Congress Josh: తెలంగాణ ఫలితాలతో ఏపీ కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం
Congress Josh: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంతో ఏపీ కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం వచ్చింది. పదేళ్లుగా ఏపీలో ఉనికి కోల్పోయిన పార్టీలో ఆశలు చిగురించాయి. గెలిచే స్థానాలతో సంబంధం లేకుండా ఎన్నికలపై ప్రభావం చూపించాలని యోచిస్తున్నారు.
Congress Josh: తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీలో కూడా ఖచ్చితంగా ఉంటుందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. రాష్ట్ర విభజనతో ఏపీలో ఉనికి కోల్పోయిన పార్టీకి మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో సంబంధం లేకుండా గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని అంచనా వేస్తున్నారు. ఎన్నికల నాటికి ఏపీలో కాంగ్రెస్ గణనీయంగా పుంజుకుంటుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 2 నుంచి 5వేల ఓట్లను కాంగ్రెస్ పార్టీ చీలుస్తుందని కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో ఉంది. కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంకు మొత్తం 2014 తర్వాత వైసీపీ తరలిపోయింది. ఘర్ వాపసీ తరహాలో కాంగ్రెస్ క్యాడర్‌ను సొంత గూటికి తెచ్చుకునే ప్రయత్నాలను ప్రారంభించింది. ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలోని 175 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని పోటీలో దింపేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ వాతావరణంలో ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణకు ఏపీకి మధ్య స్పష్టమైన తేడాలున్నా, రాయలసీమకు, తెలంగాణకు ఓటర్ల సరళిలో ఒకే తరహా ధోరణులు ఉంటాయని కాంగ్రెస్ భావిస్తోంది.
షర్మిల వస్తే ఆహ్వానిస్తాం…
ఏపీ కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల వస్తే... సాదరంగా ఆహ్వానిస్తామని రుద్రరాజు స్పష్టం చేశారు. షర్మిల సేవలను వాడుకోడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. ఏపీలో పార్టీ పునర్‌వైభవం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీల్లో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చేందుకు మొగ్గు చూపిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలో వెళ్లి అక్కడ సరైన ప్రాధాన్యత దక్కని నాయకులను సాదరంగా ఆహ్వానిస్తామని చెప్పారు.
ఉత్తరాంధ్ర నుంచి కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, ఎస్సీ, ఎస్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీలోనే సముచిత స్థానం దక్కుతుందని చెప్పారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయ వ్యవహారాలతో పాటు జాతీయ రాజకీయాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ బుధవారం విజయవాడలో సమావేశమవుతోంది.
ఈ భేటీలో ఏఐసీసీ కార్యదర్శులు మెయ్యప్పన్, క్రిస్టోఫర్ తిలక్‌లతోపాటు పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు ఎన్.రఘువీరారెడ్డి, పల్లంరాజు, కొప్పుల రాజు, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తదితరులు హాజరు కానున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం ప్రభావం ఏపీలో తప్పక ఉంటుందని, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల ప్రజల్లో మార్పు కనిపిస్తోందని రుద్రరాజు చెబుతున్నారు.