Godavarru Sarpanch : సర్పంచ్ అంటే ఇలా ఉండాలి.. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మన ఆడబిడ్డ
Godavarru Sarpanch : పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు. అలాంటి పల్లెల అభివృద్ధి బాధ్యత ప్రథమ పౌరులు సర్పంచులపై ఉంటుంది. అయితే నిధుల లేమి, నిర్లక్ష్యం కారణంగా.. చాలామంది పనులు చేయలేకపోతున్నారు. కానీ.. గొడవర్రు గ్రామ సర్పంచి మాత్రం అందరికంటే భిన్నం. పట్టుదలతో తన గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నారు.
ఆమె చదివింది ఇంటర్. కానీ గ్రామ సర్పంచిగా ఎన్నికయ్యారు. భార్యగా, తల్లిగా సమర్థవంతంగా ఇంట్లో బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె.. ప్రజలకు సేవ చేసే పదవిలోనూ తన ప్రత్యేకత చాటుకున్నారు. అధికారం అప్పగించిన గ్రామస్థుల ఆశల్ని నిజం చేస్తూ.. పంచాయతీని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ స్థాయిలో ప్రత్యేక ప్రతిభాశీలి పురస్కారం అందుకున్నారు. ఆ మహిళ ఎవరో కాదు.. మన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రు సర్పంచ్ జానకీదేవి. ఆమె సారథ్యంలో గొడవర్రు పంచాయతీ ఊహించని విధంగా అభివృద్ధి అయ్యింది.

జాతీయ స్థాయిలో గుర్తింపు..
గ్రామాభివృద్ధి పట్ల జానకీదేవి అంకితభావం, చేసిన కృషి ఫలితంగా జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సహా ఎందరో వీఐపీలు హాజరైన గణతంత్ర వేడుకలకు వెళ్లే అవకాశం వచ్చింది. అంతేనా.. కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చేతుల మీదుగా ప్రత్యేక ప్రతిభాశీలి పురస్కారం అందుకున్నారు. గొడవర్రు ఊర్లో ఉపాధి హామీ పథకం, స్వచ్ఛభారత్, జల్ జీవన్ మిషన్ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించినందుకు ఈ అవార్డును ఇచ్చారు.
జానకీదేవి ఏం చేశారు..
గొడవర్రులో మొత్తం 3 వేల 400 మంది జనాభా ఉన్నారు. అప్పటికే గ్రామంలో మూడు పాఠశాలలు ఉన్నాయి. వాటికి అదనపు గదులు నిర్మించారు. గ్రామం అంతటా సీసీ రోడ్లు వేయించారు. నిధుల కొరత వేధిస్తున్నా.. దాతల సహకారంతో రూ.3 లక్షల విలువైన వీధి లైట్లను ఏర్పాటు చేయించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామంలోని దాదాపు 100 ఇళ్లకు మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయించారు. ఉపాధి హామీ పథకం పనులను దగ్గరుండి చేయించారు. తొలిసారి సర్పంచి అయినా.. తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ.. జానకీదేవి అందరి మన్ననలు పొందుతున్నారు.
ఆదర్శ గ్రామంగా చేస్తా..
జానకీదేవి పాలనపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామం అంతా రోడ్లు, వీధి లైట్లు, తాగునీరు ఏర్పాటు చేయించారని చెబుతున్నారు. గ్రామానికి బస్సు సౌకర్యం లేదని.. దీని కోసం ప్రయత్నించాలని కోరుతున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు రావడంపై జానకీదేవి ఆనందం వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులు, గ్రామస్థుల సహకారంతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందానని చెబుతున్నారు. తమ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని.. దాన్ని కూడా నిర్మించి గొడవర్రును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని జానకీ దేవి చెబుతున్నారు.