ఏపీ - తెలంగాణ : ముహుర్తం ఫిక్స్ - కాబోయే కమల దళపతులు ఎవరు..?-new bjp state presidents will be appointed for ap and telangana ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీ - తెలంగాణ : ముహుర్తం ఫిక్స్ - కాబోయే కమల దళపతులు ఎవరు..?

ఏపీ - తెలంగాణ : ముహుర్తం ఫిక్స్ - కాబోయే కమల దళపతులు ఎవరు..?

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షులు రానున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకత్వం కార్యాచరణను షురూ చేసింది. జూలై 1వ తేదీన పార్టీ నూతన అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది.

బీజేపీ పార్టీ - ఏపీ, తెలంగాణకు కొత్త అధ్యక్షులు...!

తెలుగు రాష్ట్రాలకు కొత్త కమల దళపతులు రానున్నారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే దాదాపు కసరత్తు పూర్తి కావొచ్చింది. అయితే ఆ పార్టీ నియమాల ప్రకారం… నామినేషన్లను స్వీకరించనున్నారు. వాటిని పరిశీలించి… పేర్లను ప్రకటిస్తారు.

నిజానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిపై చాలా రోజులుగా కసరత్తు కొనసాగుతూ వస్తోంది. పలువురు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఎట్టకేలకు జాతీయ నాయకత్వం ముహుర్తం ఫిక్స్ చేసింది. అయితే ఒక్క తెలంగాణనే కాకుండా… ఏపీకి కూడా కొత్త అధ్యక్షుడిని ఖరారు చేయనుంది. ఒకే రోజు అధ్యక్షుల పేర్లను ప్రకటించనుంది.

ఏపీలో నోటిఫికేషన్…..

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. 3 రోజుల్లోనే ప్రక్రియంతా పూర్తి చేయనున్నారు. జూలై 1వ తేదీన పార్టీ కొత్త అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తి కానుంది. జూన్ 30వ తేదీన నామినేషన్లను స్వీకరిస్తారు. అదే రోజు సాయంత్రంలోపు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి ఉన్నారు. ఈమె స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని బీజేపీ భావించింది. పైగా పురందేశ్వరి రాజమండ్రి ఎంపీగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో…ఆమె స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నారు. ఇందుకోసం పలువురు సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలంగాణలో ఇలా…?

ఏపీతో పోల్చితే…తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనేది ఉత్కంఠను రేపుతోంది. రాష్ట్ర అధ్యక్షుడి రేసులో చాలామంది నేతలు ఉన్నారు. ముఖ్యంగా డీకే అరుణ, ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరే కాకుండా.. రఘునందన్ రావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కూడా అధ్యక్ష పగ్గాల కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. గతంలో బండి సంజయ్ పని చేశారు. ఆయన కూడా ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. వీరు కాకుండా… కొత్త వాళ్లకే పార్టీ నాయకత్వ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా జూలై 1వ తేదీన తెలుగు రాష్ట్రాల కొత్త కమల దళపతులు ఎవరనేది తేలిపోనుంది…!

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.