Nellore Rottela Panduga : నెల్లూరు రొట్టెల పండుగ శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. ఐదు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగలో... రొట్టెలు మార్చుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మతసామరస్యానికి, భక్తి విశ్వాసాలకు రొట్టెల పండుగ ప్రతీక. ఐదు రోజుల పాటు జరిగే ఈ పండుగలో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున్న భక్తులు వస్తారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రొట్టెల పండుగలో ఆదివారం రాత్రి గంధ మహోత్సవం నిర్వహిస్తున్నారు. నెల్లూరు బారాషాహిద్ దర్గాలో ఐదు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగకు గతేడాది 30 లక్షల మంది భక్తులు హాజరయ్యారు. ఈ పండుగకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బారాషాహిద్ దర్గాను దర్శించుకుని, స్వర్ణాల చెరవులో రొట్టెలు మార్చుకుంటే కోర్కెలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు.
శనివారం బారాషాహీద్ దర్గాలోని 12 మంది అమరవీరుల సమాధులను ముస్లిం మత పెద్దలు సంప్రదాయబద్ధంగా శుభ్రం చేసి, నూతన వస్త్రాలను ఆ సమాధులపై కప్పి ప్రార్థనలు చేశారు. తొలి రోజున ఏపీ, తెలంగాణ నుంచేగాక తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వర్ణాల చెరువులో స్నానం చేసి కోర్కెల రొట్టెల కోసం భక్తులు పోటీపడ్డారు. కలెక్టర్ హరినారాయణన్ రొట్టెల పండగ ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 2500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం కావాలని కోరుకుని టీడీపీ నేతలు స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకున్నారు. ఈ పండుగలో కీలకమైన గంధ మహోత్సవం ఆదివారం రాత్రి నిర్వహిస్తున్నారు. గంధ మహోత్సవంలో కడప పెద్ద దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుసేనీ పాల్గొంటారు.
నెల్లూరు స్వర్ణాల చెరువులో రొట్టెలు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ. సంతానం కోసం, ఉన్నత చదువులు, గృహం కోసం ఇలా తమ కోర్కెలు నెరవేరాలని స్వర్ణాల చెరువు దగ్గరికి వస్తారు. స్వర్ణాల చెరువులో స్నానం చేసి తమ కోర్కెలు తీర్చమని దేవుళ్లని వేడుకుంటారు. కోర్కెలు తీరిన వారు అందుకు గుర్తుగా రొట్టెలు తెచ్చిపంచుతారు. ఆ రొట్టె అందుకున్న వారు తిరిగి తమ కోర్కెలు నెరవేరాక మళ్లీ రొట్టెలు పంచుతారు. ఈ ఆచారం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. ప్రతి యేటా మొహరం తర్వాత రోజు రొట్టెల పండుగ నిర్వహిస్తారు. ఈ ఏడాది జులై 29 నుంచి ఆగస్టు 3 వరకు ఈ పండుగ జరుగుతుంది. ఇక్కడ ఆరోగ్య రొట్టె, కల్యాణ రొట్టె, విద్యా రొట్టె, గృహ రొట్టె, వ్యాపార రొట్టె, ఉద్యోగ రొట్టె, సంతాన రొట్టె ఇలా అనేక పలు రకాల రొట్టెలు అందుబాటులో ఉంటాయి. భక్తులు తమ కోర్కెలు అనుగుణంగా ఆ రొట్టెలు పంచుకుంటారు. కోర్కె తీరిన వారు వచ్చే ఏడాది రొట్టెల పండుగ నాడు తిరిగి రొట్టెను పంచుతారు.