Minister Kakani Govardhan : ఫోన్ ట్యాపింగ్ కాదు… చంద్రబాబు మ్యాన్ ట్యాపింగ్…-nellore minister kakani govardhan reddy slams nellore rual mla kotam reddy comments on ysrcp ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Nellore Minister Kakani Govardhan Reddy Slams Nellore Rual Mla Kotam Reddy Comments On Ysrcp

Minister Kakani Govardhan : ఫోన్ ట్యాపింగ్ కాదు… చంద్రబాబు మ్యాన్ ట్యాపింగ్…

HT Telugu Desk HT Telugu
Feb 03, 2023 12:16 PM IST

Minister Kakani Govardhan చంద్రబాబు నాయుడు ట్యాపింగ్‌లో చిక్కుకుపోయి కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మ హత్యలే ఉంటాయని కోటంరెడ్డి మరోసారి నిరూపించారని ఎద్దేవా చేశారు. కోటంరెడ్డి వ్యక్తిగత అసంతృప్తితో పార్టీని విడిచిపెడితే ఎవరికి ఇబ్బంది లేదని పార్టీ మీద బురద చల్లే ప్రయత్నాలు సరికాదన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి
ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి

Minister Kakani Govardhan ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నానా యాగీ చేస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పటి వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. కోటంరెడ్డి విషయంలో జరిగింది మ్యాన్ ట్యాపింగ్ అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాజకీయ అవకాశాలు లేని కోటంరెడ్డికి అవకాశం ఇచ్చిన వారిపై విమర్శలు చేయడం తగదన్నారు.

ట్రెండింగ్ వార్తలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అసంతృప్తితో పార్టీని విడిచిపెడితే ఎవరికి అభ్యంతరం లేదని, ఫోన్ ట్యాప్‌ చేశారని ఆరోపణలు చేయడం తగదన్నారు. ట్యాపింగ్ జరగలేదని శ్రీధర్‌ రెడ్డికి తెలిసినా, దానిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, తనను అవమానించారు, అనుమానించారని అనవసర యాగీ చేస్తున్నారన్నారు. కోర్టులో కేసు వేస్తానని, కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని సవాలు చేసిన కోటంరెడ్డి ఆ పని ఎందుకు చేయడం లేదన్నారు.

ఫోన్ ట్యాపింగ్ జరగలేదనే సంగతి శ్రీధర్ రెడ్డి మనస్సాక్షికి కూడా తెలుసన్నారు. శ్రీధర్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ట్యాప్ చేశారని ఆరోపించారు. చంద్రబాబు చెప్పినట్టే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతున్నారని, చంద్ర బాబు చెప్పినట్లే కోటంరెడ్డి మాటలు పట్టుకుని టీడీపీ నాయకులు యాగీ చేస్తున్నారన్నారు.

చంద్రబాబు ఎలాంటి వ్యక్తో అందరికి తెలుసని, చంద్రబాబు గురించి వైసీపీలో ఉండగా కోటంరెడ్డి ఏమి మాట్లాడారో గుర్తు చేసుకోవాలన్నారు. కోటంరెడ్డిపై తాను మీడియాలో ప్రశ్నించగానే ఆడియో క్లిప్‌ ఎందుకు బయటకు వచ్చిందని శ్రీధర్‌ రెడ్డిని ప్రశ్నించారు. టీడీపీ నుంచి పోటీ చేస్తానంటూ కార్యకర్తలతో మాట్లాడిన ఆడియో క్లిప్ రిలీజ్ చేసింది ఎవరని ప్రశ్నించారు. కోటంరెడ్డి చేసిన తప్పులే ఆయన్ని బయటపడేలా చేస్తున్నాయన్నారు.

అంతా సున్నాలమే….

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తనతో సహా ఎమ్మెల్యేలంతా సున్నాలేనని, జగన్ అనే విలువు ఉంటేనే గెలుస్తామని చెప్పారు. పార్టీలో గౌరవం, గుర్తింపు రాజశేఖర్‌ రెడ్డి వల్ల వచ్చిందని, జగన్ పార్టీ పెట్టాక అంతా ఎవరి వల్ల గెలిచారని చెప్పారు. 2014లో తామంతా ఎవరని, 2019 ఎన్నికల్లో ఎవరి వల్ల అధికారంలోకి వచ్చామని కోటంరెడ్డిని ప్రశ్నించారు.

