Nellore Ammonia Gas Leak : నెల్లూరు జిల్లాలో అమోనియా లీక్ ఘటన కలకలం రేపింది. జిల్లాలోని టీపీగూడూరు మండలం అనంతపురం గ్రామంలో అమోనియా గ్యాస్ లీకై 10 కార్మికులు అస్వస్థతకు గురైయ్యారు. వాటర్ బేస్ కంపెనీలో అమోనియా గ్యాస్ లీకైంది. దీంతో కార్మికులు పరుగులు తీశారు. ఈ ఘటనలో 10 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. చుట్టుపక్కల గ్రామాలకు సైతం అమోనియా గ్యాస్ వ్యాపించిందని, స్థానికులు భయాందోళన చెందుతున్నారు. స్థానికులు ముందు జాగ్రత్తగా మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉండి తలుపులు, కిటికీలు వేసుకున్నారు. ప్రస్తుతం గ్యాస్ లీకేజీని అడ్డుకున్నట్లుతెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఇటీవల అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజ్ కలకలం రేపింది. మలికిపురం మండలం కేశనపల్లిలోని ఓఎన్జీసీ గ్రూప్ గ్యాస్ గ్యాదరింగ్ స్టేషన్‌లో గ్యాస్ లీకైంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ స్టేషన్‌లో ప్రమాదవశాత్తూ గ్యాస్ లీక్ కావడంతో.. కార్మికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. కొంతమంది గ్యాస్ లీకేజీని అరికట్టే ప్రయత్నం చేశారు. అయితే గ్యాస్ గాఢంగా రావడంతో 9 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను హుటాహుటిన స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. గ్యాస్ వ్యాపించటంతో స్థానికులు, చుట్టుప్రక్కల ప్రజలు భయాందోళన చెందారు. గ్యాస్ లీకేజీపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. గోదావరి జిల్లాలలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ ఉండడంతో...తరచూ లీకేజీ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
సంబంధిత కథనం