CPI Narayana: మద్యం దుకాణంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ధరలపై ఆరా, మద్యం ఆదాయంపై ఎద్దేవా…
CPI Narayana: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విజయవాడ దుర్గాపురంలోని ఓ మద్యం దుకాణానికి వెళ్లి మద్యం ధరల గురించి ఆరా తీశారు. రూ.99 మద్యం కావాలని అడగడం అవి ఇంకా రాలేదని దుకాణదారుడు చెప్పడంతో, మద్యం ధరల గురించి ప్రశ్నించారు. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటాన్ని తప్పు పట్టారు.
CPI Narayana: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విజయవాడలో కొత్తగా ప్రారంభించిన ప్రైవేట్ మద్యం దుకాణంలో చౌక మద్యం గురించి ఆరా తీశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో బుధవారం నుంచి మద్యం విక్రయాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో విజయవాడ దుర్గాపురం సాంబమూర్తి రోడ్డులో ఉన్న మద్యం దుకాణానికి నారాయణ వెళ్లి మద్యం ధరల గురించి వాకబు చేశారు.
దుకాణదారుడు ప్రారంభ ధరతో ఉన్న మద్యం క్వార్టర్ సీసా ఇవ్వడంతో దాని ధర ఎంత అని అడిగారు. దుకాణదారుడిచ్చిన సమాధానంతో 99రుపాయలకు మద్యం విక్రయిస్తామన్నారని ప్రశ్నించారు. ఆ మద్యం ఇంకా తమకు రాలేదని చెప్పడంతో తనకు ఇచ్చిన మద్యం ధర ఎంత అని ప్రశ్నించారు. గతంలో ఆ బ్రాండ్ల మద్యం విక్రయించేవారు కాదని నారాయణతో ఉన్న వారు వివరించారు.
ఈ క్రమంలో మద్యం అమ్మకాలు, ధరలను పరిశీలించిన నారాయణ మద్యాన్ని ఆదాయ వనరుగా కూటమి ప్రభుత్వం సంబరపడిపోతోందని ఇది ప్రజలకు శ్రేయ స్కరం కాదని హితవుపలికారు.
ప్రభుత్వం సరసమైన ధరలు, నాణ్యమైన సారా అంటోందని రెండు ఎలా సాధ్యమన్నారు. సారా మంచిది కానప్పుడు అందులో నాణ్యత ఏమిటని ప్రశ్నించారు. మద్యం విక్రయా లపై సెస్ విధించడాన్ని కూడా నారాయణ తప్పు పట్టారు. ప్రభుత్వమే ప్రజలను బాగా తాగించి దానిపై పన్నలు వేసి ఆ వచ్చే డబ్బులతో రిహాబిలిటేషన్ చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవాచేశారు.
మద్యం దుకాణంలో బ్రాండ్లు, రేట్లు అడిగి తెలు సుకున్నారు. క్వార్టర్ మద్యం బాటిల్ ధర రూ.180 అని చెప్పడంతో ప్రభుత్వం రూ.99కే ఇస్తానందని ఆ మద్యం కావాలని నారాయణ దుకాణం నిర్వాహకుడిని అడిగారు. మద్యం ధరలు పాతవే ఉన్నాయని అక్కడ ఉన్న వారు చెప్పారు. దుకాణాల్లో విక్రయించే బ్రాండ్లు మారాయంటూ దుకాణదారుడు సమాదానం చెప్పారు. సీపీఐ రాష్ట్ర నాయకులు నారాయణ వెంట ఉన్నారు.
ఇంకా తెరుచుకోని దుకాణాలు..
ఏపీలో కొత్తగా అమల్లోకి వచ్చిన ప్రైవేట్ మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్న మద్యం ధరల్లో పెద్దగా మార్పు రాలేదు. చౌక మద్యం వచ్చే సోమవారం నుంచి అందుబాటులోకి వస్తుందని ఎక్సైజ్ శాఖ చెబుతోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాల కేటాయింపులు పూర్తైనా రాజకీయ ఒత్తిళ్లతో దుకాణాలు ప్రారంభం కాలేదు.
చాలా చోట్ల స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు వేలంలో దుకాణాలు దక్కిన వారిని నయానో భయానో షాపులు వదులుకునేలా ఒత్తిడి చేస్తున్నారు. దుకాణాలు తమకు అప్పగించి తప్పుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో దుకాణాలు దక్కించుకున్న తెలంగాణ వాసులు తమ దుకాణాలను స్థానిక నాయకులకు అప్పగించేసినట్టు ప్రచారం జరుగుతోంది.
విజయవాడ నగరంలో మద్యం వ్యాపారం మొత్తాన్ని ఓ ప్రజాప్రతినిధి గుప్పెట్లో పెట్టుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. విజయవాడలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు లిక్కర్ సిండికేట్లకు దూరంగా ఉండగా ఒకరు మాత్రమే అన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలపై నియంత్రణ కోసం ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. సదరు ప్రజా ప్రతినిధి తీరుపై ఇప్పటికే ముఖ్యమంత్రికి పలువురు టీడీపీ నాయకులు పిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.