Nara lokesh Yuvagalam: 3వేల కిలోమీటర్లు పూర్తైన యువగళం పాదయాత్ర
Nara lokesh Yuvagalam: టీడీపీ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 3వేల కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించింది. నేడు తేటగుంటలో 3వేల కి.మీ. ల పైలాన్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి లోకేష్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ హాజరు కానున్నారు.
Nara lokesh Yuvagalam: నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటితో గోదావరి జిల్లాల్లో పూర్తి కానుంది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర 3వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. 218వరోజు యువగళం పాదయాత్ర తుని నియోజకవర్గం ఒంటిమామిడి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభం కాగా, దారిపొడవునా జనం నీరాజనాలు పలికారు.
వివిధవర్గాల ప్రజలు యువనేతకు సంఘీభావం తెలియజేసి, తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేతకు చెప్పకున్నారు. మరో 3నెలల్లో చంద్రబాబు నేతృత్వంలో రాబోయే ప్రజాప్రభుత్వం అందరి సమస్యలు పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు. శృంగవృక్షంలో కాకినాడ సెజ్ బాధిత రైతులతో ముఖాముఖి సమావేశమై వారి కష్టాలు తెలుసుకున్నారు.
218వరోజు యువగళం పాదయాత్ర ఒంటిమామిడి తొండంగి, శృంగవృక్షం, వలసపాకల, టి.తిమ్మాపురం మీదుగా తేటగుండ విడిది కేంద్రానికి చేరుకుంది. యువగళం పాదయాత్రలో 219వరోజు సోమవారం చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది.
యువగళం పాదయాత్ర 3వేల కి.మీ.ల చేరుకున్న సందర్భంగా తేటగుంట యనమల అతిధిగృహం వద్ద యువనేత లోకేష్ పైలాన్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి లోకేష్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ హాజరు కానున్నారు. 218వరోజు యువనేత లోకేష్ 16.3 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 3006. 7 కి.మీ.లు పూర్తయింది.
ఉభయగోదావరి జిల్లాల్లో 23రోజులపాటు 404 కి.మీ.ల మేర కొనసాగగా, సోమవారం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రవేశించనుంది. ఉభయగోదావరి జిల్లాల నాయకులు, కార్యకర్తలు యువనేతకు వీడ్కోలు పలకనుండగా, యువనేతకు భారీ స్వాగతం పలికేందుకు ఉత్తరాంధ్ర నాయకులు ఏర్పాట్లు చేసుకున్నారు.
రాష్ట్రంలో రానున్నది నిశ్శబ్ధ విప్లవం, జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలపడం ఖాయమని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. తుని నియోజకవర్గం శృంగవృక్షం వద్ద కాకినాడ సెజ్ బాధిత రైతులతో యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. మూడు నెలలు ఓపిక పట్టండి, నేను ఇచ్చిన హామీలు అన్ని నిలబెట్టుకుంటానని లోకేష్ ప్రకటించారు.
రాబోయేది ప్రజా ప్రభుత్వమని రైతులు ఎవరికైతే నష్ట పరిహారం అందలేదో వారికి నష్ట పరిహారం అందిస్తామన్నారు. కంపెనీల నుండి వచ్చే కలుషిత నీరు బయటకు రాకుండా శుద్ది చేస్తామన్నారు. అధికారంలోకి రావడం లక్ష్యంగా ఆ రోజు జగన్ ఎకరానికి రూ.75 లక్షలు ఇస్తామని మోసం చేసాడని తాను అలాంటి దొంగ హామీలు ఇవ్వనన్నారు. సెజ్ రైతులు న్యాయం కోసం పోరాడితే కేసులు పెట్టి వేధిస్తున్నారని, వైసిపి ప్రభుత్వానికి గుణపాఠం ప్రజలే చెబుతారన్నారు.