Nellore Crime : రీల్స్ నేర్పిస్తానని బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి, పోక్సో కేసు నమోదు
Nellore Crime : నెల్లూరు జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. రీల్స్ చేయడం నేర్పిస్తానని బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు లైంగిక దాడి చేశాడు. బాలిక ప్రవర్తనలో మార్పుతో తల్లి ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసింది. రీల్స్ పేరుతో బాలికకు మాయమాటలు చెప్పి ఓ ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే ఆలస్యంగా బయటపడ్డ ఈ ఘటనలో నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
నెల్లూరు టౌన్‌లోని ఒక కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని ఒక కాలనీకి చెందిన మహ్మద్ ఆలీ (41) ఏళ్ల ఆటో డ్రైవర్ 13 ఏళ్ల మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. మొబైల్ ఇచ్చి రీల్స్ చేయమని ప్రోత్సహిస్తున్నట్లు దగ్గరై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు మంగళవారం వెలుగులోకి వచ్చింది.
నెల్లూరు టౌన్‌లోని ఒక కాలనీలో ఓ గిరిజన కుటుంబం నివాసం ఉంటుంది. ఆ కుటుంబంలో తల్లి కూలీ పనులు చేసుకుంటూ తన ముగ్గురు కుమార్తెలతో కలిసి జీవిస్తుంది. పేదవారు కావడంతో పిల్లలను పాఠశాలకు కూడా పంపించడం లేదు. ఈ క్రమంలో అదే బ్లాక్ లో ఒంటరిగా నివసిస్తున్న మహమ్మద్ అలీ అనే ఆటో డ్రైవర్ కన్ను ఈ గిరిజన పిల్లలపై పడింది. దీంతో వారిలో పెద్ద అమ్మాయి అయిన 13 ఏళ్ల బాలికను ఎలాగైన లొంగదీసుకోవాలనుకున్నాడు.
13 ఏళ్ల వయసున్న ఆ గిరిజన బాలికను రీల్స్ చేయిస్తానని మాయ మాటలు చెప్పాడు. అలా తన రూముకి తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ప్రవర్తనలో మార్పు రావడంతో తల్లితో పాటు బంధువులు గట్టిగా నిలదీయగా బాలిక జరిగిన విషయం తల్లికి వివరించింది. తల్లితోపాటు బంధువుల వెంటనే నెల్లూరు టూ టౌన్ నవాబుపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు. దీనిపై విచారణ చేసిన నవాబుపేట సీఐ అన్వర్ భాషా నిందితుడి మహ్మద్ ఆలీపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఆ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆ బాలికను ఆసుప్రతికి తరలించారు.
విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన- టీచర్ అరెస్టు
తూర్పుగోదావరి జిల్లాలో ఐ.పోలవరం మండలంలోని ఓ ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల పట్ల మ్యాథ్స్ ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో హాస్టల్ వార్డెన్ ఐ.పోలవరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం ఎస్ఐ మల్లికార్జున రెడ్డి పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ మేరకు ఎస్ఐ మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ విద్యార్థినులతో ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు అందిందని, అందువల్ల ఆ ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు.
అలాగే ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తనపై వార్డెన్ విద్యా శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఇదే ఆరోపణలపై ఉపాధ్యాయుడు రెండు సార్లు సస్పెండ్ అయ్యారు. బుధవారం జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈవో) షేక్ సలీం బాషా పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేష్ కుమార్, విద్యార్థినుల నుంచి డిప్యూటీ డీఈవో సూర్య ప్రకాశ్ రావుతో కలిసి డీఈవో షేక్ సలీం బాషా వివరాలు సేకరించారు. నివేదికను ఉన్నతాధికారులకు ఇస్తామని, తరుపరి చర్యలు తీసుకుంటారని తెలిపారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం