CM Jagan : ఆర్థిక వ్యవస్థ పురోగమించడానికి పెట్టుబడులు కీలకం, నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం జగన్
CM Jagan : దేశంలో పెట్టుబడుల ద్వారా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. లాజిస్టిక్స్ కోసం పెడుతున్న ఖర్చు తగ్గించాలని సూచించారు.
CM Jagan : న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. నీతి ఆయోగ్ చర్చించే వివిధ అంశాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించేలా నోట్‌ను ముఖ్యమంత్రి సమర్పించారు. సీఎం జగన్ ఈ సమావేశంలో ప్రసంగిస్తూ.... ఆరోగ్యకరమైన పెట్టుబడుల ద్వారా మౌలిక సదుపాయాలను బలోపేతంచేయాలని కోరారు. తద్వారా ఆర్థికవ్యవస్థ శ్రీఘ్రగతిన పురోగమిస్తుందన్నారు. భారతదేశంలో లాజిస్ట్రిక్స్ ఖర్చు చాలా ఎక్కవుగా ఉందన్న సీఎం జగన్.... లాజిస్టిక్స్ కోసం పెడుతున్న ఖర్చు జీడీపీలో 14 శాతంగా ఉందన్నారు. భారతీయ ఉత్పత్తులు ప్రపంచస్థాయిలో పోటీపడేందుకు ఇది ప్రతిబంధకంగా మారిందన్నారు. అమెరికాలో చూసుకుంటే లాజిస్టిక్స్ ఖర్చు కేవలం 7.5 శాతానికే పరిమితం అయ్యిందన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో సరకు రవాణా కారిడార్లు, జాతీయ రహదారులపై ప్రభుత్వం ప్రశంసనీయరీతిలో వ్యయం చేస్తోందన్నారు. మనం ఆశించిన ఫలితాలను సాధించడానికి దీన్ని కొనసాగించడం చాలా అవసరమన్నారు.

ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధించాలి
ఏపీ ప్రభుత్వం పోర్టు ఆధారిత అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 4 కొత్త పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటవుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులోని ఓర్వకల్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసిందని, విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా PPP పద్ధతిలో నిర్మిస్తోందన్నారు. దేశ జీడీపీలో తయారీ, సేవల రంగం వాటా 85 శాతం దాటినప్పుడే ‘వికసిత్ భారత్’ లక్ష్యం నెరవేరుతుందన్నారు. రెండు రంగాల ప్రపంచ సగటు వాటా 91.5 శాతం అని తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి వ్యవసాయం, పెట్టుబడులు రెండింటికి సంబంధించిన అంశాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆహార రంగంలో స్వయం సమృద్ధిని సాధించడంతోపాటు, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం చాలా అవసరమని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ నెంబర్ వన్
తయారీ, సేవల రంగాల వాటా పెరుగుదలను సాధించడానికి పెట్టుబడులు చాలా అవసరమని, దీనికి అనుకూలమైన వ్యాపార వాతావరణం తప్పనిసరి అని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ గత మూడేళ్లుగా వరుసగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. వ్యాపారస్తులకు అత్యంత అనుకూలంగా అనుమతులు సహా తదితర విధానాలను సరళీకృతం చేశామన్నారు. వాడుకలో లేని చట్టపరమైన నిబంధనలను సవరించామని, రద్దు చేశామన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023కి అద్భుతమైన స్పందన లభించించిందని సీఎం జగన్ తెలిపారు. రూ. 13 లక్షల కోట్లు భారీ పెట్టుబడులకు వివిధ సంస్థలు, కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. దీనివల్ల దాదాపు 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు.
ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్
"రెండున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో 48,639 మంది వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని నియమించాం. విలేజ్ క్లినిక్‌ల నుంచి బోధనాసుపత్రుల వరకు అవసరమైన సంఖ్యలో వైద్యులు, నర్సులు, పారామెడిక్స్ ఉండేలా చూసుకున్నాం. విలేజ్ క్లినిక్ కాన్సెప్ట్‌ను పూర్తి సామర్థ్యంతో అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించింది. ఇందులో PHCల నుంచి వైద్యులు కనీసం నెలకు రెండుసార్లు వారికి నిర్దేశించిన గ్రామాన్ని సందర్శిస్తారు. విలేజ్ వార్డు క్లినిక్స్‌ల సౌకర్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి ముందుగా పేర్కొన్న తేదీల్లో వైద్యులు ఆయా గ్రామాలను సందర్శిస్తారు. జీవనశైలిలో వచ్చిన మార్పులు కారణంగా వచ్చే వ్యాధుల సమస్యలను సమర్థవంతంగా స్క్రీనింగ్ చేయడం, గుర్తించడం, నిర్ధారించడం, ట్రాక్ చేయడం మరియు చికిత్స చేయడం ద్వారా విజయవంతంగా వాటిని నివారించవచ్చని మేం ప్రగాఢంగా నమ్ముతున్నాం." - సీఎం జగన్
రాష్ట్రాలన్నీ ఒక జట్టుగా పనిచేయాలి
నైపుణ్యాభివృద్ధికి అన్నది మరొక కీలక అంశమని సీఎం జగన్ అన్నారు. జర్మనీ వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఈ అంశంలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని గుర్తుచేశారు. తగ్గుతున్న జననాల రేటు కారణంగా, ఆ దేశాలు చివరికి శ్రామికశక్తి కొరతను ఎదుర్కొంటున్నాయన్నారు. పని చేసే వయస్సున్న జనాభా విషయంలో తీవ్రకొరతను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. మన దేశ జనాభాలో అధిక భాగం పనిచేసే వయస్సున్న వారే ఉన్నారని, ఇది దేశానికి అత్యంత ప్రయోజనకరమని తెలిపారు. అన్ని రాష్ట్రాలూ ఒక జట్టుగా పనిచేయాలని సీఎం జగన్ అన్నారు. ప్రతి రాష్ట్రం శ్రేయస్సు మొత్తం దేశంతో ముడిపడి ఉంటుందన్నారు.