Vijayawada : ఉద్యోగం పేరుతో బాలికపై లైంగిక వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు.. తమ పరిధి కాదంటూ తాత్సారం
Vijayawada : ఉద్యోగం పేరుతో బాలికపై లైంగిక, శారీరక వేధింపులకు దిగారు. దీనిపై పోలీసులకు బాలిక ఫిర్యాదు చేసింది. కానీ.. తమ పరిధి కాదంటూ పోలీసులు కేసు నమోదు చేసేందుకు తాత్సారం చేశారు. పోలీసులపై తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దాదాపు నాలుగు నెలల పాటు కష్టాలు భరించిన బాలిక.. ఇక ఉద్యోగం చేయలేనంటూ తల్లికి చెప్పింది. దీంతో ఈ ఘటన బయటపడింది. బాధితురాలి తల్లి వివరాలు ప్రకారం.. విజయవాడలోని వాంబేకాలనీకి చెందిన బాలిక (16) ఇంటర్మీడియట్ చదువు మధ్యలోనే మానేసింది. స్థానిక బీఆర్‌టీఎస్ రోడ్డులో ఒక హోం కేర్ సర్వీస్‌లో 2024 జూన్ నెలలో రూ.25 వేల జీతంతో ఉద్యోగంలో జాయిన్ అయింది. ట్రైనింగ్ ఇచ్చి, ఎలా చేయాలో నేర్చుకున్న తరువాత డ్యూటీ చేయడానికి తిరుపతి పంపించారు.
తిరుపతిలో వేధింపులు..
తిరుపతిలో ఉన్న కుమార్తెతో మాట్లాడేందుకు ప్రయత్నించినా.. అక్కడి వారు మాట్లాడించేవారు కాదని బాలిక తల్లి చెప్పింది. విజయవాడలో సెప్టెంబర్ నెలలో వరదలు వచ్చినప్పుడు తమ కుమార్తెను ఇంటికి పంపించమని అడిగితే.. నెలన్నర తరువాత పంపించారని తెలిపింది. ఇంటికి వచ్చిన కుమార్తె.. తాను ఉద్యోగానికి వెళ్లనంటూ తల్లితో చెప్పింది. ఎందుకు వెళ్లవని తల్లి ఆరా తీసింది. దీంతో తనపై జరిగిన లైంగిక, శారీక వేధింపులు తల్లికి చెప్పింది. తిరుపతిలో ఎండీగా ఉన్న వ్యక్తి తనను శారీరకంగా వేధించేవాడని బాలిక చెప్పింది. గ్లాసులో మద్యం కలిపి ఇవ్వమని, కాళ్లు నొక్కమని వేధించేవాడని కన్నీటి పర్యంతమైనట్లు ఆమె తల్లి తెలిపింది.
పోలీసులు పట్టించుకోలేదు..
వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశామని బాలిక తల్లి వివరించింది. అక్కడి పోలీసులు సూర్యారావుపేట ఠాణాలో ఫిర్యాదు చేయమని చెప్పారని తెలిపింది. తాము సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశామని, అయినా సరైన న్యాయం జరగదలేదని బాలిక తల్లి వాపోయింది. బీఆర్‌టీఎస్ రోడ్డులో ఉన్న సంస్థను మూసివేస్తుండగా.. పోలీసులకు ఫిర్యాదు చేసినా వచ్చి చూశారే తప్ప ఏం చేయలేదని తల్లి వాపోయారు.
ఆ సంస్థను నిర్వహించే వ్యక్తి విజయవాడంలోని సత్యనారాయణపురంలో ఉండగా పోలీసులకు సమాచారం అందించామని, అప్పుడు కూడా పోలీసులు స్పందించలేదని అన్నారు. సూర్యారావుపేట పోలీసులు తమ పరిధి కాదంటూ అక్కడి నుంచి వెళ్లి పోయారని తెలిపారు.
వీడియో కలకలం
ఎన్ని రోజులు గడిచినా తమకు న్యాయం జరగలేదని బాధితులు కన్నీటి పర్యంతం అయ్యారు. తిరుపతిలోని సంస్థలో కొంత మంది యువతులతో నిర్వాహకులు కాళ్లు నొక్కించుకుంటుండగా బాలిక రహస్యంగా వీడియో తీసిందని తెలిపారు. అభ్యంతరకర పరిస్థితుల్లో యువతులతో హోం కేర్ నిర్వాకులు కాళ్లు నొక్కించుకుంటూ వీడియో కనిపించడం కలకలం సృష్టిస్తోంది.
పోలీసుల తీరుపై విమర్శలు..
బాధితులు ఫిర్యాదు చేసినా, వీడియో కలకలం సృష్టిస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తమ కుమార్తెను వేధించి ఇబ్బంది పెట్టిన విజయవాడ, తిరుపతిలోని హోం కేర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని తల్లి డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన సూర్యారావుపేట సీఐ అహ్మద్ అలీ.. తమ దృష్టికి ఎటువంటి ఫిర్యాదు రాలేదని, దాని గురించి ఆరా తీస్తామని చెప్పారు. ఫిర్యాదు వస్తే సంబంధిత వ్యక్తులపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)