వ్యాపారులకు తలనొప్పిగా మారింది. కొత్త సరుకు ఇంకా రాలేదని.. వైన్ షాపుల నిర్వాహకులు సర్ది చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వ దుకాణాల్లో చాలా స్టాక్ మిగిలిపోయింది. దీంతో మద్యం డిపోలకు ఆ స్టాక్‌ను తరలిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి తరలింపు ప్రారంభించినా.. ఇంకా పూర్తి కాలేదు. కొన్ని చోట్ల ఇంకా స్టాక్ ఉంది.
ప్రభుత్వ దుకాణాల నుంచి వచ్చిన స్టాక్ వివరాలను డిపోల సిబ్బంది నమోదు చేస్తున్నారు. తక్కువ సిబ్బంది ఉండటంతో.. వివరాలు నమోదు చేయడం ఆలస్యం అవుతోంది. అందుకే.. కొత్త వైన్ షాపులకు సరిగా సరకు పంపిణీ చేయలేదని తెలుస్తోంది. అయితే.. ప్రస్తుతం డిపోలకు వచ్చిన పాత బ్రాండ్లను కూడా తీసుకోవాలని అధికారులు సూచించినట్టు వ్యాపారులు చెబుతున్నారు. చేసేదేం లేక.. పాత బ్రాండ్లు కూడా వైన్ షాపులకు తెస్తున్నామని అంటున్నారు.