శ్రీధర్ రెడ్డిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నారని ప్రశ్నించారు. కోటంరెడ్డి ఇప్పుడు ఉన్న స్థాయికి కారకులు ఎవరో గుర్తు చేసుకోవాలన్నారు. జగన్‌కు వీరవిధేయుడిని అని చెప్పిన కోటంరెడ్డి ఇప్పుడు వేరే వారికి విధేయుడిగా మారిపోయాడన్నారు.

నెల్లూరు రూరల్‌లో సంపూర్ణ బాధ్యతలు అప్పగించినా నిలబెట్టుకోలేదన్నారు. నెల్లూరు రూరల్‌లో ఇతరులు ఎవరిని వేలు పెట్టే అవకాశం కూడా జగన్ ఇవ్వలేదన్నారు. అంతగా నమ్మి, ప్రేమించిన పార్టీని, .జగన్‌ను శ్రీధర్ రెడ్డి వెన్నుపోటు పొడిచారన్నారు. అతను ఏమి చెబితే ఇన్నాళ్లు అదే నడిచిందని, కోటంరెడ్డి ఇప్పుడు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీకి అస్త్రం అయినందుకు శ్రీధర్‌ రెడ్డి తనను తాను ప్రశ్నించుకోవాలన్నారు.

23మంది వెళితేనే లెక్క చేయలేదు….

ప్రతిపక్షంలో ఉన్నపుడే 23మంది ఎమ్మెల్యేలను తీసుకువెళ్లిపోతే కూడా జగన్ లెక్క చేయలేదని గుర్తు చేశారు. ఒకరో ఇద్దరో పార్టీని వీడి వెళ్లిపోతే జగన్ బెదిరిపోరన్నారు. ఎమ్మెల్యే వెళ్లిపోతానని చెప్పడం వల్లే ఆదాలను ఇన్‌ఛార్జిగా నియమించినట్లు చెప్పారు.

రాజకీయాల్లో హత్యలుండవని, ఆత్మహత్యలే ఉంటాయని శ్రీధర్ రెడ్డి మరోసారి నిరూపించాడని కాకాణి ఎద్దేవా చేశారు. శ్రీధర్ రెడ్డి మాట్లాడిన మాటలు చంద్రబాబు చెప్పినవేనని ఆరోపించారు. కూలీ జనాల్ని వెంటేసుకుని రోడ్ల మీదకు వస్తే గెలిచినట్లు కాదన్నారు. నెల్లూరు రూరల్ నియోజక వర్గంలో జరిగిన అక్రమాలపై కూడా విచారణ జరిపించాలన్నారు.

సజ్జల గురించి ఆరోపణలు చేయడం తగదన్న కాకాణి, పార్టీలో లోపాల గురించి ప్రశ్నిస్తే ఆ‍యనపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు. ఎక్కడి నుంచో బయటకు వచ్చిన ఆడియో క్లిప్‌ను సజ్జలకు ముడిపెట్టడం తగదన్నారు. శ్రీధర్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అతనికే యమపాశం అవుతుందన్నారు. పార్టీని అంటిపెట్టుకున్న వారి సేవల్ని పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని చెప్పారు.

శ్రీధర్‌ రెడ్డిని అరెస్ట్ చేసి, ఎన్‌కౌంటర్ చేయాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. ప్రభాకర్ రెడ్డికి పూర్తిగా సహకరించడానికి వైఎస్సార్సీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. 2024 ఎన్నికల్లో కూడా నెల్లూరు రూరల్ స్థానం వైసీపీకే దక్కుతుందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ మీద కోర్టుకు వెళ్లడమో, కేంద్రానికి ఫిర్యాదు చేయడమో చేయాలన్నారు. శ్రీధర్ రెడ్డి వాస్తవాలు గ్రహించకపోతే నష్టపోయేది అతనే అన్నారు.

IPL_Entry_Point

టాపిక్