Nellore Gold Coins : తేనె కోసం వెళ్తే బంగారు నాణేలు దొరికాయ్, వాటాల్లో తేడాతో వెలుగులోకి!-nellore chittepalli youth found gold coins pot dividing tissue matter reached to police ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nellore Gold Coins : తేనె కోసం వెళ్తే బంగారు నాణేలు దొరికాయ్, వాటాల్లో తేడాతో వెలుగులోకి!

Nellore Gold Coins : తేనె కోసం వెళ్తే బంగారు నాణేలు దొరికాయ్, వాటాల్లో తేడాతో వెలుగులోకి!

Nellore Gold Coins : నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామంలో కొండపైకి తేనె కోసం వెళ్లిన యువకులకు బంగారు నాణేల చెంబు దొరికింది. వాటాల్లో తేడాతో విషయం పోలీసుల వద్దకు చేరింది.

బంగారు నాణేలు (Unsplash)

Nellore Gold Coins : తేనె కోసం గ్రామ శివారులోని కొండపైకి వెళ్లిన యువకులకు బంగారు నాణేలు ఉన్న చెంబు దొరికింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. పొదలకురు మండలం చిట్టెపల్లికి చెందిన యువకులు తేనె కోసం గ్రామ శివారులోని కొండపై ఉన్న పురాతన ఆలయం వద్దకు వెళ్లారు. అక్కడ వారికి బంగారు నాణేల చెంబు దొరికింది. చిట్టెపల్లికి చెందిన అజిత్, వరుణ్, వెంకటేశ్వర్లు తేనె కోసం పురాతన అంకమ్మ ఆలయం వద్దకు వెళ్లారు. అక్కడున్న రాళ్ల కింద వారికి ఓ ఇత్తడి చెంబు కనిపించింది. యువకులు రాళ్లను తొలగించి చెంబును బయటకు తీశారు. ఆ చెంబును పగులకొట్టిన యువకులకు అందులో బంగారు నాణేలు కనిపించాయి.

వాటాల్లో తేడాతో

బంగారు నాణేలు చూసిన యువకులు గ్రామంలోని మరో వ్యక్తి వద్దకు వెళ్లి చెంబును పూర్తిగా పగులగొట్టించారు. దీంతో చెంబును లోపలికి తీసుకువెళ్లిన వ్యక్తి కాసేపటి తర్వాత వచ్చి చెంబులో ఏంలేదని చెప్పి, చెంబు బయట పడేయాలని చెప్పాడు. అయితే అప్పటికే చెంబులో నాణేలను ఫొటో తీసిన యువకులు జిల్లా ఎస్పీని కలిసి అసలు విషయం తెలిపాడు. ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు గ్రామానికి వచ్చి వంద గ్రాముల బంగారు నాణేలను రికవరీ చేశారు. అయితే చెంబులో దొరికిన నాణేలు మూడు కేజీలకు పైగా ఉంటాయని, వీటి విలువ కోట్లతో ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. అంకమ్మ ఆలయం వద్ద దొరికిన బంగారు నాణేలపై ఉర్దూ పదాలు ఉన్నాయని తెలుస్తోంది. యువకులకు బంగారు నాణేలతో చెంబు దొరకగా వాటాల్లో తేడాతో విషయం వెలుగుచూసిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో బంగారు చెంబు ఘటన వైరల్ అవుతోంది.